శివయ్యా నీవే దిక్కయ్యా
శివయ్యా
వేద మంత్రాల
పఠనము ఎరుగను
భక్తితో చేయు భజనలు తప్ప
యజ్ఞ యాగాల
జ్ఞానము లేదు
అన్నినీవేనన్న ఆలోచన తప్ప
శ్రుతులు క్రతువుల
పరిజ్ఞానము లేదు
నీవున్నావన్న నమ్మకము తప్ప
పురాణముల స్మృతులు
పరిభాష తెలియదు
ఆర్తితో నిను వేడుకొనుట తప్ప
ఏమీ ఎరుగకపోవటము
జ్ఞానమో అజ్ఞానమో ఎరుగను
కానీ
నిన్ను మెప్పించిన కన్నప్ప
నాకు ఆదర్శము
నిన్ను ఒప్పించిన నయనార్లు
నాకు మార్గదర్సకులు
ఏమీ ఎరుగకున్నా
నీవున్నావని త్రికరణ శుద్ధిగా
నమ్మితే చాలదా
గుండె గుడిలో ప్రతిష్ఠితమై
ఆర్తితో జనించిన కన్నీటినే
అభిషేక జలముగా స్వీకరించి
జనన మరణాల చక్ర భ్రమణమును నిలిపి
నీ పదసన్నిధిని ఒసగగల కరుణాసముద్రుడవు నీవయ్యా
శివయ్యా నీవే దిక్కయ్యా
- మురళి కలికోట