అన్నదమ్ముల మధ్య సీతమ్మ అడ్డుగా నిలిచిందా ?
అన్నదమ్ముల మధ్య సీతమ్మ అడ్డుగా నిలిచిందా ?
లక్ష్మీ రమణ
అన్నదమ్ములకి భార్యలు వచ్చేశాక, వారి వారి గౌరవాలని కాపాడుకోవడానికి ఆ అన్నదమ్ములని విడదీస్తున్న కథలని మనం ప్రతి రోజూ సీరియళ్ళలో చూస్తూనే ఉన్నాం కదా ! అలాగే నలుగురు అన్నదమ్ములున్న కుటుంబంలో పెద్ద కోడలుగా , ముగ్గురు మరుదులకి వదినగా వెళ్లిన సీతమ్మ తల్లి అడ్డయ్యింది అనుకుంటే , మహా పాపం చేసినవారిమి అవుతాం . మరి సీతమ్మ అన్నదమ్ముల మధ్య ఏవిధంగా అడ్డుగా మారింది ?
రాముడు పరమాత్మ. ఆ సీతమ్మ ఆయన భార్య . పరమ ప్రక్రుతి . అటువంటి ఆదర్శపురుషునికి భార్య అయినందుకు ఆయన తమ్ములకి అమ్మే అయ్యింది సీతమ్మ . అంతేకానీ వారికెప్పుడూ అడ్డుకాలేదు . కానీ అరణ్యవాసములోని ఒక చిన్న సంఘటనకి చెందిన ఈ వృత్తాంతాన్ని శ్రీ రామకృష్ణ పరమహంసవారు ఒకానొక సందర్భంలో భక్తుల సౌకర్యార్థం వివరణ చేశారు .
“అరణ్యవాసములో సీతారామలక్ష్మణులు అరణ్యాలగుండా సాగిపొతున్నారు. అది ఎంతో ఇరుకైన దారి. ఒకరి వెంట ఒకరు మాత్రమే పోగలరు. ముందు కొదండపాణియిన రాముడు, ఆయిన వెనుక సీతమ్మ, అమె వెనుక ధనుర్భాణాలు ధరించిన లక్ష్మణుడు నడచి పోతున్నారు. రాముడి పట్ల భక్తి, ప్రేమాసక్తుడైన లక్ష్మణుడు ఆ శ్యామసుందరుండైన శ్రీరాముని చూడకుండా ఒక్క క్షణమైనా తాళలేడు . సర్వాదా ఆయన మీదే చూపులు నిలిపి ఉంటాడు .
కానీ, ఆ దారి సన్నగా ఉండడం చేత, సీతమ్మ మధ్యలో అడ్డుగా వుండటముచేత , రాముని దర్శనం లేక పరితపించాడు. ఇది ఎరుగనిదికాదు అమ్మ సీతమ్మ. అప్పుడావిడ, కాస్త ప్రక్కకు తొలిగి ‘ లక్ష్మణా ! అదిగో చూడు’ అన్నది. అప్పుడు లక్ష్మణుడు కళ్ళారా తన ఇష్టమూర్తిని, తన దైవాన్ని అవలొకించాడు.
ఇదే రీతిలో జీవునకి, ఈశ్వరునికీ నడుమ మాయాశక్తి అయిన జగజ్జనని వుంది. అమె అనుగ్రహించి, దయతలచి పక్కకు తిలిగితే గానీ, జీవుడుకి ఈశ్వరుని దర్శనం కలుగదు . కాబట్టి, అమె కృపలేకుంటే నిత్యానిత్య వస్తు వివేచనము, వేదాంత విచారము ఎంతగా జరిపినప్పటికీ ప్రయోజనం ఏమీ ఉండదు.
ఈ సంఘటనని జీవునికి అన్వయించుకొని చూడండి . శ్రీరాముడు సచ్చిదానంద పరబ్రహ్మ రూపుడని అందరికీ తెలిసిందే ! అలాగే సీతమ్మ లక్ష్మీ స్వరూపము అయినా జగజ్జనని. ఇక లక్ష్మణుడు, ఆది శేషువు యొక్క రూపము . ఆది శేషుడు ఆ పరమాత్మని చూడకుండా ఎలాగైతే ఉండలేడో , అదే విధంగా జీవుడు కూడా ఆ పరమాత్మని చేరుకోవడానికి తపన పడాలి . ఆ తపనకి ఫలితమే మోక్షము . అలా సర్పరూపమైన మనలోని ప్రాణ శక్తినే కుండలినిగా చెప్పుకోవాలి .
ఇలా కుండలినీ శక్తి పరబ్రహ్మని చేరటానికి మధ్య సంసారము అనే మహా మాయ వుంటుంది. ఆ దేవిని వేడుకుంటే గానీ, ఆ మాయ తొలగిపోదు . అప్పుడు గానీ, అంటే సాధన చేస్తేనేకాని పరబ్రహ్మస్వరూపము దొరకదని భావము. భక్తీ, విశ్వాసాలే ఈ సాధనకు ఆయిధాలని మనం గుర్తుంచుకోవాలి .