అమెరికాలో శివుడు
నిరంతర శివపూజలో హవాయిలోని ఓ ద్వీపం:
ఉత్తర అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని అందమైన ద్వీపం ‘కవాయ్’. సతత హరిత వనాలు, సరోవరాలు, జలపాతాలు, పంటభూములు, వివిధ జాతుల పశుపక్ష్యాదులతో నయన మనోహరంగా ఉండే ఈ దీవిని సందర్శించిన వారికి ఒక అపురూప దృశ్యం కనబడుతుంది. 376 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఒక శివాలయం, అందులో శ్వేత జాతీయులైన హిందూ సాధువులు శైవమతావలంబులై నిరంతరం శివారాధనలో నిమగ్నమై ఉండటం ఇక్కడ కనబడుతుంది. ఈ ఆలయాన్ని ‘కడవుల్’ ఆలయంగా పిలుస్తారు.
శివాలయానికి వచ్చేసిన భక్తులకు ముందుగా వినాయక విగ్రహం దర్శనమిస్తుంది. కొంచెం దూరంలో ఊడలమర్రి చెట్టు కింద త్రిమూర్తుల విగ్రహాలుంటాయి. అటు నుండి కుడివైపుగా ఒక గ్రంథాలయం వస్తుంది. దానిని దాటగానే ధ్వజ స్థంభం వద్ద నంది రూపంలో పెద్ద ఏకశిలా విగ్రహం కనులకింపుగా దర్శనమిస్తుంది. గర్భగుడిలో 700 పౌండ్ల బరువు గల ‘స్ఫటిక లింగం’, ఆ వెనుక నటరాజ స్వామి విగ్రహం, కుడి ఎడమలలో వినాయకుడు, కార్తికేయుల విగ్రహాలుంటాయి.
గర్భగుడి లోపల 108 బంగారు నటరాజస్వామి విగ్రహాలు గోడకు తాపడం చేసి ఉంటాయి. గోడకు ఒక మూలగా ఈ ఆలయాన్ని నిర్మించిన గురుదేవుల బంగారు విగ్రహానికి నిత్యపూజలు జరిపిస్తున్నారు. ఈ ఆలయంలోని అద్భుతమైన విశేషం ఏమిటంటే ఇక్కడ 21 మంది సాధువులు ప్రతి మూడు గంటలకు ఒక్కొక్కరు చొప్పున 24 గంటలూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటారు. 1973 నుండి ఇంతవరకూ ఎలాంటి అంతరాయం లేకుండా అవిచ్ఛిన్నంగా ఈ శివారాధన జరుగుతోంది. ఈ నిరంతర శివారాధన వలన అద్భుత శక్తి ప్రకంపనలు ఉద్భవించి, భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలగజేస్తుంటాయి.
ఈ ఆలయ నిర్మాణానికి కారకులు సద్గురు శివాయ సుబ్రహ్మణ్యస్వామి (1927-2001) కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన శ్వేత జాతీయుడు. బాల్యం నుంచి ఎంతో తాత్త్విక చింతనతో ఉన్న ఈయన జీవన పరమార్ధాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అన్వేషిస్తూ ప్రపంచమంతా పర్యటించారు. భారత దేశమంతటా తిరిగి, శ్రీలంక చేరుకుని ‘శివయోగ స్వామి’ అనే గురువు వద్ద శైవ సిద్ధాంతాన్ని ఆమూలాగ్రం తెలుసుకుని సన్యసించారు. శైవ సిద్ధాంత సూత్రాలను తు.చ తప్పక అనుసరించే అనేకమంది సాధువుల మఠం (హిందూ మొనాస్టరీ)ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 37 శివాలయాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. వీటిలో ఈయన స్వయంగా దగ్గరుండి నిర్మించిన ఈ ‘కడవుల్’ ఆలయం అమెరికా దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ శైవాగమ పండితులు శివశ్రీ డా.టిఎస్.సాంబమూర్తి శివచారియర్ ఇక్కడి సాధువులకు శివారాధనలో శిక్షణ ఇచ్చారు.