శివలింగాలని ఇలా పూజిస్తే, అనంతమైన ఫలితం అందిస్తాయి .
శివలింగాలని ఇలా తయారు చేసి పూజిస్తే, అనంతమైన ఫలితం అందిస్తాయి .
లక్ష్మీ రమణ
శివార్చన చేయడం వలన ఇహానికీ పరానికి సంబంధించిన కోరికలు ఏవైనా నెరవేరతాయి అనడంలో సందేహమే లేదు . అయితే ఆ లింగార్చనని భూసూక్తంతో కలిపి చేసినట్టయితే మరింత త్వరగా మనకి ఆ స్వామి అనుగ్రహం సిద్ధిస్తుంది . సహస్రలింగాలని (1000 లింగాలని) మృత్తికతో ( మట్టితో) తయారుచేసుకొని , పూజించినట్లయితే అనంతఫలితాలని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి . యజ్ఞాలు , యాగాలు, దానము , తపస్సుల చేత పొందిన పుణ్యముకన్నా అపారమైన పుణ్యసంపదని ప్రసాదించే ఆరాధన ఈ సహస్రలింగారాధన . ఈ తరగనిగని వంటి ఫలితాలని అనుగ్రహించే తేలికైన పూజావిధానం ఇది. అయితే, మనకి అవసరమైన లింగస్వరూపాన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. లింగస్వరూపానికి మనం ఉపయోగించే మిశ్రమం పైన కూడా మనకి వచ్చేటటువంటి ఫలితము ఆధారపడి ఉంటుందట ! ఆ విశేషాలు తెలుసుకుందాం.
మహా లింగార్చనలో ఉపయోగించే వేయిలింగములని మృత్తికతో తయారుచేస్తారు. ఆ మట్టి లింగముగా మారేముందర దానిలో మిశ్రమము చేసేటటువంటి ధాతువులు (పదార్థాలని ) అనుసరించి ఆ పూజ యొక్క ఫలము అనంతమైనదిగా ఉంటుందని శాస్త్రములు తెలియజేస్తున్నాయి. శివుడు సర్వమంగళకరుడు. బోళాశంకరుడు. ఏరూపంధరించినా అమృతకరుడే ఆ మహాశివుడు . అయినా ఆయన రూపవిలాసంలోనూ అనుగ్రహవిశేషం కలిసిఉండడం భక్తులకి అమృతఆశీర్వాదమే కదా ! పంచభూతాలూ తానైన స్వామీ మృత్తికలో ఒదిగిపోయి మనకోసం యెంత కరుణ ఒలికిస్తున్నాడో చూడండి !!
మృత్తికలో శ్రేష్టమైన కస్తూరిని కలిపి నిర్మించినటువంటి లింగము అత్యంత శ్రేష్ఠము. భక్తి చేత ఒక్కరోజు పూజించినప్పటికీ, సకల సంపదలనూ ఆ క్షణములోనే అనుగ్రహించి ఆదుకుంటుంది .
శ్రీ గంధాన్ని మృత్తికతో మిశ్రమము చేసి తయారు చేసినటువంటి లింగాన్ని సశాస్త్రీయముగా 20 రోజులపాటు భక్తితో పూజిస్తే, తాప జ్వరాలని పోగొడుతుంది.
కస్తూరి కలిపినటువంటి మట్టితో చేసినటువంటి లింగములను 10 రోజులపాటు భక్తితో పూజించినట్లయితే, ఆత్మదోషము వలన వచ్చేటటువంటి సర్వరోగములూ కూడా నిస్సందేహంగా తొలగిపోతాయి.
చక్కర కలిపిన మట్టితోటి లింగమును తయారుచేసి, మూడు నెలల పాటు క్రమము తప్పకుండా పూజించినట్లయితే, సభలలో నేర్పుగా మాట్లాడడం , ప్రసంగించగలిగినటువంటి పాటవం, మంచి కవిత్వ పటిమ అలవడుతుంది.
బియ్యపు పిండిని మట్టితో మేళవించి చేసినటువంటి లింగాన్ని మూడు నెలల పాటు నియమానుసారంగా పూజించినట్లయితే, మంచి పుత్రుడిని పొందుతారు అనడంలో సందేహమే లేదు.
మృత్తికలో పసుపును కలిపి లింగాన్ని నిర్మించి ఆలింగాన్ని వంద రోజులపాటు పూజించినట్లయితే చక్కటి రూపము, ఐశ్వర్యము, రాజ్యలాభము కలుగుతాయి .
ఆవు నేతిని కలిపి లింగాన్ని తయారుచేసి 50 రోజులపాటు సక్రమంగా విధివిధానాలతో పూజించినట్లయితే పైత్య రోగము తగ్గిపోతుంది .
ఎర్ర గంధాన్ని మట్టితో కలిపి లింగాన్ని చేసి భక్తిశ్రద్ధలతో 32 రోజులు పూజించినట్లయితే దగ్గు దమ్ము తదితర రోగాలు తగ్గిపోతాయి.
తోహ చూర్ణము లేదా ఇనుప రజను మృత్తికలో కలిపి లింగాన్ని తయారుచేసి 22 రోజులపాటు రాత్రిపూట అర్చిస్తే, శత్రు నాశనం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.
ఇక మృత్తికలో నువ్వులు కలిపి సిద్ధము చేసినటువంటి లింగాన్ని ఏడు రోజులపాటు శ్రద్ధగా అర్చిస్తే యమ బాధలు అప మృత్యు దోషాలు తొలగిపోతాయి.
‘లింగార్చన చేసేటటువంటి భక్తుడు తన మనస్సులో ఏ కోర్కెలనైతే కోరుకుంటాడో ఆ కోర్కెలు నా అనుగ్రహము చేత తప్పకుండా నెరవేర గలవు’ అని ఆ పరమశివుడే స్వయముగా సెలవిచ్చారు. భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షసులు ఇటువంటి మహాలింగార్చనను చూసి పారిపోతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు.
అయితే, స్థల బేధము వలన లింగార్చన ఫలము అధికమవుతూ ఉంటుంది. ఇంట్లో లింగార్చన చేసినట్లయితే ఒక భాగం ఫలము, నదీ తీరాన పూజించినట్లయితే 1000 రెట్ల ఫలము, దేవత నివాసాలలో అర్చించినట్లయితే లక్ష రెట్లు, విష్ణవాలయాలలో పూజించినట్లయితే నూరులక్షల ఫలితము సిద్ధిస్తుంది .
అదేవిధంగా , శివాలయాలలో ఈ మహాలింగార్చన చేసినట్లయితే కోటి రెట్లు, పర్వత గుహలలో పూజించినట్లయితే 10 కోట్ల రెట్లు, ఆ గుహ ఋష్యాశ్రమమైతే కోటి కోట్ల రెట్లుగా లింగార్చన ఫలితము కలుగుతుంది. బ్రహ్మ క్షేత్రములో శివార్చన చేస్తే అమితమైన ఫలము లభిస్తుంది. ఇదంతా ఒకఎత్తయితే, శ్రద్ధా భక్తులు లేని ఏ పూజకైనా ఫలితము శూన్యమని భక్తులు గుర్తుంచుకోవాలి .