Online Puja Services

జంతూనాం నరజన్మ దుర్లభం

3.17.76.174

ఈ సృష్టిలో 
84 లక్షల జీవరాశులున్నాయంటుంది వేదం
ఈ జీవరాశులన్నింటినీ 
నాలుగు తరగతులుగా వర్గీకరించారు. 

1. జరాయుజములు - మావితోపుడతాయి
2. అండజములు -గుడ్డుబద్దలు కొట్టుకుని బయటికి వస్తాయి
3. స్వేదజములు -చెమట నుండి పుడతాయి, పేలవంటివి.
4. ఉద్బుజములు - భూమిని చీల్చుకుని పైకి వస్తాయి, చెట్లవంటివి. 

ఈ నాలుగురకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల జన్మలు తిరిగి తిరిగి అంటే పుట్టీ చచ్చీ, పుట్టీచచ్చీ, దాన్ని సంసార చక్రం అంటారు. అంటే జననమరణ చక్రమందు తిరుగుట అని. దీనికి అంతుండదు. శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం. ఈ సంసార చక్ర పరిభ్రమణం తాపం అంటే వేడితో ఉంటుంది. ఎందుచేత?

అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికయిందేమీ కాదు. భాగవతంలో *కపిలగీత* చదివితే పుట్టుక ఇంత భయంకరంగా ఉంటుందా! అనిపిస్తుంది. 

శుక్రశ్రోణితములు కలిసిన దగ్గర్నుంచీ తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి, తర్వాత ఆ పిండం పెరిగి పెద్దదై, మెల్లమెల్లగా అవయవాలు సమకూరిన తరువాత తలకిందకు, కాళ్లు పైకీ పెట్టి గర్భస్థమైన శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది చైతన్యాన్ని పొంది, జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే, తొమ్మిది నెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని కొట్టుకుని పరమేశ్వరుని ప్రార్థన చేసి, ఆయన అనుగ్రహించి ప్రసూతి వాయువు బయటికి తోసేస్తే అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు జీవుడు.

ఈ మనుష్యజన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో! ఆఖరికి చేసుకున్న పాపాలన్నీ చాలా భాగం తగ్గిపోయిన తర్వాత జన్మపరంపరలో పూర్తి చేసుకోవడానికి అవకాశమివ్వబడే చిట్టచివరి అవకాశం మనుష్య శరీరం. ఇదే మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం అంటారు శంకరులు. 

జననమరణాలు పోగొట్టుకునే అవకాశం ఒక్క మనుష్య శరీరానికి తప్ప మరే శరీరానికీ ఉండదు. దానితో ఒక్క మనుష్యుడు మాత్రమే కర్మానుష్ఠానం చేయగలడు. 

మనుష్యజన్మ వైశిష్ట్యాన్ని అంతసేపు చెప్పి చివరన *కురుపుణ్య మహోరాత్రం* అన్నాననుకోండి. అంటే మంచి కర్మలు చేయండి అన్నప్పుడు *మనుష్య శరీరం కానప్పుడు అదెలా సాధ్యం*?

మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. రెండు చేతులు కలిపి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలమీద ఉంచి బుద్ధిస్థానాన్ని దానితో కలిపి పదకొండింటినీ భగవంతుని పాదాల వద్ద న్యాసం చేయడం నమస్కారం. ఇలా ఏ ఇతర ప్రాణీ చేయలేదు. అందుకే అలా కర్మలను చేయుటవలన భక్తితో జీర్ణించిన కారణంచేత ఈశ్వరుని అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది. అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. 

అందుకే *జంతూనాం నరజన్మ దుర్లభం* అంటారు శంకరాచార్యులు. అంటే మనుష్యుడు కూడా జంతువే. 

*మనుష్యుడు జంతువెలా అవుతాడు*? 

జంతువును సంస్కృతంలో ‘పశు’ అంటారు.

పాశంచేత కట్టబడినది కాబట్టి పశువు అయింది. నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళు ఉన్నవే కాదు, శాస్త్రంలో మనుష్యుడు కూడా జంతువుగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే తత్త్వాన్నిబట్టి మనకు కూడా ఆ మూడూ ఉంటాయి. అందువల్ల మనల్ని కూడా పశువులు అని పిలుస్తారు. 

అయితే అలా అంటే మనం కాస్త చిన్నబుచ్చుకుంటామేమోనని శంకర భగవత్పాదులు *శివానందలహరి* చేస్తూ అదేదో తన మీద పెట్టుకున్నారు. 

*ఓ పరమేశ్వరా! నేను పశువుని, నీవు పశుపతివి* అన్నారు.

మనకు పశువుకులాగే ఒక శరీరం, మెడలో ఒక తాడు. ఆ తాడు కట్టడానికి ఒక రాయి. మెడలో తాడు అంటే కర్మపాశాలు. కర్మపాశాల చేత జన్మ అనే రాయికి కట్టబడతాడు. అలా కట్టబడి ఉంటాడు కనుక మనిషిని కూడా పశువు అని పిలుస్తారు. 

ఏ జంతువయినా పాశాలను విప్పుకుంటే యజమాని పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిందని గుర్తు. కానీ మనుష్యుడి విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది.

*సాధన* చేత మనుష్యుడి తాళ్ళు తెగిపడిపోతాయి. అంటే ఇక మళ్ళీ పుట్టనటువంటి స్థితిని పొందాడని గుర్తు. ఇది మిగిలిన జంతువులకు, మనిషికి ఉండే తేడా. కర్మపాశాల ముడి విప్పడం కాదు. కర్మపాశాన్ని పరమేశ్వరుడు తెంచేస్తాడు. 

అందుకే భగవంతుని స్వరూపాలన్నింటిలో ఏదో ఒక చేతిలో గొడ్డలి లేదా కత్తి కనిపిస్తుంది. దానితో కర్మపాశాలను తెంపి, భక్తి పాశం వేసి ఆయన తన దగ్గరకు లాక్కుంటాడు. తన పాద పంజరంలో కూర్చోబెట్టుకుంటాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని స్థితి కల్పిస్తాడు. ఇంత అదృష్టం ఒక్క మనుష్య శరీరానికే సాధ్యం. అందుకే శంకరుల వారు *జంతూనాం నరజన్మ దుర్లభం* అన్నారు.
.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore