Online Puja Services

మార్గశీర్షమైన ఈ మాసంలో గీతాపారాయణ

216.73.216.210

భగవద్గీతకు జన్మనిచ్చి మార్గశీర్షమైన ఈ మాసంలో గీతాపారాయణ మహత్యాన్ని తెలుసుకుందాం !
- లక్ష్మి రమణ 

మార్గశిర శుక్ల ఏకాదశిని హిందువులు గీతా జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర శుక్ల ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భావం జరిగిన రోజు కనుక గీతా జయంతిగా జరుపుకుంటారు. గీత ఆవిర్భావము ఒక యుద్ధరంగములో కార్య విముఖుడైన ఒక వీరుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసింది . సాక్షాత్తూ భగవంతుడే స్వయంగా అనుగ్రహించిన జ్ఞానం భగవద్గీత. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా చెప్పబడింది. ఇందులోని ఒక్కో  అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. ఆరు యోగాలని కలిపి ఒక షట్కమంటారు. 1 నుండి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుండి 12 వరకు భక్తి షట్కమని, 13 నుండి 18 వరకు జ్ఞాన షట్కమని అంటారు.

మహా భారతంలో భగవద్గీత ఒక భాగమే. అయినా  భగవద్గీతకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్నీ ఇతిహాసాలు చదవనక్కరలేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు, జీవిత పరమార్ధం తెలుస్తుంది.

కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు మళ్ళించడమే గీత లక్ష్యం. ఈనాటి యువతకి ఈ దారిమల్లింపు జ్ఞానం చాలా అవసరం . అయితే పెడత్రోవలు తొక్కడం , లేదంటే ఆత్మా హత్యలకు పాల్పడడం , తీవ్రమైన నిరాశలో కూరుకుపోవడం వంటి పరిస్థుతుల నుండీ భగవద్గీత కాపాడుతుంది . ఒక పర్సనాలిటీ డవలప్మెంట్ క్లాస్ లాగా కౌన్సలింగ్ ఇస్తుంది . 

భగవద్గీతలోని కొన్ని వచనాలు చూడండి . 

ఆత్మ జ్ఞానము అంటే తనను తాను తెలుసు కోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మకు నాశనము లేనిదని తెలుసు కోవాలి.

పుట్టిన వానికి మరణము తప్పదని, మరణించిన వానికి జన్మము తప్పదని, మరణం అంటే జీర్ణమైన శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరంలో ప్రవేశించటమేనని, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదని అర్జునుడికి చెప్తాడు.

భగవద్గీతలోని  18 యోగాలలో ఒక్కోదానినుండీ 18 శ్లోకాలు నేర్చుకుని అర్థం చేసుకున్నట్లయితే, జీవిత పరమార్ధం తెలుసుకోగలుగుతారు.   ఈ భగవద్గీతలోని ఒక్కో అధ్యాయం ఏ యోగాన్ని ప్రసాదిస్తుందని విషయాన్ని పద్మ పురాణం ఉత్తరాఖండం వివరిస్తుంది . 

ఆ యోగ విభూతులని మార్గశిరమాసం సందర్భంగా హితోక్తి  మీకు అందిస్తోంది . ఒక్కో అధ్యాయం పారాయణం చేయడం వలన చేకూరే ప్రయోజనాలని పద్మపురాణంలో చెప్పిన విధంగా , సరళంగా మీకు అందించే ప్రయత్నం చేస్తోంది . భగవంతుని జ్ఞానబోధతో మార్గశీర్షమైన ఈ మాసంలో ఆ భగవద్గీత యొక్క గొప్పదనాన్ని గ్రహించి , ఆ నారాయణుని కృపకి పాత్రులమవుదాం .

#bhagavadgita #margasiram

Tags: bhagavadgita, margasira, masam, bhagawadgeeta, 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore