జీవిత సత్యాలు
జీవిత సత్యాలు
శ్రీ గరుడ పురాణం
16వ అధ్యాయము
గరుడుడు మోక్ష మార్గం గురించి అడుగగా శ్రీమహావిష్ణువు ఈ విధంగా అంటున్నాడు . ఓ గరుడ! యమదూతల చేత కట్టబడి కొట్టబడి వెళ్తూ ఉండే జీవుడు భార్యపుత్రులతో కలిసి ఉన్న కాలంలో తన సుఖాలని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. పాపపుణ్యాలకి లోబడి తమ కర్మలని తగినట్లుగా దేహాన్ని ఆయువు భోగాన్ని పొందుతున్నారు . తమ కర్మని బట్టి వారు ౼ స్థావరాలు,పురుగులు, అజములు,పక్షులు పశువులు అవుతారుమ్ తరువాత నరులు , ధార్మికులు అయ్యి ముక్తిని పొందుతారు. స్థావరాది జన్మలో పుణ్యము చేస్తే నరుడుగా జన్మిస్తారు. 80 లక్షల జీవుల్లో తత్వజ్ఞాము పొందే శక్తి మనవుడికే ఉంది. అలాంటి మానవ జన్మ పొంది తత్వ జ్ఞానానికి ప్రయత్నించని వాడు ఎంతటి పాపి. అలాంటి శరీరాన్ని పొంది ఆత్మ హితము ఆలోచించని వాడు అత్మఘాతకుడు. దేహాన్ని రక్షించుకుంటూ పుణ్యకార్యాలు చెయ్యాలి . శరీరాన్ని ధర్మం కొరకు రక్షించాలి. ధర్మము జ్ఞానర్ధం అని , జ్ఞానము ధ్యానయోగార్ధమని గ్రహించాలి. తనని తానే ఉద్ధరించుకోవాలి తనకి హితుడు తానే అని తెలుసుకోవాలి.
నరకప్రాప్తి అనే రోగం తనకి రాకుండా సత్ప్రవర్తన ధార్మిక బుద్ది అనే మందుని వాడాలి. మరికొంత కాలం అయ్యిన తరువాత పుణ్య కార్యాలు చెయ్యాలి అనుకోకూడదు. ముందు మార్గంలో ముసలితనం అనే పెద్ద పులి పొంచి ఉంది. ఆయువు పచ్చి కుండలో నీరు వంటిది. శత్రువుల్లా రోగాలు పీడిస్తాయి అనే విషయాన్ని గుర్తించి తత్వజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి కాలాన్ని గుర్తించడం నియమించడం చాలా కష్టం
మోహమనే మద్యము తాగడం వలన తన ఎదురుగా బాధలు పడేవాడ్ని గతించేవారిని కూడా చూసి బాధ పడదు మానవుడు. సంపదలు కలలు వంటివి , యవ్వనం పుష్పం లాంటిది , ఆయువు మెరుపు లాంటిది ఈ విషయాన్ని గమనించిన వారికి ధైర్యం ఉంటుందా? నూరు సంవత్సరాలు ఆయువు చాలా తక్కువ నిద్ర,సోమరితనం వీటితో సహం జీవితం పోతుంది . బాల్యము రోగము,ముసలితనము వ్యాధులు మొదలైన వానితో మరికొంత జీవితం పోయింది. మిగిలింది ఎంత? నీవు సాధించింది ఎంత? మృతువు సదా సన్నిహితము. ఈ విషయాన్ని జీవి గుర్తించలేడు. తాను చేయాల్సింది ఏంటి? ఏమిటి చేసాడు ప్రస్తుత కర్తవ్యం ఏంటి? అని విచారించాడు సంసార బంధంలో పడి సర్వము శాశ్వతం అనుకుని,తోచినట్లు చేసి దిక్కుమాలిన స్థితిలో ఉంటాడు . దీనికి కారణం వీనిలో సంగం అంటే ఆసక్తి. ఆయా విషయాలని ఆసక్తమైన మనస్సుని మహాత్ముల సాంగత్యంలో ప్రవర్తింపజేయాలి . మహాత్ముల తోటి సాంగత్యమే సంగాన్ని పోగొడుతుంది. వివేకము కలిగి ఆలోచన నిర్మలమవుతుంది అలాంటివాడు సన్మార్గంలో ప్రవర్తిస్తాడు. జ్ఞాని అయ్యి ముక్తిని పొందుతాడు