యాజ్ఞవల్కుడి అసమాన ప్రతిభ
ఆ రోజు మిథిలానగరం రంగరంగ వైభోగంగా అలంకరించబడి ఉంది. ఎటువైపు చూసినా జనం. ఎవరి నోట విన్నా ఆ రోజు జరగబోయే సభ గురించే ముచ్చట్లు. అందరూ మాట్లాడుకునేందుకు తగిన విషయమున్న సభ, అందరికీ ఆనందాన్ని పంచే సభ, పండితులందరూ ఒకచోట సమావేశమయ్యే సభ, ప్రజలందరూ కూడా హడావిడి పడుతున్న సభ జనకుడి ఆస్థానంలో జరగబోతోంది. జనకుడు 'బహుదక్షిణ' అనే యజ్ఞం చేశాడు. ఆ యాగానికి లోకంలో నలుమూలల్నుంచి మహాత్ములు, ఋషులు, మునులు, గొప్ప పండితులు పిలవబడ్డారు. అందరూ యజ్ఞానికి వచ్చారు. కురు పాంచాల దేశాల్నుంచి కూడా గొప్ప జ్ఞానవంతులైన బ్రాహ్మణులు కూడా వచ్చారు.
యజ్ఞం పూర్తి చేసిన జనకుడు పూర్ణాహుతి చేసి మిగిలిన యజ్ఞభాగాన్ని కూడా పూర్తి చేశాడు. ఋత్విజులకి దక్షిణలు ఇవ్వడం కూడా పూర్తయింది. దేశం నలుమూలల్నుంచి అక్కడికి వచ్చిన జ్ఞానుల్లో ప్రవచనాలు చెప్పడంలో ఎవరు గొప్పవాళ్ళో వాళ్ళని అందరి సమక్షంలోను సన్మానం చెయ్యాలని అనుకున్నాడు.
అక్కడకు వచ్చిన పండితులు, జ్ఞానులు తమ తమ గొప్పతనాన్ని నిరూపించుకునే రోజు. వాదంలో ఎదుటి వాళ్ళని ఓడించి తమ పాండిత్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చిన రోజు. విజ్ఞానవంతులకి అది పరీక్ష పెట్టే రోజు. గొప్ప అద్భుతమైన సమావేశాన్ని కళ్ళారా చూడగలిగిన రోజు. అటువంటి అవకాశం మళ్ళీ దొరకదేమో అని ప్రజలు ఉవ్విళ్ళూరుతున్న రోజు. కొంతమంది అటువంటి గొప్ప సభని చూసి ధన్యులమవుదామని సభ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చెప్పబోయే విషయాల నుంచి తమ జ్ఞానాన్ని పెంచుకుందామని ఎదురు చూస్తున్నారు. జనక మహారాజు మొదలు పెట్టిన ఈ సభలో సన్మానానికి అర్హులైన గొప్ప పండితులు ఎవరో తేల్చుకునేందుకు వచ్చిన పండితులు, గొప్ప జ్ఞానవంతుల్ని అందర్నీ ఒకేచోట ఉండగా చూడాలని వచ్చిన వేలాది మంది ప్రజలతో మిథిలానగరం జనసముద్రంగాను, మహాజ్ఞాన సముద్రంగాను కనిపిస్తోంది.
జనకమహారాజు ఏర్పాటు చేసిన సభాస్థలిని పచ్చటి తోరణాలతో అలంకరించారు. ఎవరి హోదాకి తగినట్టు వాళ్ళకి ఆసనాలు ఏర్పాటు చేశారు. సభలో గెలుపొందిన వాళ్ళకి ఇవ్వడం కోసం వెయ్యి ఆవుల్ని ఒక్కోక్కదానికి పదేసి బంగారు నాణాలు కొమ్ములకి కట్టి సభా ప్రదేశంలో నిలబెట్టారు. అసభని మొదలు పెట్టబోయే సమయం సమీపించింది. జనకమహారాజు, ఆయన పరివారం వచ్చి మహాత్ముల్ని, జ్ఞానవంతుల్ని, పండితుల్ని సాధరంగా తీసుకుని వచ్చి వాళ్ళకు కేటాయించబడ్డ ఆసనాల మీద కూర్చోబెట్టారు. ప్రేక్షకులతో సభ కిక్కిరిసి పోయింది. జనకమహారాజు రాగానే సభలో అంతమంది ఉన్నా కూడా పూర్తి నిశ్శబ్దత ఆవరించింది.
యాజ్ఞవల్క్యుడు మొదలన మహాత్ములందరూ ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తున్నారు. గార్గి మొదలైన విదుషీమణులు, బ్రహ్మచారిణులు సభలో రాణిస్తున్నారు. అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నాక జనకమహారాజు లేచి నిలబడి అందర్నీ ఉద్దేశించి మాట్లాడాడు. “పూజ్యులైన మహర్షులారా! బ్రాహ్మణులారా! మీరందరు నేను తలపెట్టిన ఈ యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. మీకందరికీ మా సేవకులు సరిగ్గా సేవలు అందించలేకపోయి ఉండచ్చు. అన్ని లోటుపాట్లకి మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను. మీవంటి తేజస్వరూపులకి, విద్వాంసులకి సేవలు చేసుకునే భాగ్యం కలిగినందుకు నా జీవితం ధన్యమైంది. ఇందుకు నేను చాలా సంతోషిస్తున్నాను” అన్నాడు. జనకుడు మాట్లాడాక సభా ప్రాంగణమంతా 'సాధు సాధు' అనే ధ్వనులతో మార్మోగింది. జనకుడి వినయ సంభాషణకి అందరూ మెచ్చుకున్నారు.
జనకమహారాజు ఒకసారి సభవైపు చూశాడు. తరువాత “పూజ్యులారా! మీలో ఎవరు బ్రహ్మవరిష్టులో, బ్రహ్మవేత్తలో, సర్వశ్రేష్ఠులో వాళ్ళు ఈ సభా ప్రదేశంలో ఉంచబడిన ఈ వెయ్యి ఆవుల్ని తమ ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు!” అన్నాడు.
సభలో ఎవరూ లేవలేదు. సభంతా నిశ్శబ్దంగా ఉంది. జనకుడే మహాజ్ఞాని, అదీకాకుండా ఇంతమంది జ్ఞానులు, ఋషులు ఉన్నచోట తమ తమ పాండిత్యాన్ని నిరూపించుకోవడం అంత సులభమైన విషయం కాదు. గొప్ప గొప్ప ఋషుల ముందు తామెంత అని కొంతమంది, తమ పాండిత్యం మీద సందేహంతో కొంతమంది, సిగ్గుతో కొంతమంది మనస్సులో కోరిక ఉన్నా కూడా పైకి లేవలేకపోతున్నారు. తమ
గొప్పతనాన్ని నిరూపించుకునేందుకు ఎవరూ సాహసించట్లేదు. అలా కొంత సమయం గడిచింది.
యాజ్ఞవల్క్యుడు పైకి లేచి తన శిష్యుణ్ణి పిలిచాడు. “సామశ్రవా ! ఈ వెయ్యి గోవుల్ని మన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళు” అని ఆజ్ఞాపించాడు. అక్కడున్న బ్రాహ్మణ సమూహానికి కోపం వచ్చింది. ఇంతమంది పండితులు, ఋషులు, బ్రాహ్మణులు ఉన్న సభలో తనే గొప్పవాడినని ఎలా చెప్పగలడు? అని కోపంతో మండి పడ్డారు. .
అంతలో జనకుడి ఋత్విజుడు అశ్వలుడు లేచి "యాజ్ఞవల్క్యా ! ఇక్కడున్న బ్రహ్మవేత్తల్లో నువ్వే గొప్పవాడివా? అలా అయితే నా ప్రశ్నకి జవాబు చెప్పండి. మృత్యువుకి లోబడిన కర్మసాధనల్ని ఎలా అతిక్రమించగలం? అహోరాత్రం వంటి రూపకాలాల్ని ఏ విధంగా అతిక్రమించగలం? అని కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు పొంది కూర్చున్నాడు.
తరువాత ఆర్తభాగుడు లేచి గ్రహలు, అతిగ్రహలు, తత్త్వజ్ఞుడి దేహవాసనక్రమం వంటి ప్రశ్నలు వేసి జవాబులు పొంది కూర్చున్నాడు. ఆ తరువాత భృజ్యుడు, ఉషస్తి, కహోలుడు, ఆరుణి మొదలైన జ్ఞానులందరూ అనేక లోతైన విషయాల మీద ప్రశ్నలు వేసి తగిన సమాధానాలు పొంది కూర్చున్నారు. మిగిలినవాళ్ళు యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నించడానికి సాహసించలేదు. సభలో మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది.
వచక్నుడి కుమార్తె గార్గి చాలా ప్రతిభ కలది. గొప్ప బ్రహ్మవాదిని, బ్రహ్మచారిణి. ఆ రోజుల్లో ఆమె విదుషిత్వానికి, తర్కజ్ఞానానికి, ప్రతిభకి మంచి పేరు ఉంది. ఆమె ముందు గొప్ప గొప్ప విద్వాంసులు కూడా ఓడిపోయేవారు. సభ ఈ రకంగా నిశ్శబ్దంగా ఉండడాన్ని గార్గి సహించలేక పోయింది. ఆమె లేచి యాజ్ఞవల్క్యుడితో వాదించాలని అనుకుంది. కాని, తను ఇంతకు ముందు సభలో మాట్లాడింది కనుక సభ యొక్క నియమాన్ని అనుసరించి తను మళ్ళీ మాట్లాడాలంటే సభలో ఉన్నవాళ్ళ అనుమతి తీసుకోవాలి.
గార్గి లేచి సభలో ఉన్నవాళ్ళని ఉద్దేశించి “పూజ్యులైన బ్రాహ్మణులారా! మీ అనుమతి ఉంటే నేను యాజ్ఞవల్క్యుణ్ణి రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఆయన ఆ ప్రశ్నలకి సమాధానం కనుక ఇస్తే ఇంక ఆయనతో వాదించి ఈ సభలో ఉన్నవాళ్ళు ఎవరూ ఆయన్ని గెలవలేరు అంది. అప్పుడు సభ ఒకే కంఠంతో 'పృచ్ఛ గార్గీ ” అని తన అనుమతిని తెలియచేసింది.
అప్పుడు గార్గి “పూజ్యులైన యాజ్ఞవల్క్యా! ద్యులోకం కంటే పైన ఉన్నది, పృథివి కంటే కింద ఉన్నది అంటే బ్రహ్మాండానికి పైన ఉన్నది; బ్రహ్మాండానికి కింద ఉన్నది, అంతే కాకుండా పృథివి స్వర్గాలకు మధ్య ఉన్నది, తనకు తనే స్వర్గం-పృథివీ కూడా అయి ఉందో, భూత భవిష్యత్తు వర్తమానాలు అని దేన్ని శాస్త్రజ్ఞులు అంటున్నారో అది ఎందులో ఓతప్రోతమై వ్యాప్తి చెంది ఉంది?” అని ప్రశ్నించింది.
యాజ్ఞవల్క్యుడు: "గార్లీ! నువ్వు అడిగినవన్నీ ఆకాశంలో ఓతప్రోతాలై వ్యాప్తి చెంది ఉన్నాయి” అన్నాడు. గార్గి: “ఆకాశం దేన్లో వ్యాప్తి చెంది ఉంది?” అని అడిగింది.
యాజ్ఞవల్క్యుడు: “గార్లీ! బ్రహ్మవేత్తలు ఆ తత్త్వాన్ని అక్షరమైన పరబ్రహ్మం అంటున్నారు. నాశనం లేని శుద్ధబ్రహ్మం స్థూలమైంది కాదు. అలాగని సూక్ష్మమైంది కూడా కాదు. పొట్టిది కాదు, పొడువుదీ కాదు. అది నిప్పులా ఎర్రగా ఉండదు, నీటిలా స్నేహంగానూ ఉండదు.
వాయువూ ఆకాశమూ కూడా కాదు. దానికి రసగంధాలు లేవు. అది దేశకాల వస్తువుల లోపలా లేదు. బయటా లేదు. ఆ తత్త్వం దేన్నీ తినదు, దాన్ని ఎవరూ తినరు. ఇలా ఏ విశేషణం లేంది ఒకటే, అద్వితీయమైంది.
గారీ! నాశనం లేని పరబ్రహ్మ ఆజ్ఞాపించడం వల్లే సూర్యచంద్రులు, పగలు రాత్రి లోకానికి ప్రకాశాన్ని ఇస్తున్నారు. భూలోకం, స్వర్గలోకం మొదలైనవన్నీ నిశ్చలంగా ఉంటున్నాయి. రాత్రుళ్ళు, పగళ్ళు, పక్షాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు పద్ధతిగా నడుస్తున్నాయి. నదులు ప్రవహిస్తున్నాయి.
ఓ గార్గీ! ఈ నాశనం లేని పరబ్రహ్మ తత్త్వం దేనికీ కనిపించదు కాని, అది మాత్రం అన్నింటినీ చూస్తుంది. అది ఎవరికీ వినబడదు కాని, అది అన్నింటినీ వింటుంది. ఎవరి బుద్ధికీ అందదు, అది అన్నింటినీ తెలుసుకోగలదు. దీన్ని మించి వినేది, చూసేది, స్మరించేది. తెలుసుకునేది లేదు.
గార్గీ! ఈ పరబ్రహ్మంలో ఆకాశం వ్యాప్తమై ఉంది. బ్రహ్మాండం మొదలైన జగత్తు మొత్తం ఆకాశంలో వ్యాప్తమై ఉంది. నాశనం లేని ఈ బ్రహ్మమే అవ్యాకృతమైన ఆకాశానికి, వ్యాకృతమైన జగత్తుకి ఆధారం. బ్రహ్మం యొక్క ఆజ్ఞ లేకుండా ఒక్క గడ్డిపోచ కూడ కదలదు.
గార్గీ! జగత్తుకి ఆధారమైన అక్షర బ్రహ్మాన్ని గురించి తెలుసుకోకుండా చేసే కర్మలకి ఫలితం ఉండదు. అలాగే దీన్ని గురించి
కొంచెం కూడా తెలుసుకోకుండా మరణించినవాడు 'కృపణుడు' అని పిలువబడతాడు. అక్షరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుని ఈ లోకం నుంచి వెడుతున్న వాళ్ళే బ్రాహ్మణులు. ఈ అక్షరమే పరమగతి, పరబ్రహ్మం, సత్యానికి సత్యం అని సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.
ఆయన చెప్పిన సమాధానం విని గార్గి సంతోషంగా సభని ఉద్దేశించి “బ్రాహ్మణులారా! బ్రహ్మవిదులారా! బ్రహ్మ విషయానికి సంబంధించిన వాదంలో మీలో ఎవరూ కూడా ఈ ఋషిని జయించలేరు. కాబట్టి ధన్యవాదాలు తెలియచేస్తూ మీరందరూ ఆయనకి నమస్కరించి ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు!” అని చెప్పింది.
యాజ్ఞవల్క్యుడి విశేషమైన ప్రతిభకి జనక మహారాజు ఆశ్చర్య పోయాడు. ఆయనకి గౌరవ పూర్వకంగా గొప్ప సన్మానం జరిపించాడు. ఆ రోజు విజయానికి తగిన సన్మానం పొందిన యాజ్ఞవల్క్య మహర్షి వెయ్యి ఆవుల్ని తీసుకుని తన శిష్యులతో కలిసి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
ఈ ఉపనిష్కథలో ఆనాడు స్త్రీలు వేదాధ్యయనం చేస్తూ, వేదాంతపరమైన జ్ఞానాన్ని కలిగి గొప్ప విదుషీమణులుగాను, పరివ్రాజకులుగాను, తపోమూర్తిణులుగాను ఉండేవారని తెలుస్తోంది.
జగత్తుకి ఆధారమైన అక్షర పరబ్రహ్మ జ్ఞానం తప్పకుండా అందరూ తెలుసుకుని ఉండాలని, అదే మనిషి జన్మకి సార్థకత కలుగచేస్తుందని, అటువంటి జ్ఞానం ఉన్నవాడే ముక్తుడవుతాడని, బ్రహ్మజ్ఞానం లేకుండా ఎన్ని కర్మలు చేసినా ఫలితం ఉండదనీ తెలుస్తోంది.