మువ్వురు మానవులకు రథోత్సవాలు
మువ్వురు మానవులకు రథోత్సవాలు
దాదాపు ముప్పైయేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యు ఇనస్పెక్టర్ గా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు తహసీల్దారు గారు పిలుస్తున్నారని నా సహాయకుడు చెప్పడంతో వెళ్లాను.
“సుబ్రహ్మణ్యన్ ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమీషనరు కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టరుకు కూడా స్నేహితులు కనుక కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చెయ్యి” అని ఆదేశించారు.
తరువాత నేను కంచి మఠానికి విషయం తెలిపి, కావాల్సిన ఏర్పాట్లను చేశాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమీషనరు మఠానికి వచ్చి, పరమాచార్య స్వామివారికి నమస్కరించి, స్వామి ఎదురుగా కూర్చున్నారు.
దివ్యతేజస్సు ఉట్టిపడుతుండగా మహాస్వామి వారు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చెయ్యాల్సిన కుంబాభిషేకాల దాకా వెళ్ళింది.
శ్రీ శంకరాచార్య స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడున్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో ఉన్నప్పుడు స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తారు. అలా శ్రోతలను ప్రశ్నలను అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా అవి మరుగునపడక బాగా జ్ఞాపకం ఉంటాయని స్వామివారి ఆలోచన.
ఆరోజు కూడా కంచి స్వామివారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమీషనరుకే. “ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన మువ్వురు వ్యక్తులకు తీర్థ్-తిరువిళ (రథోత్సవం) జరుపుతారు ఇప్పటికి. ఆ మువ్వురు ఎవరు?” అని అడిగారు.
అది అడిగినది కమీషనరుకే ఆయినే అక్కడున్న మేమందరమూ మా బుద్ధికి పనిపెట్టాము. సాధారణంగా రథోత్సవం దేవుళ్ళకు మాత్రమే చేస్తాము. కానీ పరమాచార్య స్వామివారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని!
మా పరిస్థితిని గమనించిన స్వామివారు “మరొక్క ఐదు నిముషాల సమయం ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు” అని అన్నారు.
ఐదు నిముషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి స్వామివారు, “పర్లేదు. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి. నేనే సమాధానాలు చెబుతాను” అని చెప్పనారంభించారు.
“’చూడికొడుత్త నాచ్చియార్’ గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కు శ్రీవిల్లిపుత్తూర్ లో రథోత్సవం; శ్రీవైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజులకి శ్రీపెరుంబదూర్ లో రథోత్సవం; శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుందురైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం వీరు మువ్వురికి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు కూడా మీకు తెలిసిఉంటే మంచిది, అందుకనే అడిగాను” అని చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.
ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది.
--- ఏరాసు, చెన్నై - 61. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।