Online Puja Services

ఇదే తక్షణ కర్తవ్యం .

18.117.166.193

ఇదే తక్షణ కర్తవ్యం . 
లక్ష్మీ రమణ 

దర్గాని , దుర్గనీ ఒకేసారి కొలిచే సంప్రదాయం భారతదేశంలోనే కనిపిస్తుంది. మతం ఏంటి ? దాని నియమం ఏంటి అని సనాతన ధర్మం ప్రశ్నించలేదు . దైవం ఎక్కడున్నా , తనలో కలుపుకుపోయింది. అందుకే మహాసంద్రం వంటి ఈ  సంస్కృతిలో జైనం, బౌద్ధం వంటి ఎన్నో సంప్రదాయాలు ఇమిడిపోయాయి. అదే హిందూ ధర్మంలోని ప్రత్యేకత. 

దుర్గమ్మని దర్శించుకున్న వెంటనే దర్గాకి వెళ్లి రక్ష కట్టించుకునే హిందువులూ, వెంకన్న దర్శనం కోసం ఏడుకొండలూ నడిచి , మెట్టుమెట్టుకూ పసుపుబొట్టు పెట్టె  ముస్లింలూ ఉన్న దేశం మనది . వారి నమ్మకాల్లో ఉన్నది అల్లానో, దుర్గమ్మో , వెంకటేశుడో కాదు. వారి నమ్మకాల్లో ఉంది దేవుడు . దేవుడు మాత్రమే ! అందుకే దానికి మతం యెంత ప్రయత్నించినా రంగు పూయలేకపోయింది. హంగులు దిద్దలేకపోయింది. 

భగవంతుని మహిమ అదే! తానున్న చోట అన్ని కలుపుకుపోతాడు . రూపము, రంగు , రుచి, వాసనా , గుణమూ లేనివాడికి మతం ఎక్కడి నుండీ వచ్చింది ? మనం ఆపాదించిన మహత్తరమైన మత్తు మందే మతమేమో ! అణువూ అణువునా నిండినవాడే దేవుడుకదా! విశ్వాకారమే తానైన వాడికి విశ్వంలోని ఏ ప్రవక్త, ఏ గురువు , ఏ ధర్మం , ఏ సంస్కృతి మినహాయింపు . 

ఆ విశ్వస్వరూపం రూపుకట్టి దివ్యంగా పూజలందుకునే దివ్యదేశం లోకైక రాజ్యమైన ఈ భారతావని ! అందుకేనేమో, పరాయి రాజ్యంలో కన్నా ఈ నేలమీద ఉండేందుకే దేవుడు ఇష్టపడ్డాడు. ఏ దేశంలో , మారె రాజ్యంలో లేనన్ని దేవాలయాలు, ఆధ్యాత్మిక సంపద  ఈ భూమి మీదున్నాయి. 

ఒక్క రామకృష్ణుడు చాలడూ ఉదాహరించుకోవడానికి! ఆయన క్రిస్టియన్, ఇస్లాం లతో పాటు హిందూ దేవీదేవతలతోనూ వారి వారి ఆచారాల్ని అనుసరించి అనుష్టించిన వారు కదా ! బాబా షిరిడీ సాయి భగవంతుడు ఒక్కడేనని చాటి చెప్పారుగా !  దేవుని కృపని పొందేందుకు ఈ మతాలూ, కులాల చిత్రాలు అవసరంలేదు. సత్యం, న్యాయం , ధర్మం, అహింస , క్షమా అనే గుణాలు చాలు. సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ దేవదేవుని విలాసాన్ని, దరహాసాన్ని అనుభవించగల్గితే చాలు .  

కాట్జీబీని కులదేవతగా ఆరాధించే హిందువులూ, వేంకటేశుని దీపారాధన చేసే ముస్లింలూ ఉన్న దేశంలో ఈ రాజకీయాల కులమతాల పట్టింపులు పక్కన పెట్టి ఆ శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి ఆరాధించి , అనుగ్రహాన్ని పొందడమే మన తక్షణ కర్తవ్యమ్. దైవిక చింతనకి ఎంతో  కొంత సమయాన్ని కేటాయించుకోవడం అవసరం . ఆరోగ్యం కోసమో, ఆనందం కోసమో కాదు, తనని తానూ తెలుసుకోవడం కోసం, అసలైన తన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇది అవసరం . శుభం .      

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore