అవ్యభిచారణ భక్తి
అవ్యభిచారణ భక్తి కలిగి ఉండమని భగవంతుడు చెప్పడంలోని అంతరార్థం ఏమిటి ?
- లక్ష్మి రమణ
భగవద్గీత భగవంతుడే స్వయంగా చెప్పిన జీవన వేదం . భగవద్గీతని ఫాలో అయ్యామంటే , విజయం మనని మానకుండా ఫాలో చేయడం ఖాయం . భక్తి గురించి, భక్తులు కలిగి ఉండాల్సిన భక్తి గురించి శ్రీకృష్ణుడు గీతలో చాలానే చెప్పారు . ఆ వరుసలోనే అర్జనుడితో , అర్జనుడు అంటే మానవుడు, కృష్ణుడు అంటే భగవంతుడు అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ కాస్తంత కటువుగా 'అవ్యభిచారణ భక్తి' కలిగి ఉండు” అన్నారు . దీని అర్థం ఏమిటంటే..
భక్తిలో వ్యభిచారము ఉండకూడదు అని. దాని అంతరార్ధము ఏమిటి తిరుమలేశా ? అని ఆలోచిస్తే, పెద్దల అనుగ్రహంతో బుద్ధికి తోచిన నాలుగు మంచి విషయాలు మీతో పంచుకుందాం అని .
మనం ఎందరో దేవీ దేవతలని అర్చిస్తూ ఉంటాం . సోమవారం - శివుడు , మంగళవారం ఆంజనేయుడు, శుక్రవారం లక్ష్మీదేవి , ఇట్లా. ఆలయాలైతే ఇక చెప్పక్కర్లేదు . గురువారం సాయిబాబా ఆలయం ముందు ఉన్న క్యూలు, శుక్రవారం అమ్మవారి ఆలయం ముందు, శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ముందు కనిపిస్తాయి.
ఇలా అనేకానేక మంది దేవీ దేవతలని అర్చించవచ్చు . అయితే అది ఏ విగ్రహానికి హారతి ఇవ్వకపోతే ఎవరికి కోపం వస్తుందో అని హారతులు, నివేదనలు సమర్పించడంలో మునిగిపోయే లాంటి భక్తి కాకూడదు. దీన్నే పరమాత్మ వ్యభిచారినీ భక్తి అన్నాడు! *
“సర్వదేవ నమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి" అని తెలుపుతున్నాయి శాస్త్రాలు. సర్వదేవతల్లోనూ ఉన్న పరమాత్మ ఒక్కరే అన్న ఎరుకతో భగవంతునికి సర్వశ్య శరణాగతి చేయడం నిజమైన భక్తి . ఆ విధంగా ఎవరికి నమస్కరించినా, ఆ పరమేశ్వరునికే చెల్లుతుంది. కనుక భగవంతుడు ఒక్కడే అని భావించి స్థిర చిత్తముతో ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో నిండిన భక్తి కలిగి ఉండాలి . ఆ విధమైన అంతరంగాన్ని అనుగ్రహించమని పరమాత్మని ప్రార్ధిస్తూ ..
“ భగవాదానుగ్రహ ప్రాప్తిరస్తు” . శుభం .