శివనామ స్మరణం - సర్వ పాపహరణం
శివనామ స్మరణం - సర్వ పాపహరణం
ఒకానొక కాలంలో కౌశికుడు అనే
ధనవంతుడుండేవాడు.
ధనమైతే సంపాదించాడు కానీ జీవితంలో ఒక్కసారికూడా ఏ పుణ్యకార్యమూ ఆచరించలేదు.
అందరిలాగే వృధ్ధాప్యం తో చనిపోయాడు...
ఆ ధనవంతుడు చనిపోగానే అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి యమకింకరులు వచ్చారు.
అదే సమయంలో అక్కడికి శివదూతలు వచ్చి " వీడిని మేము కైలాసానికి తీసుకుపోతున్నాము.
మీరు మరలిపొండి అని చెప్పారు...
బ్రతికివున్నంతకాలమూ ఏ మంచిపని చేయనివాడికి కైలాసప్రాప్తి తగదు. వీడి ప్రాణాలు మేమే నరకానికి తీసుకుపోతాము, అని యమభటులు వారించారు.యమగణాలకు ,శివగణాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. శివదూతలు యమదూతలను తీవ్రంగా గాయపర్చారు...
బాగా దెబ్బలు తిన్న యమభటులు
యముని వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. తక్షణమే,
యమధర్మరాజు కోపంతో శివలోకానికి వెళ్ళి శివగణాలకు నాయకుడైన
మహాకాలుని కలుసుకుని
న్యాయం అడిగాడు.
అందుకు మహాకాలుడు
" యమధర్మరాజా ! ధనవంతుడు ఏ సత్కార్యమూ చేయనిమాట నిజమే. కానీ , ఇతని చిన్నతనంలో ఒక బ్రాహ్మణుడు ఇతనిని ప్రేమతో "త్రయంబకా" అని పిలిచేవాడు. సాటిలేని శివనామమైన ' త్రయంబకా" అని అతడు పిలువబడినందున అతను పునీతుడైనాడు, పుణ్యగతులకు అర్హత సంపాదించాడు. అందువలన అతనిని యమలోకానికి పంపలేము."
అని తీవ్రంగ సమాధానం చెప్పాడు
మహాకాలుడు.
ఒక పాపాత్ముని ఒక దైవం పేరు పెట్టి పిలచినంతమాత్రాన వాడు సద్గతులకు అర్హుడైపోతాడా ? ఇదెక్కడి న్యాయం.
నేను పరమశివుడినే
అడుగుతాను" అని
మహేశ్వరుని చూడబోయాడు. ఈ చర్య
మహాకాలునికి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. కోపంతో, నేను చెప్పినా వినకుండా నీవు శివుడిని కలవగలవా " అని యమధర్మరాజు గుండెలమీద
గదతో బలంగా కొట్టాడు. అంతే
యముడు మూర్ఛపోయాడు.
కొంతసేపటికి స్పృహ కలిగిన యముడు ఆ వైపుగా వస్తున్న బ్రహ్మదేవుని చూసి ,
" బ్రహ్మదేవా..నా దుస్ధితి చూశారుకదా.. ఏమిటి తరుణోపాయం ? శెలవీయండి " అని వ్యాకులపడ్డాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు " యమధర్మరాజా.. శివనామ మహిమలను అనిర్వచనీయం. పరమశివుని అద్భుత నామ మహిమలను సాధారణ బుధ్ధితో ఆలోచింపతగదు.
శివనామ స్మరణ మహిమ గ్రహించడం బహు దుర్లభం.
అందువలన మహాకాలునితో ఘర్షణ మాని వెనుదిరిగిపోవడమే శోభస్కరం "అని ఉపదేశించాడు.
అందువలన పరమేశ్వరుని నామవిశిష్టత లను గుర్తించి కొత్తగా జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులు
పుణ్యప్రదమైన మంచి పేర్లుపెట్టి వారు బుధ్ధిమంతులై, సన్మార్గంలో జీవిస్తూ ఆనందంగా వుండేలా పెంచి పెద్ద
చేయాలి.
- సేకరణ