అష్టాదశ శక్తిపీఠం-9
ఉజ్జయిన్యాం మహాకాళీ
శ్రీ మహాకాళీ దేవి ధ్యానం
ఉజ్జయిన్యాం మహాకాళే మహాకాళేశ్వరేశ్వరీ
క్షిప్రా తీరస్థితామాతా వాంఛితార్థ ప్రదాయినీ
అష్టాదశ శక్తిపీఠాలలో తొమ్మిదవది అయిన శ్రీ మహాకాళీ శక్తిపీఠం అమరియున్న పవిత్రస్థలం. సతీదేవి మోచేయి పడిన ప్రదేశముగా ప్రసిద్ధిగాంచినది.
మార్కండేయ పురాణం నందు దేవి ఉత్పత్తి గురించి ప్రస్తావించబడింది. శ్రీ మహాకాళీ రాక్షసులను వధించడానికి పదితలలతో, పదికాళ్ళతో నల్లనిరూపుతో అవతరించింది. ఉజ్జయిని క్షేత్రం నందు ఇటువంటి రూపం ఎక్కడ దర్శించలేము. పురాణం నందు నల్లగా నున్న శ్రీ మహాకాళిని, హంసలకన్నా తెల్లనిదిగా భావించి పూజించే ఉజ్జయిని నివాసులు అంటే అమ్మకు ప్రీతిపాత్రులు. ఉజ్జయిని నగరవాసులు శ్రీ మహాకాళీని హరసిద్ధిమాతగా కొలుస్తారు.
ఉజ్జయిని రైల్వేస్టేషన్‌కు సుమారు 2 కి.మీ. దూరంలో శ్రీ మహాకాళేశ్వరాలయం వుంది. దీనికి వెనుక భాగమున, సుమారు 500 మీటర్లు దూరమున కొంత ఎత్తయిన ప్రదేశము నందు కలదు.
ఆలయమునకు తూర్పు ముఖముగా, దక్షిణ ముఖముగా రెండు ముఖద్వారములున్నాయి. గర్భాలయము నందు హరసిద్ధిమాత ముఖం మాత్రమే దర్శనమిస్తుంది.
మాత ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మ యొక్క శాంతి రూపము, చల్లని చూపులు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని పుష్కలంగా అనుగ్రహించగలదు. ఆలయ ప్రాంగణములో గౌరి, అన్నపూర్ణ మొదలగు శక్తి రూపములు దర్శనమవుతాయి. పరాశక్తి మాతకు ఈశాన్యంగా గణపతి మందిరం కలదు. గణపతి శరీరమంతా సింధూరం పూస్తారు. ఆలయ దక్షిణ ముఖద్వారము వద్ద పూజా సామాగ్రిలు విక్రయించబడును.
శ్రీహరసిద్ధి మాత ఆలయమునకు ఎడమవైపున, కొంతదూరమున శ్రీరామమందిరము కలదు. వీరి సంరక్షణలో మంచి వసతి సదుపాయములు కలవు. యాత్రికులకు వసతి సదుపాయములు ఏర్పాటు చేయగలరు. శ్రీహరసిద్ధి మాత ఆలయము కుడివైపున అనేక మందిరాలున్నాయి. వీటికి సమీపంలో విక్రమాదిత్య మహారాజు నివాసమైన స్థలం కలదు. మహారాజు ఉపయోగించిన సామాగ్రిలు దర్శించవచ్చును.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు