వినాయకుడు కొడుకని శివునికి తెలియదా?
వినాయకుడు తన కుమారుడని దేవుడు అనే శివునికి తెలియదా?
ప్రతీసారి ఇటువంటి వికృత ప్రశ్నలు ఎవరు వేస్తారో చెప్పవలసిన అవసరం లేదు కానీ సమాధానం ఇచ్చుకునే సాహసం మాత్రం చేస్తున్నాను.
శివుడు త్రికాలజ్ఞుడు. ఆయనే సృష్టికి మూలం, అలాగే తనసృష్టిలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి పూర్తిగా తెలిసిన శుద్ధ సత్త్వ స్వరూపుడు. లీలావినోదంగా సృష్టి స్థితి లయ కారకునిగా తనను తాను విభజించుకుని పాలిస్తున్న త్రిగుణాతీతుడు. హరునిగా లయం చేస్తాడు. అటువంటి ఆయనకు తన కుమారుని జన్మ సంభవం తెలియదా? అది మూర్ఖులు అనుకుంటారు కానీ ఆయనకు సంపూర్ణంగా ఆ విషయం తెలుసు. ఆది దంపతులు ఇరువురు ప్రపంచానికి తమ లీల ద్వారా ఒక విషయాన్ని బోధించారు. అదేమిటో ఒకసారి అవలోకన చేసుకుందాము.
ఆదిశక్తి పార్వతి దేవి లోకాలకు మాత. ఆవిడ తన నలుగుపిండితో బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. శక్తి ఉన్న దేహమే శివం, లేనిది శవం. ఆవిడ తన చైతన్యాన్ని ఆధారభూతంగా చేసి ఒక బొమ్మకు ప్రాణం పోసింది. ఆది గణపతి మహా బలవంతుడు, తద్వారా మహా ఆవేశం, గర్వం పొడసూపాయి. సత్త్వాన్ని ఆశ్రయించని ఏ శక్తి అయినా హానికారకం అవుతుంది. సంపూర్ణంగా రజస్సు, తమస్సు నింపుకున్న శక్తి ఆ ప్రకటిత బాలుడు. తన తల్లి మాటలను వినబోయే పద్ధతిలో అన్నింటినీ తిరస్కరించాడు. ఇలా పక్కదారి పట్టిన జ్ఞానం లోకానికి హానికరం అని గుర్తించాడు సదాశివుడు. అలా తండ్రి ప్రేమతో వదిలేస్తే అది తన సృష్టికే నష్ట కారకం అవుతుంది. అతడికి తన సాత్త్విక శక్తి ఆపాదించాలి. కానీ ఆ మెదడుతో తన తోటివారికి అందరినీ అనాదరించి ధిక్కరించి బాధించాడు. అతడి గర్వం ఉన్న తల తెగిపడాలి. అందుకే ఆవేశాన్ని ఆశ్రయించి సదాశివుడు అతడి తలను నరికివేశాడు. అంతేకాదు ఏ తల అయితే జ్ఞానానికి సంకేతమో, ఏ తల అయితే తనకున్న, తనను ఆశ్రయించి ఉన్న వారికోసం అడ్డంకులను తొలగిస్తుందో, ఏ తల అయితే లోక పూజ్యత కోసం శివుని వద్ద వరం కోరుకుందో ఆ గజ ముఖాన్ని తీసుకుని వచ్చి ఆ బాలునికి అతికించి శివుడు ప్రాణం పోశాడు. ఆయనే మనం పూజిస్తున్న శుద్ధ సత్త్వ స్వరూపుడు గజముఖుడు, విఘ్ననాయకుడు, గణపతి.
గజముఖం జ్ఞాన శక్తికి కర్మ శక్తికి సంకేతం. చాలా అవలీలగా పనులు సాధించగలిగే గజముఖం సంకేతార్ధం. పార్వతి శక్తికి ప్రతిరూపం. శుద్ధ స్వరూపి ఐన ఆవిడ నలుగు పెట్టుకుని స్నానం చెయ్యడం అంటే రాజసిక తామసిక మలాన్ని తీసి, దాన్ని ఒక రూపం చెయ్యడం అంటే అజ్ఞానాన్ని పక్కన పెట్టి గుర్తించడం. శుద్ధ సత్త్వ స్వరూపం అయిన శివుడు జ్ఞానానికి సంకేతం. ఆది వినాయకుడు శివుని ఆపడం అంటే జ్ఞానాన్ని అజ్ఞానం నిలువరించడానికి ప్రయత్నించడం ఆ అజ్ఞానాన్ని దునుమాడి జ్ఞానాన్ని స్థాపించడం శివుడు ఆ బాలుని అజ్ఞానానికి కారణం అయిన మెదడు ఉన్న తల నరికి జ్ఞాన శక్తి అయిన గజముఖాన్ని అమర్చడం. ఇదంతా సంపూర్ణంగా అర్ధవంతమైన జ్ఞాన ప్రబోధ లీల. స్వామీ లీలను తెలిసిన పెద్దవారిని ఆశ్రయించి నేర్చుకుంటే అర్ధం అవుతుంది తప్ప కేవలం మిడి మిడి జ్ఞానం తో లోకుల కధ గా అవధరించకూడదు. దానికి నమ్మకం, జ్ఞాన ఇచ్చ ప్రధానం. కాదేది విమర్శకు అనర్హం. పూర్తిగా మెదడు ఎదగని వారికి తమ పనికిమాలిన పుస్తకాలు వాటిలో వాక్యాలు చదవడం అర్ధం అయిన వారికి ఇంతటి గొప్ప విషయాలు అర్ధం కావు. వారికి ఆ ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు కొంచెం మెదడు ఎదిగేలా దీవించాలని ప్రార్ధిస్తూ.......
సర్వం శ్రీరామార్పణమస్థు....