సంపూర్ణత్వం పురుషులకి ఎప్పుడు లభిస్తుందట !
మరి ఈ సంపూర్ణత్వం పురుషులకి ఎప్పుడు లభిస్తుందట !
సేకరణ
ఆడపిల్లలకి అడుగడుగునా సమాధానము చెప్పుకోవాల్సిన ప్రశ్నలే . ఆదిపరాశక్తి స్వరూపం అంటారు గానీ, పుట్టిన దగ్గరనుండీ గిట్టేదాకా ఎన్నో బాధ్యతలు. సమాధానాలు చెప్పుకోవాల్సిన సమస్యలూనూ ! ఐదోతరగతి దాటిందో లేదో , రజస్వల అయ్యిందా అని, ఆ తర్వాత పెళ్లెప్పుడని, పెళ్లయ్యాక పిల్లలు ఇంకా లేరా అని, ఆపైన ఆపిల్లలకి పెళ్లెప్పుడని ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పైగా ఇవన్నీ సరైన సమయంలో జరిగితేనే పరిపూర్ణమైన స్త్రీ అనీ, ఇల్లాలనీ సామాజిక విశ్లేషణ . మరి ఈ సంపూర్ణత్వం పురుషులకి ఎప్పుడు లభిస్తుందట !
అదేదో చిత్రంలో కథానాయకుడు ఒక స్త్రీ పరిపూర్ణత గల స్త్రీ ఎప్పుడు అవుతుంది అని మార్కులు వేస్తూ సంతానవతి అయిన తర్వాతనే ఆమె నూటికి నూరు మార్కులూ సంపాదించి , పరిపూర్ణత పొందుతుందని చెప్తాడు. మరి మగవాడు పరిపూర్ణ మగవాడు ఎప్పుడు అవుతాడు?
ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి.
శుక్ల యజుర్వేదం లోని “శథపథ బ్రాహ్మణం” లోని క్రింది శ్లోకాన్ని చూడండి.
‘అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి
సర్వో భవతి! సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి’ (5.2.1.10)
అర్థం :
భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.
కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరొకటి ఉంది . ఈ వేదశ్లోకాన్ని అనుసరించి , భార్య ద్వారా సంతానం పొందితే మాత్రమే ఆ పరిపూర్ణత సిద్ధిస్తుందని తెలుస్తోంది . ఇది మన పురుష పంగవులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం . అగ్ని సాక్షిగా కట్టుకొన్న భార్య ద్వారానే సంతానాన్ని పొందాలి . ఇతరత్రా కాదు మరి .
కాబట్టి మన మహిళా మణులు చింతించి అనవసరంగా వారికి వారే శత్రువులుగా మారి , ఒకరికొకరు , మాటలు అనే సూదులు గ్రుచ్చుకోకుండా , ఈ విషయాన్ని వినియోగించుకోవచ్చు . అటులనే , మగవారి మనోభావాల్ని బలపరచకుండా (భంగపడకుండా ), వారికీ విషయాన్ని తెలియజేసి జ్ఞానోదయానికై ప్రయత్నించవచ్చు . కనుక విజయోస్తు !!