Online Puja Services

ఆధ్యాత్మికత అంటే, సృష్టికర్త మేధస్సుతో అనుసంధానం

3.147.47.177

ఆధ్యాత్మికత అంటే, సృష్టికర్త మేధస్సుతో అనుసంధానం. 
-లక్ష్మీ రమణ 

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, మరింత మేధతో జీవిచడం. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే సృష్టి విధానాన్ని తెలుసుకోవడం. సృష్టికర్త మేధస్సుతో అనుసంధానం కావడం. ‘నిరంతరం విసర్జకాలని తయారు చేస్తూ, నవరంధ్రాలు నుండీ వాటిని విసర్జిస్తూ ఉన్న శరీరమే, నేను’ . అని అనుకున్నంతకాలం ఆ అనుసంధానం ఒక కలే . అందని ద్రాక్షలు పుల్లన అన్న చందంగా, ఇవన్నీ పుక్కిటి పురాణాలే . 

మీరెప్పుడైనా ఆలోచించారా ? మట్టి నుండి పుట్టిన చెట్టు, అదే మట్టి నుండీ ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. దాన్ని తీసుకున్న ఈ శరీరం (మట్టి చేత పోషింపబడుతోంది ) తిరిగి శరీరాన్ని తయారు చేస్తోంది . తిరిగి మట్టిలో కలిసి పోతోంది.  అంటే, మన్నునే ఆహారంగా చేసుకొని , పుట్టి , తిరిగి అదే మట్టిలో కలసిపోతున్నాం . ఇక అలాంటి మట్టిని గల భూమిని గుండ్రంగా తిప్పుతూ, దానిమీదున్న జీవకోటిని పోషిస్తూ , ఇతర నక్షత్ర మండలాలను నడుపుతూ , సూర్య, చంద్రులనీ, గ్రహాలనీ, ఇవన్నీ ఉన్న వేలవేల  పాలపుంతల్ని , ఒక్క మాటలో చెప్తే, ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు ? అటువంటి వాడి మేధస్సు ఎలాంటిది ? ఆ మేధస్సుతో అనుసంధానం సాధ్యమేనా ? ఇది  ఊహని మించిన ఆశ అనుకోకండి . దీన్ని సాధించిన మహాత్ములేగా మన మహర్షులు . అదే నక్షత్ర మండలంలో ఉన్న ఏడుగురు ఇప్పటికీ దర్శనావిభూతిని ప్రసాదిస్తున్నారు కదా ! యెగమార్గంలో ప్రయాణిస్తే, ఇది సాధ్యమే . 

యోగ  ప్రక్రియ అంటే జీవితాన్నుంచి దూరంగా పోవడం కాదు. నిజానికి అది జీవంతో ప్రేమలో పడడం . బట్టలు కుట్టాలి . సూది లేకపోతె, బట్టని కుట్టడం సాధ్యమెలా అవుతుంది . ఆ సూదిలాంటిదే ఈ దేహం . ఆ పరమాత్మని తెలుసుకోవడానికి , ఆత్మకొచ్చిన అవకాశం . శరీరం ఒక సాధనం .  

భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. మనకీ భౌతిక శరీరం ఉంది కాబట్టే మరో కోణం గురించి ఆలోచించగలుగుతున్నాం. లేకపోతే ఆ అవకాశమే లేదు. మనం ఇక్కడ భౌతికంగా ఉండకపోతే, ఆధ్యాత్మిక ప్రక్రియ అవసరమే రాదు. అందువల్ల ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గమే కాని, అదే ఆధ్యాత్మికత కాలేదు. అదేవిధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికత కాలేవు. అవి జీవితంలోని భిన్నకోణాలు, వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది.

మనం  ఎన్ని ఫార్ములాలు కనిపెట్టినా, ఎన్ని సమీకరణలు చేసినా , అవన్నీ ఈ సృష్టికి మూలమైన అటువంటి  జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నమే. మనం  శాస్త్రంగా భావించేది, సృష్టికర్త మేధస్సుని అర్థం చేసుకునే ప్రయత్నమే. సాంకేతికత అనేది కూడా అప్పటికే ఉన్న సృష్టికర్త సాంకేతికతను, ఏదో కొంత అర్థం చేసుకునే చిన్న ప్రయత్నమే. అందుకే మనం తెలివి తేటలు అనుకునేది ‘తర్క బద్ధమైన తెలివి’ అనుకునేది, సృష్టికి కారణమైన మేధస్సు తో సరిపోల్చ తగినది కాదు. మీరు ఆ సృష్టికి కారణమైన మేధస్సు తో ఒకటిగా కావటానికి సుముఖులైతే, అప్పుడు అది మన  ఆధ్యాత్మికత .

సామాన్యంగా ఉండే మన లౌకిక జీవితం అటువంటి మేధస్సు తో అనుసంధానంలో ఉండదు. భోజనం చేయటం, బట్టలు వేసుకోవడం, ఉండటానికి ఒక ఇల్లు కట్టుకోవడం, ఇంకా అదీ, ఇదీ చేయడం బతకడానికి అవసరమా , కాదా ? అదేగా మనం చేస్తోంది అంటారేమో . అది కాదు అసలు విషయం. 

ఇటువంటి  చిన్న చిన్న వాటిని ముఖ్యం చేసుకోవడ మనేదే ఇక్కడ అసలైన విషయం . ఇవి అవసరం . కానీ ప్రాకులాడాల్సినంత అవసరం కాదు . మనిషి సంపూర్ణంగా బ్రతకాలి అనుకుంటే,  ఈ జీవనం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మనలోకి మనం ప్రయాణించాలి . మనలోనే ఉన్న ఆ సృష్టికర్త మేధస్సుతో అనుసంధానం అవ్వాలి .  

జీవన అలవాట్లలో తేలికైన మార్పులు, యోగాభాసం , మానిసిక ఆధ్యాత్మిక పరివర్తన ఖచ్చితంగా మనకా అవకాశాన్నిస్తాయి. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు . ఫలితాన్ని నాకువదిలెయ్ . నేను నీకు అండగా ఎప్పుడూ ఉంటాను అన్నాడు కదా భగవంతుడు గీతలో . ఆ మాటని ఎల్లప్పుడూ మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి . 

మీరేదైనా ఒకటి చేయదగింది అని నిర్ణయించుకున్నాక మళ్లీ వెనక్కు తిరిగి చూడవద్దు. తోవలో ఎన్నో వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, కాని ఎవరైనా వీటిని విజయవంతంగా అధిగమించాలంటే సంకల్పం ధృడంగా  ఉండాలి. 

“నిశ్చలతత్త్వే జీవన్ముక్తి” అని  ఆదిశంకరులు  మనకు చెప్పింది ఇదే. తన ఉద్దేశంలో నిశ్చలంగా ఉన్న వ్యక్తికి, ముక్తినెవరూ ఆపలేరు. నిశ్చలతత్త్వం లేకపోతే ముక్తి లేదు. ఈ నిశ్చలతత్వమే లేకపోతే  మధ్యలో వచ్చే ఆడ్డంకులనీ, అవాంతరాలను అధిగమించడం చాలా కష్టమైపోతుంది . ప్రతి అవాంతరమూ దాట సాధ్యంకాని మహా పర్వతంలా గోచరిస్తుంది.

ఒకసారి గమ్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత, అది తప్ప మరో లక్ష్యం  లేదని నిశ్చయించుకున్న తర్వాత ఏదీ అసాధ్యమనిపించదు. లక్ష్యం  వైపే నిరంతర ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మిక సాధకుడు చేయవలసిన పని ఇదే. మనం చేయవలసిన ప్రథమ, అతి ప్రధాన కర్తవ్యం కూడా ఇదే . 
అర్జనుడు బాణాన్ని ఎక్కుపెట్టాక, చెట్టూ లేదు , పిట్టాలేదు , కేవలం ఆ పిట్ట కన్నుమాత్రమే ఆ విలుకాని కంటికి కనిపించినట్టు , అదే ఏకాగ్రతని , దీక్షని, పట్టుదలని లక్ష్యం దిశగా నియోగించాలి .  

 అది మారదని, మారకూడదని గట్టిగా సంకల్పించుకోండి .  ఈ విషయంలో మీరు మీ నిశ్చయాన్ని స్థిరంగా ఉంచుకుంటే తక్కిన మీ జీవితం మీ వెనుకే వ్యవస్థితంగా నడుస్తుంది . అది మీ ముందు ఒక అడ్డంకిగా ఉండదు. జీవితం మీ వెనుకే వ్యవస్థీకృతమవుతూ , మిమ్మల్ని ఎల్లప్పుడూ సమర్థిస్తుంది, మీకు తోడ్పడుతుంది. మీ సర్వాంగాలూ, మీ శక్తి, యావత్ర్పపంచం మీ వెనుక నడుస్తుంది . కారణం, మీలో నిశ్చలతత్త్వం ఉంది కాబట్టి. రండి నిజమైన ఆధ్యాత్మికవైపు ప్రయాణిద్దాం . మన పూర్వజుల జ్ఞాన మార్గాన్ని అనుసరిద్దాం . 

శుభం

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore