ప్రేమంటే , ఏమిటంటే
ప్రేమంటే , ఏమిటంటే ..
ప్రేమంటే , ఏమిటంటే , నిను ప్రేమించినాక తెలిసే అంటాడు ఒక సినీకవి . కానీ ఆధ్యాత్మికమైన ప్రేమ సరిహద్దులు లేనిది . శరీరానికి అతీతమైనది . విశ్వజనీనమైనది . గీతాకారుడన్నట్టు , ప్రపంచంలోని దేన్నయినా సాధించగలిగిన దివ్యాయుధం ప్రేమే !
ఆ ప్రేమకి యెంత శక్తి లేకపోతె, రాజ్‌పుత్ రాణి మీరాబాయి , కృష్ణ ప్రేమలో మైమరచిపోయి వీధుల్లో నాట్యం చేస్తుంది ?
ఆప్రేమలో యెంత శక్తి లేకపోతె, భక్తపోతన కటిక దారిద్రంలోనూ , తన కావ్యకన్యకని రాజదాస్యానికి పంపనని శారదాదేవిని ఓదారుస్తాడు ?
ఆ ప్రేమకి యెంత శక్తి లేకపోతె, అన్నమయ్య తానె ఒక గోపికై గోవిందునిపై మధుర గీతాలల్లుతాడు ?
ఆ ప్రేమకి యెంత శక్తి లేకపోతె ఒక్క తులసీదళంతో మాత రుక్మిణి జగన్నాధుని తూయగలిగింది ?
ఇది కాదా దివ్యప్రేమ . ఇదికాదా విశ్వప్రేమ . ఈ ప్రేమ మనలో చిగురించాక , నీవు నేనన్న భేదాలు లేవు . అణువూ అణువునా నిండిన దేవుని అంతరాత్మలో సందర్శించడమే !
అందుకే , మానవ ప్రేమ సరిహద్దులు దాటి దివ్యప్రేమను అలవర్చుకోవాలి. ఆ దివ్య ప్రేమ నీ శరీరంలోని ప్రతీ అణువులో వ్యాపించాలి. నీ హృదయం లో నుండి దివ్యప్రేమ ఉప్పొంగాలి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు అన్నీ ఆ దివ్య ప్రేమను ప్రతిబింబించాలి. దివ్య ప్రేమ అతి శక్తివంతమైనది. అది ద్వేషానికి ప్రతిగా ప్రేమను అందిస్తుంది. దివ్య ప్రేమ అందరి మంచికి ఉపయోగపడుతుంది. అలాంటి ప్రేమలో అహంకార ప్రదర్శన, డాబు, దర్పాల ప్రదర్శన ఉండవు! ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే సేవ ఏదైనా దివ్య ప్రేమకు సంబంధించినదే. అలాంటి సేవ స్వీకరించే వారికి ఎంత ఆనందంగా ఉంటుందో చేసే వారికి అంతకంటే ఎక్కువ ఆనందం కలిగిస్తుంది.
- లక్ష్మి రమణ