మంచినే ఆచరించాలి
మనిషి జీవితంలో మూడువిధాలైన కర్మల్ని ఎదుర్కొంటాడని వేదాంతశాస్త్రం చెబుతోంది..
మనిషి చేసే కర్మలు మూడు రకాలు..
అంటే గతకాలంలో చేసినవీ, ప్రస్తుతకాలంలో చేస్తున్నవీ, రాబోయే_కాలాల కోసం చేసేవీ అన్నీ అనుభవంలోకి వస్తాయన్నమాట..
మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను సంచిత కర్మలుగా పిలుస్తారు..
సంచిలో సరకులను వేసి దాచినట్లు ఇవి దాగి ఉంటాయి కనుక ఇవి సంచితాలు..
చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ’ప్రారబ్ధ’ కర్మలు..
పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు..
మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు..
మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు..
ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై ’ఇలా ఎందుకు చేశాను?’ అని అనుకొంటాడు..
చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆరాటపడతాడు..
కానీ చేసిన పాపం వూరకే పోదు..
చేసిన తప్పువల్ల ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే..
రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు ’ఆగామి’ కర్మలు..
ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామికాలంలో ఉపయోగపడతాయి..
ఇలాగే పుణ్య, పాపకర్మల విషయంలోనూ మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం..
అందుకే మనిషి మంచినే భావించాలి...మంచినే భాషించాలి...మంచినే ఆచరించాలి...మంచినే అనుసరించాలి...