Online Puja Services

హిందూధర్మ పరిరక్షకుడు శ్రీ విద్యారణ్య స్వామి

3.18.103.165

జ్ఞానదానం చేసిన సద్గురువుకు దృష్టాంతం మూడు లోకాలలో కనపడదు. ‘స్పర్శమణి ఇనుప ముక్కను బంగారంగా మారుస్తుంది. దానిని దృష్టాంతముగా చూపవచ్చు కాదా’ అంటే అది యుక్తం కాదు.

ఎందువల్లనంటే బంగారంలా మారిన ఇనుప ముక్క మరొక ఇనుప ముక్కను బంగారంగా మార్చలేదు. కాని గురువు పాదాలు ఆశ్రయించిన శిష్యుని తనంతటి వాడిగాను, మళ్లీ మరొకరిని కూడా అలా చేయగలవానిగాను తీర్చిదిద్దుతాడు.

అందువల్ల సద్గురువుకు ఉపమానం అనేది లేదు. గురువు లోకోత్తరుడు. లోకంలో అందరినీ మించినవాడు. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారు శతశ్లోకి-1లో ఈ విషయం చెప్పారు. అటువంటి గురుపరంపరలో ప్రముఖులు శ్రీ విద్యారణ్యస్వామి వారు.  హిందూ మత పునరుజ్జీవనానికి కృషి చేసిన మహా వ్యక్తులలో శ్రీస్వామి విద్యారణ్యులు ఒకరు.


శ్రీ విద్యారణ్యుల జననం..

బాల్యం...ఆయన కలిశకం 4397వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి బుధవారం-పుష్యమీ నక్షత్రం ధనుర్లగ్నంలో జన్మించాడు. ఆయన చిన్ననాటి పేరు మాధవుడు. 11-4-1296లో ఆయన జన్మించాడు.

తండ్రే గురువు...

మాధవునకు తండ్రే గురువు. ఆయన వద్ద తర్క శాస్తమ్రును క్షుణ్ణంగా అభ్యసించాడు. వేదాధ్యయనం, వ్యాకరణం, మీమాంశ శాస్త్రాలకు తండ్రే గురువుకాగా అతను అనతి కాలంలోనే వాటిని ఔపోసన పట్టాడు.

శ్రీ శంకరానందుల వారి వద్ద శిష్యరికం...

అత్యంత సుప్రసిద్ధులైన శ్రీ శంకరానందుల వారి వద్దకు విద్య నేర్చుకునేందుకై మాధవుడు వెళ్లగా దివ్యజ్ఞాన సంపన్నుడైన ఆ సద్గురువు వచ్చిన శిష్యుడు సామాన్యుడు కాడని, వేద, ధర్మరక్షణ కోసం అవతరించిన మహా యోగి అని గ్రహించాడు. సర్వ వేదాంత శాస్త్రాల రహస్యాన్ని మిక్కిలి వాత్సల్యంతో ఆయన మాధవునికి బోధించగా, సర్వవిద్యలను నేర్చిన మాధవుడు మాధవాచార్యుడై ఇంటికి వచ్చి గృహస్త జీవితాన్ని ఆరంభించాడు.

పిలచి పీఠాధిపత్యము నొసగిన
శృంగేరీ శంకర పీఠాధిపతులు..

శ్రీశ్రీశ్రీ విద్యాతీర్థులవారు, మాధవాచార్యుల తపఃశక్తి, వేద వేదాంగాలలో సాధించిన అపూర్వ పాండిత్యము, మంత్ర శాస్త్రాలలో గల అఖండ ప్రజ్ఞా విశేషణములను గూర్చి తెలుసుకుని, ఆ ఉద్దండ పండితునికోసం కబురుపెట్టారు. దేశం ఆనాడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని సూచిస్తూ, తన తదనంతరం పీఠాధిపత్యాన్ని వహించగల సమర్థుడు మాధవాచార్యుడేనని అభివర్ణించాడు

ఎంతోపాండిత్యం సంపాదించినా మాధవుడు ఏదో తెలియని అసంతృప్తి, లేమిని, లోటును ఎదుర్కొంటున్న అనుభూతిని పొందాడు. ఏదో తెలియనని తపన ధర్మరక్షణకై చేయాలని అతన్ని నిలువనీయకుంది. ఆ సందర్భంలోనే శ్రీ శృంగేరీ పీఠాధిపతుల సాంగత్యం ఆయనకు లభించింది. ఫలితం యోగిగా, విద్వాంసునిగా పేరుగాంచిన మాధవాచార్యులు 1331 సంవత్సరంలో సన్యసించి శ్రీ విద్యారణ్య స్వామిగా అవతరించారు. ఆనాటి గురువుల కఠిన పరీక్షలను ఎదుర్కొని కఠొర నియమాలు ఆచరించినందున విద్యారణ్యుల దైవశక్తి వృద్ధియైనది. విద్యాశంకరులు రెండు సంవత్సరములు విద్యారణ్యులకు శిక్షణను ఇచ్చి దైవ సమాధిని పొందారు. ఆ తర్వాత పూర్తిగా మఠం బాధ్యతను స్వీకరించిన శ్రీ విద్యారణ్యులు 55 సంవత్సరములు ధర్మ పరిరక్షణ చేస్తూ,అనేక అద్భుత గ్రంథములు రచించారు. మహమ్మదీయ దండయాత్రల వల్ల బలవుతూ బలవంత మతమార్పిడికి గురవుతున్న ఎందరినో మత మార్పిడికి గురికాకుండా హిందూ ధర్మ పునఃప్రతిష్ట చేసారు. తన దివ్య ఆధ్యాత్మిక శక్తితో ఎందరినో తరింపచేసారు.

శ్రీ విద్యారణ్య దేశాటనం...శ్రీవ్యాస దర్శనం...

శ్రీ విద్యారణ్యులు దేశ యాత్రకు బయలుదేరి నలుమూలలా హిందూ ధర్మ ప్రచారం చేసారు. కాశీకి వెళ్లి విశ్వనాధుని దర్శించారు. గంగానదిలో స్నానానికై మణికర్ణికా ఘాట్‌కువెళ్లగా ఆయనకు శ్రీ వ్యాస దర్శనం లభించింది. విద్యారణ్యులను రానున్న కాలంలో కర్నాటక దేశాన రాజ్యస్థాపన చేయమని, అక్కడ రాజ్యస్థాపన చేసి విజయనగర సామ్రాజ్యం 300 ఏళ్లు విలసిల్లగలదని వ్యాసుడు ఆశీర్వదించారు. బ్రహ్మానంద పరవశులై విద్యారణ్యులు వ్యాసుని పాదధూళిని స్వీకరించి, త్రివేణీ సంగమం, గయ, మధుర, అయోధ్య మొదలైనవి సందర్శించి తుంగభద్రానది వద్దకు వచ్చిరి.

తుంగ భద్ర తీరంలో
రాజపురుష ద్వయం

ముస్లిం దండయాత్రల్లో బలవంతాన మతమార్పిడికి గురైన హరిహర రాయలు, బుక్కరాయలు వారు వారిని తన దివ్య బోధనల ద్వారా హిందు మతంలోకి చేర్చారు శ్రీ విద్యారణ్యులు. ఆయన ఆ పని చేయకుంటే 300 సంవత్సరాల తర్వాత తల్లికోట యుద్ధానంతరం కృష్ణానదినుంచి తుంగభద్ర వరకు ఒక్క హిందువు లేక యావన్మందీ ముస్లింలు అయిపోయేవారు అని చారిత్రక పరిశోదకుల ఉవాచ. అంతటి ఘోర విపత్తునుండి హిందూ మతాన్ని కాపాడిన అద్భుత యోగి పుంగవుడు శ్రీ విద్యారణ్యులు. వీర శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు సమర్ధరామదాసువలె దైవాంశలు గలవారు విద్యారణ్యులు. విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపకులుగా వీరి కీర్తి ఆచంద్రార్కం నిలిచింది.

విద్యారణ్యులు -

విజయనగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన

విద్యారణ్యులు స్వయంగా మహాసంకల్పం చేసి వాస్తు పురుషుని ఆవాహన చేసి విజయనగర పునాది వేసేందుకై ముహుర్తం పెట్టారు.శ్రీ సామ్రాజ్యలక్ష్మి యంత్రస్థాపన చేసి, కచ్చితమైన సమయాన్ని ఘంటానాదం ద్వారా సూచిస్తానని ఆ సమయంలో ఖచ్చితంగా పునాదిరాయి పునాదిలో పడడానికి ఏర్పాటు చేసారు. కానీ వ్యాసభగవానుని ఆశీస్సులు నిజం చేసేటందుకో ఏమో 3,600 సంవత్సరాల పాటు నగరం సామ్రాజ్యం చెక్కుచెదరకుండా వుండేట్టు శ్రీ విద్యారణ్యులు పెట్టిన ముహుర్తానికి ముందే ఓ కాపాలికుని ఘంటరావం విని అదే గురువుగారి సూచనగా భావిస్తూ హరిహరరాయ సోదరులు పునాదివేసారు. మిక్కిలిగా తపస్సు చేసి శ్రీ విద్యారణ్యులు పెట్టిన శుభ ముహుర్తం వ్యర్ధమైంది.
లగ్నం తప్పిన ముహుర్తాన్ని లెక్కగట్టి విద్యారణ్యులు నగర ఆయుర్ధాయాన్ని 2160 సంవత్సరాలుగా నిర్ణయించారు. తర్వాత ముహుర్త దోష కారణంగా ఆ నగరం శత్రువులచే ధ్వంసం గావింపబడుతుందని చెప్పారు. శ్రీ విద్యారణ్య కాలజ్ఞానం అని స్వామివారు రాసిన గ్రంథంలో ఈవిషయం పేర్కొననబడింది.


సౌందర్యవంతం...
విజయనగరం...
విద్యారణ్యుల తప్ఫఃలం.
- విదేశీయుల ప్రశంస


విజయనగర నిర్మాణానికి శ్రీ విద్యారణ్యులు స్వయంగా ఒక పథకంవేసారు. అభేద్యంగా ఉండే దుర్గ నిర్మాణానికి రచన చేసారు. 20 అడుగుల మందంతో, 30 అడుగుల ఎత్తు, 4 క్రోసుల పొడవుతో కోట నిర్మాణం చేసారు. 12 క్రోసుల నగరాన్ని అద్భుతంగా మలిచారు. విశాలమైన రాజమార్గాలు, రెండువైపులా రాజ పురుషులు ఇతర సిబ్బందికీ అందమైన భవనాలు, క్రీడాసరస్సులు, నడిబొడ్డున విరూపాక్ష ఆలయం, అద్భుత సౌందర్యంతో విద్యారణ్యులు తన వాస్తు ప్రావీణ్యాన్ని ఈ సామ్రాజ్య స్థాపనకు ధారపోసారంటే అతిశయోక్తి లేదు. పైనుంచి చూస్తే ఈ నగరం శ్రీచక్రం ఆకారంలో వుండడం ఒక ప్రత్యేకత. అందుకే దీన్ని ‘శ్రీవిద్యానగరం’ అని అంటారు.

శ్రీ విద్యారణ్యులు పెట్టిన శుభముహుర్తంలో అత్యంత వైభోవేపేతంగా నగర ప్రవేశం జరిగింది. ఆయన స్వయంగా సర్వ పుణ్య తీర్థముల జలాలతో బుక్కరాయలకు పట్ట్భాషేకం చేసారు. అయితే విరూపాక్షదేవుడే సామ్రాజ్యానికి చక్రవర్తిగా శాసనం చేసారు. ఈ పద్ధతే చివరి వరకు కొనసాగింది. శ్రీ విద్యారణ్యులు ముందు ముందు ఎవరెవరు విజయనగరాన్ని పాలిస్తారు? ఎవరు ఎంత కాలం పాలిస్తారు? పేర్లు, సంవత్సరాలతో సహా తాను రచించిన గ్రంథలో పేర్కొన్నారట.


శ్రీ విద్యారణ్యుల రచనలు...

తన సోదరులైన సాయనాచార్యులు, ఎందరో ఉద్దండ పండితుల సహకారంతో ‘వేదార్ధాన్ని’ వ్రాయడం చేసారు. హిందూ మత సముద్ధరణ లక్ష్యంగా ధర్మపాలకులు ఆచరించాల్సిన విషయాలు చెప్పడానికి ఆయన వేద భాష్యం ఓ మార్గం అని అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మ రక్షణకు తన రచనలు కూడా అతి ముఖ్యంగా దోహదపడగలవని ఆయన ఆశించారు. ఆదర్శ సమాజంగా నాటి సమాజాన్ని తీర్చిదిద్దేందుకు తన రచనలు తోడ్పడాలని ఆయన భావించారు. దీనికి ఆయన ప్రత్యేకంగా ‘ప్రాయశ్చిత సుధానిధి’ అనే గ్రంథ రచన చేసారు.

ద్వాదశ లక్ష్మణి అనే పూర్వ మీమాంస గ్రంథం, సంగీతసారం అనే సంగీత గ్రంథం, అద్వైత సిద్ధాంత గ్రంథం, పంచదశి మొదలైనవి వీరి ముఖ్య రచనలు.

గొప్ప రాజనీతి కోవిదుడుగా ధర్మసంస్థాపన సల్పిన మహాయోగిగా ఆయన చిరస్థాయిగా సంస్మరణనీయుడైనాడు. ధర్మ సంస్థాపనకు హిందూమత సంరక్షణకు కారకులైన ఇటువంటి మహానుభావులు నిత్య వందనీయులు. అందుకే మన కేలండర్‌లోని పండుగల పట్టికలో ఆ మహానుభావుని జయంతి కూడా నిలిచింది.


టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:

TTPS://T.ME/GURUGEETA

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya