Online Puja Services

అర్థనారీశ్వర తత్త్వం ఇదే

13.58.204.147

అర్థనారీశ్వర తత్త్వం ఇదే 
-సేకరణ : లక్ష్మి రమణ 

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని పురాణాలలో చెప్పబడి ఉంది . తలనుండి కాలి బొటనవేలివరకూ సమానము గా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ , ఆడ రూపాలు ఒకటిగా ఉండడము అర్ధ (సగమైన ) నారి (స్త్రీ) , ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది . తల ఆలోచనకి , పాదము ఆచరణికి సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట .

లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా - ఆచరణలోనూ , ఆలోచనలోనూ, కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని మన పురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. 

అర్ధనారీశ్వరుడు:

శివుడు, శక్తి... కలిసి ఒకటిగా పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ) గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ) గా పండితులు చెబుతారు.

ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. దీన్ని కాలానికి అన్వయిద్దాం. ఈశ్వరుడు అంటేనే మహాకాలుడు . కాల స్వరూపమైన ప్రకృతి కాళిక. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.

ఆది దంపతులు - జగత్పితరులు:
పరమేశ్వరుణ్ణి 'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే.
ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం.

ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. 

సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమ శక్తితో కూడి ఉన్న ఆ పరమ ఈశ్వరుణ్ణి  చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో ‘బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని ధరించానని’ చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.

సృష్టి ఆవిర్భావం:
స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించి, దర్శనమిచ్చాడు.

కాబట్టి, పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు.

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore