Online Puja Services

జాతక దోష నివారణ పద్ధతులు

3.149.25.109

జాతక దోష నివారణ పద్ధతులు

భూమి మీదున్న ప్రతి మానవునికి దేవ ఋణము, పితృ ఋణము అనే రెండు ఋణములు ఉంటాయి. అవి తీర్చుకోవాల్సిందే. కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, లేదా ఇంటిలో భూత ప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి.. కఠిన సమస్యలతో సతమతమవటం జరుగుతూనే ఉంటుంది. కనుక ముందు ఈ ఋణములు తీర్చుకోవాలి.

దేవ, పితృ యజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్య కర్మలు. ఆ పితరులే లేకపోతే.. ఈ జీవితం శరీరం ఎక్కడిది?! కనుకతప్పక వారిని అర్చించాలి. వారికి ఆహారాన్ని స్వధా దేవి చేకూరుస్తుంది. 'స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా' అనగా పితృ యజ్ఞములు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాము బదరీ క్షేత్రంలో పిండప్రదానం చేశాము, ఇక తామేమి చేయనక్కరలేదని పితృ యజ్ఞములు మానేస్తే మహా పాపమును పొందుతారని చెప్పబడుతోంది. జీవం ఉన్నంతవరకు.. హేతువైన పితృ దేవతలను నిత్యం స్మరించుకోవాలి.
సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలా మందిలో కనిపిస్తున్న వాస్తవం. పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృ కార్యాన్ని ఆచరించినప్పటికీ... ఆయా కుటుంబాల వారు సుఖ శాంతులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణమేమిటనే ప్రశ్న తెరపైకి రావవచ్చు. నిజమే మరి..

స్వధా దేవిని కేవలం పితృ కార్యాలనాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా గుర్తుచేసుకోరు. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృ కార్యం ఆచరించి చేతులు దులుపుకొన్నంత మాత్రాన లాభం లేదు, పితృతిధి రోజునే పితృ కార్యం ఆచరించిననూ స్వధా దేవిని ప్రార్ధించటం లేదు. కేవలం ఆనాడు.. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధా దేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని, చాలా మంది గమనించరు.
స్వాహా దేవికి 16 నామలున్నట్లుగానే, స్వధా దేవికి కూడా 8 నామాలున్నవి. పితృప్రాణతుల్యా, యజప్రీతికరా, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవీ, శ్రాద్ధఫలప్రదా, ఆత్మ మానసకన్యా, పితృదృష్టిప్రదా, కృష్ణవక్షస్థలా అనే 8 నామాలు. ఈ స్వధా దేవినే పురాణములలో గోలోక వాసినిగా ఉన్న కృష్ణవక్షస్థలా అనికూడా చెప్పబడింది.

ఈ 8 నామాలతో ఉన్న స్వధా దేవిని ప్రత్యేక పద్ధతులలో అర్చించాలి. కనుక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మహా పుణ్యవంతమైన నామాలలో ఉన్న స్వాహా, స్వధా దేవతలను అర్చించటానికి కూడా ప్రత్యేకమైన రోజులు అవసరం. ఈ స్వాహా, స్వధా దేవతలను శాస్త్రీయ పద్దతిలో అర్చిస్తేనే, పూర్ణ ఫలాలను పొందగలుగుతారు.

ప్రతి ఒక్కరు దేవ యజ్ఞమును, పితృ యజ్ఞమును చేయాలి. దేవ యజ్ఞమును చేసినప్పుడు స్వాహాకారం, పితృయజ్ఞం చేసినప్పుడు స్వధాకారం ఉండును. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైన అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడినవి. ఈ విశ్వంలో దేవతలకి, పితృ దేవతలకి స్థానములున్నవి. వీరిరువురిని పూజించుట నిత్య కర్మలలో విధింపబడినది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయములున్నవి. యజ్ఞాజ్ఞిలో సరియైన ప్రేరణతోనే స్వాహా, స్వధా శబ్దములు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు.

పితృ కార్యములు ఆచరించునప్పుడు ఒకే పరమేశ్వరాగ్ని 3 విధములైన దేవతలుగా చెప్పబడును. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయు, సూర్యులలో దాగి ఉన్న పితృ శక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపములుగా వ్యవహరింపబడుతున్నవి. ఈ 3 రూపములలో ఉన్నవారికి.. కర్త అయిన వ్యక్తి తన భావమును విన్నవించుకొనుటకు ఈ స్వధా దేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధా అంటారు. ఇది వేదము చెప్పిన స్పష్టత. ఈ దేహములోనే కాక దేహానంతరము కూడా నడుపు శక్తి స్వధా దేవి. పితృ రూపములో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో.. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరుటకు మానవుని కర్మకు తగినటువంటి ఫలమును అందించుట ఒక్క స్వధా దేవికే సాధ్యం.


నైవేద్యం

ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువుగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దల కలలోకి వస్తుంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతం, పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రఅన్నని నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి.  అలా చేస్తే వంశంలో, ఇంట్లో ఉన్న పితృ దేవతలా శాపాలు తొలగిపోతాయి. దీన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore