‘జపం’ మహత్తు తెలిగలేరా !
‘జపం’ మహత్తు తెలిగలేరా !
-లక్ష్మీ రమణ
రామా నీ నామమే అమృతం . నీ నామ జపమే నాకు మధురసపానం అంటారో భక్తుడు. ఇక హనుమన్న సంగతి ఏమి చెప్పేది ? నిరంతరం రామనామమే ఆయనకి సర్వస్వం . ఎక్కడ రామనామం , రామగానం ఉంటాయో అక్కడ వాలిపోవడం ఆయన నైజం. ఆయనకి దాసానుదాసుడు తులసీదాసు “హరిని చేరడానికి నీనామము జపించడమే మార్గమని” అంజనీ సుతుని ప్రార్థించాడు . ఇక, తానీషాకి రామ దర్శనం చేయించిన రామదాసు, కీర్తనలతో రామజపం చేస్తూ, తారకనామము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరామా ! అంటాడు .
ఇటీవల ఆలయాలలో అంతగా వినిపించడం లేదుగానీ , సాయంత్రమైతే , ఆ ప్రాంతంలోని పెద్దలందరూ చేరి చక్కగా నామ సంకీర్తనలు చేసేవారు . నగర నాగరికత అని మనం గొప్పగా భావించే అధునాతన సంస్కృతీ , మన ప్రాచీనమైన ఈ సంప్రదాయానికి కాలడ్డి ఉండవచ్చు. సరే కానీ, అసలీ నామ జపాలు చేస్తే వచ్చేదేమిటిట? అని వెదికలెక్కి ఊదరగొట్టే ఒక మైకు వీరుడి ప్రశ్న ! నిజమే సుమీ ! అదేదో తెలుసుకోవాల్సిందే అనుకోని మొదలుపెడితే, అబ్బో చాలా విషయమే బయటపడింది.
ఒక మంత్రము యొక్క ఆవృత్తి నే జపం అంటారు . అంటే, ఒక మంత్రాన్ని , లేదా నామాన్ని విడువక స్మరించడమే జపం అన్నమాట . నారదుడు , ‘రామ’ అని కూడా పలుకలేని నాలిక గల ఒక కిరాతకుడైన ఆటవికుడుకి ‘మరా’ అనే రెండక్షరాలని ఉపదేశించాడు. అదే మహా మంత్రంగా పరిణమించి, ఆ నామ జపం ఆయనని మహర్షిని చేసింది. ఆ రెండక్షరాలు జపించి , ఆ రెండక్షరాల జపంలో తపించి , చుట్టూ వల్మీకములు (పుట్టలు) పెరిగినా సరే, తెల్సుకోలేనంత తన్మయంతో ఆ జపంలో వసించి , ఆ పరంధాముని పొందిన ఆయన వాల్మీకి మహర్షి అయ్యారు . అనంతమైన జ్ఞానసంపదని అందించారు . దీన్ని బట్టే, జపం యెంత అద్భుతమైనదో అర్థమవుతోంది కదా ! మరింత వివరంగా జప మహత్యాన్ని గురించి చెప్పుకుందాం .
“జ కారో జన్మవిచ్ఛేదః
పకారః పాపనాశకః
తస్మాజ్జప ఇతి ప్రోక్తో
జన్మపాప వినాశకః “
అని శాస్త్రం . అంటే, జప శబ్దములోని జ కారానికి జన్మ నాశనమని - అంటే జన్మ రాహిత్యము , మోక్షప్రదము అని అర్థం . పకారానికి పాపాన్ని పోగొట్టేది అని అర్థం . అంటే, పాపాన్ని నశింపజేసి, జన్మ రాహిత్యము అనుగ్రహించేదే జపము .
జపాన్ని చేసేప్పుడు ఏ వైపుకి తిరిగి కూర్చోవాలి అనేది కూడా సంకల్పం ప్రకారంగా నిర్ణయం చేశారు మన పెద్దలు .
“తూర్పార్యాభిముఖం వశ్యం
దక్షిణం చాభి చారికం
పశ్చిమం దనడం విద్యాత్
ఉత్తరం శాన్తికం భవేత్ || “
అని శాస్త్రం . తూర్పువైపుకి తిరిగి కూర్చొని జపం చేస్తే, వశీకరణము , దక్షిణం దిక్కుకి తిరిగి జపం చేస్తే , శత్రునాశనం లేదా శత్రు పలాయనం , పడమర ముఖంగా చేస్తే, శాంతి లభిస్తాయని పై శ్లోకానికి అర్థం .
దిక్కులని సూచించడమే కాదు , ఏ ఆసనం మీద కూర్చొని జపం చేయాలనే సందేహాన్ని కూడా నివృత్తి చేస్తూ, ఏవిధమైన ఆసనాన్ని వేసుకోవడంవల్ల ఫలితం ఏమిటి అనేది విశదీకరిస్తూ, ఇలా చెప్పారు :
కృష్ణాజినే జ్ఞానసిద్ధి:
మోక్షశ్రీ:వ్యాఘ్ర చర్మణీ
కుశాసనే మంత్రసిద్ధి :
నాత్ర కార్యావిచారణా ||
దీని ప్రకారం , జింకచర్మం మీద కూర్చొని జపం చేస్తే జ్ఞానము , పులిచర్మం మీద కూర్చొని చేస్తే మోక్షము , దర్భాసనం మీద కూర్చొని చేస్తే మంత్రం సిద్ధి కలుగుతాయని అర్థమవుతోంది .
అయితే, పెళ్ళికీ , పిడుగుకీ ఒకే మంత్రం ఉండనట్టు , అన్ని మంత్రాలకూ ఒకే ఆసనం , ఒకే దిక్కూ పనికిరాదు. జపించాల్సిన మంత్రాన్ని , సంకల్పాన్ని అనుసరించి వీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం . కానీ, నామాన్ని పలికినంతమాత్రాన , ఆజపం చేసినంత మాత్రాన ఫలితం లభిస్తుందా అని సందేహం ఏమాత్రమో మిగిలేవుంటుంది మన అంతరాంతరాలలో . దానిని కూడా నివృత్తి చేస్తూ ఇలా చెప్పారు ,
యక్షరక్ష:పిశాచాశ్చ
గ్రహః సర్వేచ భీషణాః |
జాపినం నొప సర్పంతి
భయభీతాః సమంతతః ||
అన్ని దిశలలో ఉండే భూత, ప్రేత , పిశాచాలు, భయంకరమైన గ్రహాలూ రోజూజపం చేసే వారి చెంతకి రావడానికి భయపడతాయట . ఆంటే కాదు జన్మ జన్మల నుండీ చేసినటువంటి పాపారాసి దగ్దమై పోతుంది . అనంతమైన భోగభాగ్యాలు కలుగుతాయి . అకాల మృత్యువు దరిచేరదు. ఇంకా అణిమాదిసిద్ధులు కూడా లభిస్తాయి. చివరకు మోక్షం సైతం సిద్ధిస్తుందంటూ చెప్పిన ఈ శ్లోకాన్ని పరికించండి .
జవేన పాపం శమయే పేదశేషం
యత్తత్కృతం జన్మపరంపరాసు
జాపేన భోగాన్ జయతే చ మృత్యుమ్
జపేనసిద్ధిం లభతే చముక్తిమ్ ||
ఇన్ని ప్రయోజనాలున్న జపాన్ని కనీసం రోజుకో ఒక పదినిమిషాలైనా చేస్తే , యెంత బాగుంటుందో కదా ! కానీ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి . చేతిలో జపమాల తిప్పుతూ , పెదవులు కదిపి దాన్ని జపం అంటే ప్రయోజనం లేదు . చిట్టా వృత్తులన్నీ కూడా ఆ నామం మీద కేంద్రీకృతమైతేనే , అది ఫలితాన్నిస్తుంది. నామం భగవంతుడిది , భక్తి ప్రసాదానిది అన్నట్టు , మనిషొకచోట , మనసు మరోచోట పరిభ్రమించకూడదు . ఆ పదినిమిషాలయినా, చిత్తం స్వామికి దాసోహమవ్వాలి . నామాన్ని నాలికతో పాటు మనసూ స్మరించాలి . ఆత్మ ఆ పరమాత్మ కోసం తపించాలి . జపంతో చేసే ఇలాంటి తపం తప్పక ఫలితాన్నిస్తుంది .
శుభం .