తిరువణ్ణామలై క్షేత్ర విశిష్టత
తిరువణ్ణామలై క్షేత్ర విశిష్టత
ఈ తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులో ఉన్నది. దక్షిణాదిన ఉన్న పంచలింగ క్షేత్రములు పంచ భూతములకు ప్రతీకగా వెలసి ఉన్నవి. ఇది అగ్ని భూతమునకు ప్రతీక.
*ఇది త్రిమూర్త్యాత్మకము.
* ఇది భూమండలములో అన్నిప్రదేశాల కంటే పురాతనమైనదనీ, ఇది సమస్త భూమండలానికి మధ్యన ఉండి, దాని హృదయం వంటిదనీ చెప్పుకొంటారు.
* తిరు అనగా " శ్రీ "......".అణ్ణామలై " అనగా " పెద్దకొండ........ "దీనినే " అరుణాచలము " అంటారు. స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము.
* ఇక్కడి స్వామి అమ్మవార్లకు ఎన్నో పేర్లు ఉన్నవి. అణ్ణామలైస్వామి ఉణ్ణామలై అమ్మవారు...........అరుణాచలేశ్
*ఒకప్పుడు పార్వతీదేవి తాను వినోదార్ధం శివుని కన్నులు మూసి గావించిన అపరాధానికి ప్రాయశ్చిత్తముగా .......... ఘోర తపస్సు చేసి శివుని అర్ధభాగం పొందిన క్షేత్రము అరుణాచలమే.
అలా పార్వతీదేవి శివుని కన్నులు మూసినప్పుడు లోకములు అంధకార నిమగ్నములైనవి. అలా తనవల్ల జరిగిన ధర్మలోపమునకు చింతించి ఆమె ....... ఇప్పుడు నేనేమి చేయవలెనని శివుని ప్రశ్నించగా .......
కరుణాళుడైన శివుడు నా స్వరూపమేయైన నీకు ప్రాయశ్చిత్తమెందులకు ? ఐనను ధర్మ పరిపాలన చేయవలెను గదా.అంటూ.......
ఇంకా...........నాకు భిన్నము కాకపోయినను నీవు లోకసంగ్రహార్ధము ప్రాయశ్చిత్తము జరుపవలసియున్నది అంటూ ఇంకా......నీ తపస్సును వీక్షించి మానవులు ధర్మనిరతులై యుండుట నిశ్చయము అని ఎన్నో విషయములు చెబుతారు.
* ఆ తరువాత పార్వతీదేవి గౌతమముని ఆశ్రమమునకు వెళ్ళటం జరుగుతుంది.
ఆ తరువాత ఆమె తపస్సు చేస్తుండగా .......... ఆమె తపోమధ్యంలో మహిషాసురుడు విజృభించగా అంబ దుర్గా స్వరూపంలో మహిషుని సంహరించిన ఉదంతం అరుణగిరి సమీపాననే జరిగింది.
* పార్వతి మహిషాసురమర్ధనిగా ప్రఖ్యాతి జెందిన పరమ పవిత్ర క్షేత్రమీ అరుణాచలము.
* ఇంకా, ఒకసారి బ్రహ్మ...విష్ణుమూర్తి మధ్యన చిన్న వాగ్వివాదం జరుగగా ఒక మహాలింగము వారిమధ్యన జ్యోతిస్థంభరూపమున వెలసెను.
బ్రహ్మదేవుడు లింగాగ్రభాగము కనుగొనుటకు హంస రూపమున వెళ్ళటము, విష్ణుమూర్తి వరాహరూపమున లింగము యొక్క అంత్యభాగమును కనుగొనుటకు ప్రయత్నించిన కధ తెలిసినదే .
ఆ మహాలింగము........ ఈ అరుణాచలలింగమేనని భక్తుల విశ్వాసము.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపమే కావటం వల్ల .......... దీనిని చుట్టి ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమేనని భక్తుల విశ్వాసము.
*ఇక్కడ కార్తీక దీపోత్సవము, గిరిప్రదక్షిణ జరుగుతాయి.
ప్రతి నెలలో పౌర్ణమి రోజున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ అంటే ( నాకు తెలిసినంత వరకు ) గుడి దగ్గరనుంచీ బయలుదేరి కొండచుట్టూ నడిచి తిరిగి గుడి దగ్గరకు రావటం.
గిరిప్రదక్షిణ పాదచారులై శివస్మరణ కావిస్తూ ,తలమీద ఆచ్చాదన లేకుండా ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిధ్ధిస్తుందని మహాత్ముల వచనం.
గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివ స్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది.
*ఈ ప్రదక్షిణ మార్గం దగ్గరదగ్గర 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. గిరిప్రదక్షిణ చేసే మార్గంలో ఎత్తుపల్లాలు ఉండవు. రోడ్ సాఫీగానే ఉంటుంది.
పౌర్ణమి రోజున రాత్రిపూట ఆ వెన్నెలలో కొన్ని వేల మంది భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.
* గిరిప్రదక్షిణ చేసే దారికి అటుఇటు అనేక దేవాలయాలు ఉన్నాయి. కొందరు భక్తులు అవి కూడా దర్శించుకుంటూ ముందుకు సాగుతారు.
ఇంకా..
దారికి ఇరుప్రక్కలా రకరకాల తినుబండారాలు అమ్ముతారు. ఇడ్లీలు, దోసెలు,అరటి పండ్లు, తేనెలో మాగిన ఉసిరిక పండ్లు ఇలా..........
ఒక దగ్గర చాలా పెద్ద గిన్నెలో మొక్కజొన్న పొత్తులు ఉడకబెడుతుంటారు.
ఇంకొక దగ్గర బూందీ, కారప్పూస అమ్ముతారు. అవి కట్టెలపొయ్యి మీద వండటం వల్ల గమ్మత్తయిన పొగ వాసన వస్తూ పాతకాలం వంటలు గుర్తువస్తాయి.
* ఇక గుడిలో ప్రసాదాలు, సహజంగానే దైవ ప్రసాదాలు ఎంతో రుచిగా ఉంటాయి గదా.........
ఇదంతా గొప్ప సందడిగా ఉంటుంది.
*ఇక్కడ శ్రీ రమణమహర్షి వారి ఆశ్రమం ఉంది.
*ఇక కార్తీక దీపోత్సవము........... తమిళుల కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉచ్చలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. దీనికి .... తెలుగువాళ్ళ కార్తీక మాసమునకు ఒకోసారి వారం రోజులు లేక పదిహేను రోజుల తేడా ఉంటుంది.
* కార్తీక దీపం ఏ తేదీన వచ్చేది ........ ఆ సమాచారమును దేవస్థానం వాళ్ళు ముందే ప్రకటిస్తారు.
ఈ కార్తీకదీపోత్సవం సందర్భముగా తెల్లవాజామున భరణీ దీపం వెల్గిస్తారు. సాయంత్రమున కార్తీకదీపం వెలిగిస్తారు. కొండపైన అతి పెద్ద ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు.
దీనికి కొన్ని కిలోల నెయ్యి వాడబడుతుంది. కొండమీద జ్యోతి ........... భక్తులు సమర్పించిన నేయి హరించుకు పోయేవరకు వెలుగుతూ ఉంటుంది.
ఇది సాధారణంగా నాలుగయిదు రోజులు వెలుగుతుంది. ఒకోసారి పదిరోజులు కూడా వెలుగుతుంది. ఈ దీపం చూసిన వారికి మోక్షము సిధ్ధిస్తుందని భక్తుల విశ్వాసము .
* కార్తీకదీపానికి నేయి ఇంకా ............ అవసరమైన వాటికోసం డబ్బును భక్తులు దేవస్థానం వారికి పంపించవచ్చు.
ఈ కార్తీకదీపోత్సవం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ దీప ప్రమిదలో మిగిలిన నల్లటి పదార్ధము చిన్న భరిణలో అమ్ముతారు, భక్తులు దానిని తెచ్చుకొని దేవుని బొట్టుగా పెట్టుకుంటారు.
*అరుణాచలము భోగ క్షేత్రము....యోగక్షేత్రమూ కూడానని ప్రసిధ్ధి.
*శివుడు తన తన ప్రియభామిని అయిన పార్వతీ దేవికి ...........తెలిపిన విషములలో కొన్ని......
*అరుణేశ్వరీ అరుణేశ్వరుల సాన్నిధ్యము వలన సకల మానవులకు సర్వసిధ్ధులు సుకరములగును అనీ ..........
*ఇంకా......పర్వత రాజపుత్రి పరమేశ్వరుని ప్రసన్నని చేసికొని శివవామభాగినియైన ఈ దివ్య కధ వినువారికిని, పఠించిన వారికిని సర్వశ్రేయోదాయకమౌగాక అని........ పరమశివుడు సర్వజనులను ఆశీర్వదించినాడు.
పౌర్ణమి రోజుల్లో, కార్తీకదీపం సందర్భమున ........ తిరువణ్ణామలై వెళ్ళటానికి చెన్నై నుంచి స్పెషల్ బస్సులు చాలా వేస్తారు.........
కొంతమంది ఏం చేస్తారంటే.......సాయంత్రం ఇంటివద్దనే స్నానాది కార్యక్రమములు పూర్తి చేసుకుని చెన్నైలో బస్సు ఎక్కుతారు.
* తిరువణ్ణామలై చేరి గుడి తెరిచి ఉంటే స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని, ( ఒకోసారి పౌర్ణమి రోజుల్లో గుడిలో రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కష్టం. )........... ఆ రాత్రి గిరిప్రదక్షిణ చేస్తారు.
గిరి ప్రదక్షిణ ....... నడిచేవారి ఓపికను బట్టి మూడు లేక నాలుగు గంటలు పడుతుంది.
వారు అరుణాచలం కొండను దైవంగా భావిస్తారు.
ఇక మళ్ళీ బస్సెక్కి ఉదయం 9 గంటలకల్లా చెన్నై తిరిగి వస్తారు... .....
*ఇందులో కొన్ని విషయాలు అరుణాచల మాహాత్మ్యము గ్రంధములో చదివినవి.