గ్రహపీడలు , శతృబాధలు తొలగించే కాలభైరవాష్టమి

గ్రహపీడలు , శతృబాధలు తొలగించే కాలభైరవాష్టమి (30-11-22)
- లక్ష్మిరమణ
కాలభైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ”ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి , తన్నో కాలభైరవ ప్రచోదయాత్” అని ప్రార్థిస్తారు. కాలభైరవాష్టమి లేదా కాలాష్టమి రోజున ఈ మహిమోపేతుడైన స్వామిని అర్చించారంటే, దుష్ట గ్రహ పీడలు తొలగిపోతాయి . జీవితంలో సుఖం , శాంతి వెల్లివిరుస్తాయి .
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడు. కుక్క అంటే రక్షణకు, విశ్వసనీయతకు మారుపేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు.శాశ్వతుడు, నిత్యుడు. ఆయన ప్రతిరూపంగా గ్రామ సింహాలైన కుక్కలని కాలాష్టమి నాడు పూజించడం ఆనవాయితీగా ఉన్నది.
కాలాష్టమి రోజున శని,రాహు, కేతువు దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తే, శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు పెండింగ్ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ రోజున కాలభైరవ పూజ చేయడం ద్వారా అన్ని రకాలైన భయాలు దూరమవుతాయి. రక్షకుడైన కాలభైరవుడు ఆ భయాలని దూరం చేసి చూపిస్తాడు.
కాలాష్టమి రోజున భైరవ దేవాలయంలో పచ్చిమిర్చి, ఆవనూనె, కొబ్బరి, శెనగలు దానం చేయాలి. భైరవుని చిత్రం లేదా విగ్రహం ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించి, శ్రీకాల భైరవ అష్టకం పఠించాలి. అలాగే తీపి రొట్టెలను కాల భైరవుని వాహనమైన నల్ల కుక్కకు తినిపించాలి. నల్ల కుక్క అందుబాటులో లేకుంటే ఏ కుక్కకైనా రోటీ తినిపిస్తే శని, కేతు దోషాలు తొలగిపోతాయి.
ఇలా కాలాష్టమి రోజున కాల భైరవునితోపాటు , దుర్గాదేవిని, పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు .
#kalabhairava #kalabhairavastami
Tags: kalabhairava, Kalabhairavastami,