*”తప్పు" చేశానా?*
*”తప్పు" చేశానా?*
నేనేమి తప్పు చేశాను?
నేనేమి తప్పు చేయలేదు.
అంటూ చాలా మంది చాలా మొండిగా, మూర్ఖంగా, మొరాయిస్తూ, వాదిస్తుంటారు.
"ముందు జాగ్రత్త, వేగం తరువాత"ను లెక్క చేయకుండా "జాగ్రత్త"ను వేగం తొక్కేస్తే "వేగం" వాహనదారులను మింగిన సన్నివేశాలు తెలుసుకదా!
"ప్రమాదకర మలుపు , నెమ్మదిగా వెళ్లుము"ను పెడ చెవిన పెట్టి వేగంగా వెళ్లి "పోయిన"వారు ఉన్నారు కదా!
"Speed thrills but kills" ను "నిర్లక్ష్యం" చేసి "నిర్యాణమై"నవారు లేరంటారా???
"No Parking" వద్ద park చేసి మున్సిపాలిటీ వారికి ముడుపులు చెల్లించిన సందర్భాలు లేవా???
"Slips" ఉంటే బయటపడెయ్యండన్న invigilator మాటలు లెక్క చేయక చిక్కిన వారు ఉన్నారు కదా!
పార్టీకో, పిక్నిక్ కో వద్దనంగా "వెళ్లి" "తిరిగిరాని లోకాలకు" వెళ్లిన వారున్నారుకదా!
తినకూడనివి, తినవద్దన్నవి తిని ప్రాణం మీదికి తెచ్చుకున్నవారు లేరా???
చంటి పిల్లలు వద్దన్నా బుజ్జగించి ఆరోగ్యకరమైనవే వడ్డిస్తాము ఎందుకు?
వాళ్ల ఆరోగ్యానికి హాని వాటిల్లకుండా వారించటానికి కాదా???
మరి, వయసుకొచ్చినవారిని కొట్టలేము, తిట్టలేము. పిల్లలు కాదుగా భరించటానికి. ఎదురుతిరుగుతారు కదా! నొచ్చుకుంటారు కదా! అని చిచ్చు పెట్టుకుంటున్నా అసమర్థులుగా, నిస్సహాయులుగా మిగిలిపోతాం.
తప్పు అంటే కేవలం వ్యభిచారం, లేదా దొంగతనం, ఇంకా హత్యచేయటమో మాత్రమే కాదు.
"మనసు మాట, మనిషి మాట" వినకపోవటం అసలైన పెద్ద తప్పు.
చేయాల్సింది చేయకపోవడం,
చేయకూడనిది చేయటమూ తప్పే.
ఉండాల్సిన విధంగా వుండకపోవటం,
వుండకూడని రీతిగా వుండటమూ తప్పే.
ఉండాల్సిన చోట ఉండకుండా,
వుండకూడని చోట ఉండటం,
వుండాల్సినవారితో వుండకుండ,
వుండకూడనివారితో ఉండటమే తప్పు.
మంచిని, మంచివారిని మంచి అనకపోవడం,
చెడుని, చెడ్డవారిని తప్పు అనకపోవడం కూడా తప్పే.
"తప్పా" అని ఇతరులతో అవివేకంగా వాదించటం మాని,
మౌనంగా మనసు మాట వింటే విపులంగా అర్ధమౌతుంది చేసేది తప్పా కాదా అని.
మనఃసాక్షి తప్పొప్పులను చూసుకునే మంచి అద్దం.
అద్దం అందం విషయంలో అబద్దమాడునా???
బుద్ధి గ్రుడ్డిదైనపుడు, ఆలోచన చెడ్డదైనపుడు, అద్దమేమి చూపిస్తుంది???
ఉన్నది చూడకుండా, ఏదో చూడాలనుకుంటే అద్దం బుర్రలోకెళ్లి చూడలేదు కదా! అద్దం అబద్దమాడలేదుకదా???
"కామేచ్ఛతో ఇతరులను చూడటం వ్యభిచారంతో సమానం" అని చదినట్టు జ్ఞాపకం.
తప్పు అంటే కేవలం వ్యభిచారం, దొంగతనం, హత్యలే కాదు.
వీటికంటే
ఘోరమైన తప్పే "మోసం", "నమ్మకద్రోహం", "అబద్దం", "ఆలోచించకపోవడం".
*తలిదండ్రుల పెన్షన్‌ను సైతం మొత్తం నొక్కేసి వాళ్ల ఆర్థిక స్వాతంత్ర్యానికి సంకెళ్లువేస్తున్న పుత్రరత్నాలున్నారు.*
*పున్నామ నరకాన్నుంచి పుత్రులు తప్పించడం దేవుడెరుగు. ప్రతీక్షణం స్పష్టమైన నరకాన్ని చవిచూపిస్తున్నారు అలాంటి పుత్రులు*
తర్వాత తమవంతు కూడా ఇదేనని ఎరుగని దౌర్భాగ్యులు…!
- దాట్ల వెంకట సుబ్బరాజు