చెప్పుడు మాటలు వినకురా, చెడేవు!
చెప్పుడు మాటలు వినకురా, చెడేవు!
-లక్ష్మీ రమణ
చెప్పుడు మాటలు వినకురా, చెడేవు! అని చెవిని ఇల్లుకట్టుకుని పోరినా కొంతమంది బుద్ధి మార్చుకోరు . నిత్యం వార్తా పత్రికల్లో మనం ఇలాంటి వార్తలు చూస్తూనే ఉంటాం . ప్రత్యేకించి భార్యాభర్తల అనుబంధం మూడో వ్యక్తికీ చోటులేనిది. పరమ పవిత్రమైనది . అగ్ని సాక్షిగా ముడిపడిన జన్మజన్మల అనుబంధమది . అటువంటి అనుబంధం బీటలువారడం, కోర్టుల సాక్షిగా , నవీన సమాజంలో విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం . ఇది నేటి మాటకాదు ఇటువంటి ఉదంతాలు గడిచిన మన చరిత్రలో , పురాణ ఇతిహాసాలలోనూ ఇటువంటి దృష్టాంతారాలు ఉన్నాయి .
తిమ్మరుసు కృష్ణదేవరాయలు రాజవ్వడానికి కారకుడయ్యాడు . పట్టాభిషేకం నాడు చెంపదెబ్బ కొట్టి , చెడుమార్గం పట్టొద్దని చెప్పాడు . అటువంటి తిమ్మరుసును గురించి చెప్పుడు మాటలు విని, తండ్రి సమానుడు , మహామేధావి అయిన ఆ మహామంత్రి కళ్ళు పీకించాడు శ్రీ కృష్ణ దేవరాయలు. సుస్థిరమైన విజయనగర సామ్రాజ్య పతనానికి తన చేతులతో బీజాలు నాటాడు .
తల్లి గర్భం లో చనిపోబోయే బిందుసారుడి ని తన ఉపాయం తో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు.
శకుని కురువంశం చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసమే , పగని ఆహారంగా చేసుకొని బ్రతికాడు . దుర్యోధనుణ్ణి చేరదీసి , చెప్పకూడని మాటలు , చెప్పాల్సిన రీతిలో చెప్పి అతనికి పాండవుల మీదున్న ద్వేషాన్ని శత్రుత్వంగా మార్చగలిగాడు . తద్వారా దాయాదులమధ్య చిచ్చురగిల్చి, కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడయ్యాడు . పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు.
సూర్ఫణఖ చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి మాహాజ్ఞాని సీతమ్మతల్లిని అపహరించి రాముడితో యుద్ధానికిదిగి, చరిత్రహీనుడయ్యాడు . చివరకు మరణించాడు.
ఇలా, చెప్పుడు మాటలు విని చెడిపోయినవారు చరిత్రలో చాలా మందే ఉన్నారు . స్నేహాన్ని కోల్పోయిన వారు, సంసారాలని నాశనం చేసుకున్నవారు , అధికారాన్ని కోల్పోయిన వారు ఇలా వీరి జాబితా పెద్దదే మరి . అందుకే చెప్పేది మంచి మాట చెప్పినప్పుడు , అది మనకి విహితమైనది అనిపిస్తే , స్వీకరించండి . అంతే కానీ, వాళ్ళిలా , వీళ్ళలా అంటూ చెబితే, మొహమాటంలేకుండా ఆమాటలు మీ దగ్గర చెప్పొద్దని చెప్పండి . షిరిడీ సాయి బాబా ఒకమాట చెబుతారు. చెప్పుడు మాటలు చెప్పే వారు ఎవరి గురించయితే చెబుతున్నారో వారి అశుద్ధాన్ని స్వయంగా నాలికతో నాకుతున్నట్టు అని. ఈ మాటలు చెప్పుడు మాటలు చెప్పేవారు సదా గుర్తుంచుకోవాలి.
అయినా ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే ... నీ గురించి మరొకరికి చెప్పడా ? ఇది ఆలోచించడం మన విజ్ఞత.