ఆ శివునిపై భక్తి ఎలా ఉండాలి ?
శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు , గిట్టదు అంటారే !మరి ఆ శివునిపై భక్తి ఎలా ఉండాలి ?
లక్ష్మీ రమణ
జీవితంలో కస్టాలు , నష్టాలు ఎన్నో అనుభవిస్తాం. పుట్టిననాటి నుండీ, పోయేవరకూ మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవిస్తాం . కానీ శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు , గిట్టదు అంటారే ! మరి మనం ఎందుకు పుట్టినట్టు ? ఎందుకు గిట్టినట్టు ? ఆలోచించారా ఎప్పుడైనా ?
భగవంతుడు మనకి ఎన్ని జన్మలు అనుగ్రహించారో తెలీదు. క్రితం జన్మలో మనం చేసుకున్న పుణ్యమేదో మనల్ని మనిషి జన్మని పొందేలా అనుగ్రహించి ఉండవచ్చు. చదువురాలేదని, డబ్బులు కావాలని , ఉద్యోగంలో మరింత పైమెట్టుకి ఎదగాలని, ఫలానా అమ్మాయితో పెళ్లి కావాలని ఇలా రకరకాల కోరికలతో దేవుణ్ణి ఆశ్రయిస్తుంటారు . కానీ మానవ జన్మ ఎత్తాక భగవంతుణ్ణి అడగాల్సినవి రెండేరెండు కోరికలు. ఇహలోక సౌఖ్యం . దాని వల్ల భగవంతుని ధ్యానంలో ఆటంకాలు లేకుండా గడిపి, పొందగలిగిన మోక్షం .
అసలు భగవంతుని మీదుండే భక్తి ఏవిధంగా ఉండాలనేదానికీ ఒక లెక్కుంది అంటారు నారద మహర్షి. నవవిధభక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు ఉన్నాయని భాగవతం చెబుతుంది . ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం:
శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం
దీనిప్రకారం భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.
దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.
సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు.
శంకర భగవత్పాదులు ఇలా అంటారు.
“మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే”
(మోక్ష కారణలైన సామాగ్రులలో “భక్తి” గొప్పది. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది)
తన నిజ స్వరూపంతో విడదీయలేనట్లుగా కలిసి పోవడమే భక్తి. పై శ్లోకంలో ఇదే భావాన్ని శంకరులు శివానందలహరిలో చక్కగా ఉదాహరణలతో గొప్ప యోగరహస్యాన్ని చొప్పించి మరీ చెప్పారు.
1. అంకొల వృక్షము యొక్క బీజములు చెట్టుచే ఆకర్షింపబడి నట్లుగా
2. అయస్కాంతము చేత సూది (అయస్కాంత క్షేత్రములోకి వచ్చిన వెంటనే చటుక్కున అతుక్కుపోయినట్లుగా)
3. సాధ్వి ఎల్లప్పుడూ తన విభుని చేరునట్లుగా (సాధ్వి అలోచనలు ఎల్లప్పుడూ తన విభునియందే ఉండునట్లుగా)
4. లత (పూలతీగ) చెట్టుని పెనవేసుకున్నట్లుగా
5. నదులు తమ వల్లభుడైన సముద్రములో లీనమైనట్లుగా (నామ రూపాలను వదలి)
చిత్త వృత్తులు పరమేశ్వరుని పాదారవింద ద్వయమునందు చేరి ఎల్లప్పుడూ ఉంటవో దానినే భక్తి అందురు.
ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి అనే ఐదూ చిత్తవృత్తులనీ, ఈ చిత్త వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి యోగ సూత్రం. అదే భక్తి అనబడుతుందని శంకరుల వివరణ. ఇలాంటి భక్తి వలననే మానవుడు తరిస్తాడు.