Online Puja Services

రావణాసురుడు మంచోడా , చెడ్డోడా ?

3.142.156.58

రావణాసురుడు మంచోడా , చెడ్డోడా ? 
-లక్ష్మీ రమణ 

ఈ మీమాంస రామాయణం చదివినవారికి ఖచ్చితంగా కలుగుతుంది . ఒకవైపు రావణాసురుడి ఉదాత్తమైన లక్షణాలు , మరోవైపు ఆయన చేసిన దుర్మార్గాలు . ఎక్కడా ఒకదానికొకటి లింకు లేకుండా ఉంటాయి . నీలమేఘశ్యాముని సుగుణాలు , ముగ్ధ మోహనమైన రూపం ఒక చల్లని పిల్లతెమ్మెరలా హాయిగా మనసుని తాకుతుంటే, రావణబ్రహ్మ రూపం పదితలలతో, భయంకరంగా కళ్ళముందు నాట్యం చేస్తుంది . అయినా ఆయనో మేధావి అని ఆ పాత్ర వివరణలో తెలియవస్తుంది . 

ఇంతకీ రావణాసురుడు చెడ్డోడా? మంచోడా ?
 
రావణాసురుడు ఎందుకు సీతమ్మని ఎత్తుకొచ్చాడు . చెల్లెలు సూర్పణక ముక్కుచెవులూ రామ లక్ష్మణులు కోసేసారానా ? స్వయంవరంలో సీత తనని వరించలేదనా? ఆమె మీద మోహం తోనా ? అసలు కథలో పైకి  కనిపించే ఈ కారణాలే సీతని ఎత్తుకురావడానికి కారణం అనుకుందాం . కానీ రావణుడు విజ్ఞతలేని పశువుకాదు . ఒక్క శివతాండవ స్తోత్రం చాలు ఆయన ఎంతటి విజ్ఞానవంతుడో తెలియడానికి . అసమాన శివభక్తి తత్పరుడు రావణాసురుడు . 

రామాయణంలో రావణుడిని సంపూర్ణ ప్రతినాయకుడిగా చిత్రీకరించినప్పటికీ ఎన్నో సద్గుణాలు కలవాడిగా చెప్పారు . అందులో ముఖ్యమైనవి అపార శాస్త్రపరిజ్ఞానం, వైద్య విజ్ఞానం, మంత్ర విద్య. వీటన్నింటిలో ఆరితేరినవాడు రావణబ్రహ్మ .  తన పాలనలో కులవ్యవస్థను రూపుమాపి ఒక సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, మంచి పాలకుడిగా పేరుగాంచాడు కూడా ! ఇక, స్త్రీ వ్యామోహమంటారా ? ఆంజనేయస్వామి , సీతమ్మని వెదుకుతూ లంకానగరంలోని మేడలు మిద్దెలూ అన్ని పరిశీలించి , ఒక మాటంటాడు , సీతతక్క మిగిలివారందరూ రావణుని శౌర్య ప్రతాపాలు చూసి అతనిని వరించి వచ్చినవారే ! అటువంటి వారిలో దేవ ,మానవ, గాంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష తదితర జాతి స్త్రీలెందరో ఉన్నారని చెబుతారు . అనుపమాన సౌందర్యవతులైన అంతమంది ఆయన దగ్గర ఉండగా ఇక సీతమ్మని  వ్యామోహంతో ఎత్తుకురావలసిన అవసరమే లేదు . 

అసలు ఇంకోరకంగా ఆలోచిస్తే, సీతాదేవిని రావణాసుడు ఎత్తుకురాలేడు  కూడా ! సీతమ్మ చిన్నారిగా ఉన్నప్పుడు, ఆడుతూ పాడుతూ ఎట్టి పక్కన పెట్టిన శివధనస్సుని , రావణబ్రహ్మ ఆవిడ స్వయంవరంనాడు ఎక్కుపెట్టలేకపోయాడు కదా ! అటువంటి మహామాయా స్వరూపమైన జగన్మాతని ఎలా ఎత్తుకురాగలిగాడు ? రావణుడు తన ముందర ఖచ్చితంగా గడ్డిపోచేనని ఆమెకు మాత్రం తెలీనిదా? 

మరేందుకు సీతమ్మని ఎత్తుకొచ్చాడు ? అంటే, ఆయన ఆ పరమాత్మని శత్రుత్వంతోనైనా  చేరుకోవాలనుకున్నాడు . మొదట ఆ పరాశక్తిని శివునినుండీ వేరుచేయాలనుకున్నాడు . అది ఎలాగో తప్పిపోయింది .  ఆ తర్వాత ఆత్మలింగాన్ని తెద్దామనుకుంటే, వినాయకుడు అడ్డంతగిలాడు . ఇక లాభంలేదని కైలాసాన్నే పెకిలిద్దాం అనుకుంటే, శివయ్యమీదున్న భక్తి కాపాడేసింది . బోళాశంకరుడు, భక్తికి వశుడైన శివయ్యతో లాభంలేదు, కేశవుడి చేతిలో నైనా మోక్షం కావాలనుకున్నాడు .  తనని యుద్ధంలో గెలిచేందుకు శత్రువుకి అనుకూలంగా ఉండే ముహూర్తాన్ని తానె నిర్ణయించి , రామయ్యకి చెప్పాడంటే , ఆయన ఎంతటి ధర్మనిరతుడు అయ్యుంటాడో ఆలోచించాలి .  ఒక విధంగా తన మరణానికి తానె ముహుర్త నిర్ణయం చేసిన వ్యక్తిగా రావణాసురుడు కనిపిస్తారు . ఇవన్నీ కూడా ఆయన తన కైవల్యాన్ని కోరి చేశాడేమో  అనిపిస్తుంది . ఆ భగవంతునిలో లీనమయ్యేందుకు ఆయనచేతిలో మరణించడంకన్నా వేరేదారి ఇంకేదుంటుంది ?  అందుకే ఆ రామయ్యతో శత్రుత్వాన్ని నటించి , చివరి క్షణం వరకూ తన పాత్రని అత్యున్నతంగా పోషించి రక్తికట్టించాడెమో అనిపిస్తుంది  . నిజానికి  ఆయన అంతరాంతరాల్లో అత్యున్నతమైన సిద్ధిని పొందిన ఆధ్యాత్మిక ఋషి అంటే తప్పుకాదేమో !

శ్రీలంకలో బయటపడిన రావణలంక అవశేషాలని, ఆనాటి గుర్తులనీ చూస్తుంటే, శాస్త్రవేత్తలకు దిమ్మతిరిగిపోయే వైజ్ఞానికత (టెక్నాలజీ) బయటపడుతోంది. ద్వారకా నగర నాగరికతని చూసి నోరెళ్లబెట్టిన మన నాగరీకులు, రామాయణకాలంనాటి , రావణాసురుడి విమానాశ్రయాలు , విమానాలూ చూసి ఆశ్చర్యపోతున్నారు . 

దీన్ని బట్టి విమానాన్ని తయారు చేసిన సోదరుల పేరుని పుస్తకాల్లో తిరగరాయాల్సిన అవసరముందేమో పరిశీలించాల్సి వచ్చేలా ఉంది పరిస్థితి .

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore