ఒకే సమయంలో జన్మించినవారి జాతకాలు
ఒకే సమయంలో జన్మించినవారి జాతకాలు ఒకే విధంగా ఉండడం సాధ్యమేనా ?
- లక్ష్మి రమణ
ఒకే సమయంలో జన్మించిన వారి జాతకాలలో మార్పులు వారు జన్మించిన ప్రదేశాన్ని బతి కూడా మారవచ్చు . లేదా కేవలం సెకనుల కాలంలో ఉన్న తేడాల వల్ల కూడా మారిపోతూ ఉండవచ్చు . జన్మ లగ్నాన్ని అనుసరించి , ఇటువంటి అనేకానేక అంశాల మీద వ్యక్తుల జాతకం ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు .
ఇక ఒకే రోజున జన్మించిన వారి జాతక ఫలాలను గురించి మాట్లాడుకుంటే ఎవరైనా ఒకే రోజున జన్మించిన వారి జనన సమయాలలో తేడా ఉంటే జాతక ఫలితాలు తప్పకుండా మారతాయి. జనన సమయంలో ఉన్న తేడాను బట్టి జన్మలగ్నం మారుతుంది. జన్మ లగ్నం మారినప్పుడు ద్వాదశ భావ ఫలాలు కూడా మారడం తప్పక జరుగుతుంది. ఆయా స్థానాలలో ఉన్న గ్రహాలు కూడా మారతాయి. వాటిని బట్టి ఫలితాలు మారతాయి.
ప్రతిరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ద్వాదశ లగ్నాలు నడుస్తాయి. ఏ లగ్న సమయంలో జన్మించిన వారికి ఆ లగ్నమే జన్మ లగ్నం అవుతుంది. ఒకే రోజున జన్మించినప్పటికీ, జన్మ సమయం మారేటప్పటికీ లగ్నము, గ్రహాల యొక్క స్థితి కూడా మారిపోతుంది.
ఉదాహరణకి మేషరాశిలో కుజుడు ఉండగా మకర లగ్నంలో జన్మించిన వారికి కుజుడు చతుర్దంలో ఉండగా ఆ కుజుడు అదే మేషరాశిలో ఉండగా కుంభ లగ్నంలో జన్మించిన వారికి తృతీయంలో కుజుడు ఉండడం జరుగుతుంది. దీనివల్ల మొదటి వారికి చతుర్ధ కుజ ఫలితాలు, రెండవ వారికి తృతీయ కుజ ఫలితాలు కలుగుతాయి. రెండింటిలోనూ ఎంతో భేదం ఉంటుంది. ఈ విధంగా జన్మించిన రోజు ఒక్కటే అయినా, సమయం కానీ ప్రదేశం కానీ మారినట్లయితే ఫలితాలు ఎంతగానో మారిపోవడం జరుగుతుంది.
వీటితోపాటు, ఇటువంటి అనేకానేక కారణాల చేత ఒకేరోజున జన్మించినప్పటికీ వివిధ సమయాలలో జన్మించిన వారి జాతకాలు ఒకే విధంగా ఉండవు. ఈ విషయంలో సందేహం లేదు.
శుభం !!