Online Puja Services

14 లోకాలలో ఉండేదెవరు?

18.118.140.120

చతుర్ధశలోకాలలో నివసించేదెవరు..!

 

ఇతిహాస, పురాణాలను అనుసరించి, బ్రహ్మదేవుని సృష్టిలో చతుర్ధశ(14) భువనాలు లేక లోకాలు కలవు. మనం ఉన్న భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు, భూలోకంతో చేర్చి సప్త(7) లోకాలు కలవు. అలాగే భూలోకానికి కింద అతలలోకం, వితలలోకం, సుతలలోకం, రసాతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, పాతాళాలని సప్త(7) అధోలోకాలు కలవు.

భూలోకవాసులైన మానవులను తప్పించి ఇతర లోకాలలో ఉన్నవారు అధిక పుణ్యాత్ములు, అచ్చటనున్న జీవుల శరీరాలు అతిసూక్ష్మములైనవి. భూలోకం దక్షిణదిగ్భాగంలో మృత్యు (యమ) లోకం, ప్రేతలోకం, నరకలోకం, పిత్రులోకాలనే 4 భాగాలు కలవు.

*భూలోకం*

ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.

*భువర్లోకము*(భూలోకము పైన)

ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.

*సువఃలోకము* లేక *సువర్లోకము* లేక *స్వర్గలోకము*(భువర్లోకము పైన) ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.

*మహర్లోకము* (సువర్లోకము పైన)

ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.

*జనోలోకము* (మహర్లోకము పైన)

దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.

*తపోలోకము* (జనోలోకము పైన)

ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది.

భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు.

*సత్యలోకం*(తపోలోకము పైన)

ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావిస్తుంటారు.

మహాప్రళయకాలంలో బ్రహ్మలోక పర్యంతంగా గల సప్తలోకాలు పరబ్రహ్మంలో లయమవుతారు. బ్రహ్మ తన ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయం సంభవించి, భూలోకం, భువర్లోకం, సువ(స్వర్గ)ర్లోకాంలు లయం అవుతాయి. అతని పగటి కాలంలో పునః ఈ లోకాల సృష్టి జరుగుతుంది.

*సప్త అధోలోకములు:*

భూలోకానికి కింద ఉండేది అతల లోకం. ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు.

*వితల లోకం*(అతలలోకం కింద)- ఇక్కడ పార్వతీ-పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.

*సుతల లోకము*(వితల లోకం కింద)

సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.

*తలాతల లోకం*(సుతల లోకం కింద)ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.

*మహాతలము*(తలాతలలోకము కింద) 

ఇక్కడ కద్రుపుత్రులైన కాద్రవేయులు(సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.

*రసాతలము*(మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.

*పాతాళము* (రసాతలం కింద) - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును.

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore