అఘోరాలు స్వాగతం
"హిమాలయ విజ్ఞానం "
"పంచశీలయాత్ర - శాంతికుండ్ - కేదారినాధ్ - హిమాలయాస్"
అఘోరాలు స్వాగతం:-
కేదారినాధ్ మందిరం అల్లంత దూరంలో ఉండగా కేదారినాధ్ సందర్శకులకు ముందుగా దర్శనం అయ్యేది అఘోరాలు... వారి వేషధారణ, వ్యవహారశైలి పై అనేకానేక కధలు ప్రచారంలో ఉన్న సంగతి మనకు తెలిసినదే.. శవాలు తింటారని, మలమూత్రాలనే భుజిస్తారని, కపాలం లోనే భిక్ష మెత్తుతారని, శవాలతో సంభోగిస్తారని ఇలా రకరకాల కధలు ప్రభావం ... వారిని చూసిన వెంటనే మన మనోఫలకం పై మన ఊహాచిత్రాలు రావడం జరుగుతుంది.. కానీ 'కానీ' లో ఉంటే అఘోరసత్రంకి వెళ్ళి అఘోర జీవన విధానంపై అవగాహన చేసుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది .. 'అఘోర' అంటే ఏమిటో .. అసలు అఘోర అన్న పదం యొక్క అర్థం ఘోరం కానిది అఘోర అని. అంటే అఘోరాలు కేదారి సమీపంలో ఉండడానికి ఉన్న అంతరార్థం .. కేదారినాధ్ ను సందర్శించడానికి విచ్ఛేస్తున్న వారికి మార్మిక సందేశం ఇవ్వడానికే కానీ సందర్శకుల నుండి వారు పైకం కానీ, సందర్శకుల అసహ్యం కానీ ఆశించడానికి కానేకాదు. అఘోరాలు ఇచ్చే సందేశం ఏమిటి అనుకుంటున్నారా ...!
"నీవు తక్షణం కేదారినాధ్ ను చేరుకోకపోతే నీ జీవితం ఘోరం" అన్న సందేశం చెప్పకనే చెపుతున్న హిమాలయ యోగులే అఘోరాలు. కానీ ఆధ్యాత్మికత అన్నది సరైన అవగాహన లేక వారిని, వారి జీవితాలని మనం ఘోరం అనుకుంటున్నాం .. అయితే వారు చెపుతున్నది మా జీవితం ఘోరం కాదు (అఘోర) అన్నది ... అంటే శివసాన్నిధ్యం కాని జీవితం ఘోరం. శివసాన్నిధ్యం పొందిన జీవి జీవితం అఘోరం .. శివసాన్నిధ్యం పొందడానికి పాండవులు .. అరణ్యవాసంలో మొట్ట మొదట సందర్శించిన ప్రదేశమే ... కేదారినాధ్...!
ఏ యాత్ర చేయడం ద్వారా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ మహాశక్తులు పరిణితి చెందుతాయో ఆ యాత్ర పేరే పంచశీలయాత్ర అని శ్రీకృష్ణుల వారు పాండవులకి ఉపదేశించారు. ఈ హిమాలయాలలో తీర్థయాత్రలు చేయండి. పుణ్యము, పురుషార్థము రెండు కలిసి వస్తాయి అని శ్రీకృష్ణుల వారు చెప్పగా పాండవులు పంచశీల యాత్రకు బయలుదేరారు.
ప్రతి ఒక్కరికీ చేతికి ఐదు వ్రేళ్ళు ఎందుకు వున్నాయంటే ఈ పంచ మహాకోశాలలో ఎవరయితే శీలతని పొందుతారో, పరివర్తన చెందుతారో వారు (వారి శీలము) ఒక శిఖరాన్ని అధిరోహించగలరు.
ఏదారి లేకపోతే కేదారేగతి అని ఒక సామెత ఉంది. పాండవులు అగస్త్యముని అనే గ్రామం నుండి యాత్ర ప్రారంభించి గౌరీకుండ్ వైపు ప్రయాణం చేస్తూ గుప్తకాశి వెళతారు. మామూలుగా హిమాలయ యోగులు పంచ కేదార యాత్రలు చేస్తారు. పంచ కేదార యాత్రలు చేయడానికి 40 రోజుల సమయం పడుతుంది. శ్రీ కేదారి, రుద్రనాథ్, మహా ముక్తేశ్వర్, కపిలేశ్వర్, మహా నాగేశ్వర్ ఇవి పంచ కేదారులు. పంచకేదారుల మీదుగా ప్రయాణం చేస్తూ గౌరీకుండ్ చేరుకుంటారు. గౌరీకుండ్ ఒక అద్భుతమైన ప్రదేశం. మందాకినీ నదీతీరంలో ఉష్ణ కుండలాలు ఉంటాయి.
ఇంతవరకు మనం ఏ వెహికల్ ద్వారా అయినా వెళ్ళవచ్చు. ఇంక ఇక్కడి నుండి ముందుకి మాత్రం కాలినడకన గాని, గుర్రం మీద కానీ, డోలి మీద గానీ వెళ్ళాలి. ఇక్కడి నుండి కేదారినాథ్ 18 కి.మీ. నుండి 22 కి.మీ. వరకు వుంటుంది.
అలా ముందుకి ప్రయాణం చేస్తూ ఇంకొక 2, 3 కిలోమీటర్ల దూరంలో కేదారినాథ్ వస్తుంది అనగానే ఎర్రటి పెద్ద పెద్ద బండలు ఒక ఎత్తైన ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయి. అదే భైరవేశ్వర్, కేదారినాథ్ క్షేత్రపాలకులు భైరవనాధ్, క్షేత్రపాలకుని మనం దర్శించిన తరువాతనే క్షేత్రాధిపతి దగ్గరకి వెళ్ళాలి. అది క్షేత్ర ధర్మం.
కేదార్ నాథ్ ఆలయ నిర్వాహణ అంతా శంకర భగవత్పాదుల సూచనలతో, తన అంతర్ బోధనలతో ఠహరీ మహారాజులు నిర్వహిస్తారు.
షాలు, రావత్ లు, బండారీలు, హిమాలయ సానువులలో వున్నటువంటి శక్తిక్షేత్రాలన్నింటినీ సంరక్షిస్తూ వుంటారు. అందువలన వీరికి ఆ యా దేవాలయాల ప్రాంగణాలలో వీరికి ఆశ్రమం వుంటుంది. ప్రభుత్వం వారు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారు, ఎండోన్మెంట్ డిపార్ట్ మెంట్ వారి తరపున ఒక అధికారి వుంటారు. ఆ యొక్క కైంకర్యాలు, పూజలు నిర్వహించటానికి ఒక పూజారి వ్యవస్థ కూడా వుంటుంది. వీరు ముగ్గురే కాకుండా ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఒక నాగాబాబా వుంటాడు.
ఈ నాగాబాబా గుడి బయట కూర్చుంటాడు. గుడి లోనికి వెళ్ళడు. వీళ్ళెవరో ... వీరి పేరేమిటో .. వీరు ఎక్కడినుండి వస్తారో, ఎన్ని రోజులు వుంటారో ఎవరికీ తెలీదు. వున్నంతసేపు క్షేత్రాధిపతి సేవలో క్షేత్రపాలకులుగా మాత్రమే నిమగ్నమై వుంటారు.
గుడిముందు వున్నటువంటి తన ధుని ముందే వుంటారు. కాని తను ఇక్కడ ఏ క్రియ అయితే చేస్తూ వుంటాడో అదే లోపల జరుగుతూ వుంటుంది. ఇక్కడ నుండి సంకేతాలు ఇస్తూ వుంటాడు. రాత్రి సమయంలో ఆలయం మూసివేసిన తరువాత ఆ నాగాబాబాలే గుడితాళాలు అప్పచెబుతారు. ఇలాగ మొత్తం హిమాలయాలలో వున్న సమస్త ఆలయాలలోనూ నాగాబాబా వ్యవస్థ ఖచ్చితంగా వుంటుంది. వారే ప్రత్యక్ష కాలభైరవులు. క్షేత్రపాలకులు.
కాలభైరవేశ్వరుడిని దాటుకుంటూ 11,555 అడుగుల ఎత్తుకి వచ్చేసరికి అక్కడ చెట్లు వుండవు. ఆక్సిజన్ వుండదు. అంతదూరం నుంచి చూస్తూ వుంటే మూడు మంచు పర్వతాలు కనిపిస్తాయి. రెండు పర్వతాల మధ్య కేదారినాథ్ ఆలయం అద్భుతంగా దర్శనమిస్తూ వుంటుంది.
కేదారినాథ్ పర్వతశ్రేణుల నుంచి ఆలయాం లోనికి వెళ్ళేముందు పంచధాతువులతో చేయబడిన ఒక నందీశ్వరుడు కనిపిస్తాడు. నందీశ్వరుని పక్క నుండి చూస్తే అంతరాలయం గోడమీద శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదిమాత మాత్రమే కనిపిస్తారు. అక్కడి నుండి ముందుకు వెళితే కేదారేశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు.
మాయా మృగమైన మనస్సుని వెనుక నుంచి పట్టుకోవటమనే ఒకానొక విద్య కేదారేశ్వర్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేయటానికి ఈ యుగానికి ఒక అనుసంధానకర్త అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు అక్కడ కేదారేశ్వరుణ్ఢి ప్రాణప్రతిష్ట గావించారు.
అక్కడ నుండి 7 కి. మీ. వెళితే "బ్రహ్మగుహ" అని వస్తుంది. అక్కడికి 4 కి. మీ. దూరంలో "వాసుకి థాల్" అని వస్తుంది. అక్కడి నుండి ఇంకొక 4 కి.మీ. దూరం వెళితే "మహాత్మాగాంధీ లేక్" వస్తుంది. ఈ లేక్ లో మహాత్మాగాంధీ యొక్క అస్థికలను నిమజ్జనం చేశారు. అందుకే ఆ లేక్ కు ఆ పేరు వచ్చింది. ఎప్పుడు చూసినా ఎటువంటి కదలికలూ, కెరటాలు లేకుండా అత్యంత ప్రశాంతంగా వుండటం ఈ లేక్ యొక్క ప్రత్యేకత.
కాలభైరవుడి ప్రక్కనే వున్నటువంటి గుహ కేదార గుహ. మన ప్రస్తుత భారత ప్రధాని
"శ్రీ నరేంద్ర మోదీ" గారు ఎన్నోసార్లు ఆ గుహలో కూర్చుని ధ్యానం చేసారు. ఆ గుహలో గడచిన సంవత్సరంలో సుమారు 10గం.ల సమయం ధ్యానం చేసారు. కేదారినాథ్ వెళ్ళి ఏమి చేయాలో ప్రపంచానికి తెలియచేశారు.
మన ప్రధానిమంత్రి మోదీగారు
" భారతదేశ క్షేత్రపాలకులు ".
అక్కడి నుండి సుమారు 14 కి.మీ. ప్రయాణం చేస్తే అక్కడ వస్తుంది "తుంగనాథ్".
హిమాలయ తత్వదర్శి
-ధ్యానరత్న నందప్రసాదరావు
PMC ఛానల్ ఇన్ఫర్మేషన్ డెస్క్