దుష్టగ్రహబాధలు నివారించే కాలభైరవుడు
దుష్టగ్రహబాధలు నివారించే కాలభైరవుడు
-లక్ష్మీ రమణ
మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి దీనినే భైరావాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు.ఈ స్వామి వాహనం శునకం(కుక్క)అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు.ఈ భైరవావతారానికి సంబంధించిన వృత్తాంతం శివపురాణంలో కనిపిస్తుంది .
ఒకానొక సందర్భంలో బ్రహ్మ ,విష్ణువు మధ్య వివాదాంశం తలెత్తింది.విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? ఇది చర్చకు దారి తీసింది. అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు-సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తెల్చిచెప్పాడానికి వీలుకానిది ఈ సమస్య దీనికి కారణం మీరిద్దరూ ఆశక్తి విభూతి నుండే ఏర్పడిన వారే కదా! అన్నారు ఋషులు. ఈ వాదనను అంగీకరించిన శ్రీ మాహావిష్ణువు మౌనం వహించాడు.కాని బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. ఆ పరతత్వం మరెవరోకాదు ,నేనే అని బ్రహ్మ అహంను ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు.ఆయన ఐదవ తలని తన కొనగోటితో త్రుంచేశాడు . ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావటంతో "కాలభైరవాష్టమి" గా ప్రసిద్ధి చెందింది.
కాలభైరవుని చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం వదిలించుకోలేక పోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఆ కాశీనగరంలో కాలుపెట్ట గానే, కపాలం చేతినుండి విడిపోయింది.భైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీ క్షేత్రంలోని ఈ ప్రాంతమే ‘కపాలమోచన దివ్యతీర్ణంగా ప్రసిద్ధమైంది. కాలభైరవడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు.
కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం.
అని ఆ కాలభైరవునికి ఒక బిల్వదళాన్ని గనుక సమర్పిస్తే, అంతటి రౌద్రరూపుడైన స్వామి కరిగి కరుణాసముద్రుడై అనుగ్రహిస్తాడని పురాణోక్తి .
ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. పాపాల్ని పరిహరించే వాడిగా పాపభక్షకుడు అయ్యాడు. ఈ తీర్ధానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుతీరి ఉంటాడు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే కాలాష్టమిగా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించు కునే వారూ కూడా ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఇక్కడి ప్రత్యేకత .
ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల నమ్మకం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. కాలభైరవుడిని ఉపాసిస్తే మనలోని దుర్గుణాలు తొలగి పోతాయని సాధకులు చెబుతారు.