Online Puja Services

అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?

3.131.37.237

ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?

“Die Empty” అనే పెద్ద నీతితో కూడిన ఒక చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు. ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.

టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.

‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.

‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’ . ‘ఎందుకంటే…’ అంటూ ఆయనే ఇలా వివరణ ఇస్తాడు.

‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి’

డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.

ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die empty” అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు. ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట.

‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి’  అని . 
 
నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.   
‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.
‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.
‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.
 ‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’

వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం! ఇదేకదా నిజమైన దైవత్వం అంటే .

- లక్ష్మి రమణ 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha