పంబన్ బ్రిడ్జి ప్రయాణం
పంబన్ బ్రిడ్జి ప్రయాణం
పరమాచార్య స్వామివారు కాశీయాత్ర ముగించిన తరువాత సర్వేశ్వరుడు శ్రీ పెరియవా బిహార్, బెంగాల్, ఒరిస్సా మరియు ఆంధ్ర రాష్ట్రాలు పర్యటించి, గంగాయాత్ర పరిసమాప్తం చేస్తూ శ్రీ రామనాథస్వామికి గంగాభిషేకం చెయ్యడానికి నేరుగా రామేశ్వరం ప్రయాణమయ్యారు. అది 1939 జూన్ మొదటి వారం.
అప్పట్లో మందపం, రామేశ్వరం కలుపుతూ రోడ్డు వంతెన లేదు. కేవలం రైలు వంతెన మాత్రమే ఉండేది ఆరోజుల్లో. మహాస్వామివారి మకాం తిరువారూర్ లో ఉండగా, అప్పయ్య కుప్పుస్వామి అనే భక్తుణ్ణి పిలిచి, తిరుచ్చికి వెళ్లి ఇంపీరియల్ బ్యాంక్ నారాయణస్వామిని కలవమన్నారు. అతనితో జూన్ 8 లేదా 9న పరమాచార్య స్వామి మరికొందరు కైంకర్యం భక్తులు పంబన్ వంతెనపై నడిచివెళ్ళడానికి, వారితోపాటు ఒక ట్రాలిలో పూజసామాను కూడా తరలించడానికి దక్షిణ రైల్వే అధికారిని అనుమతి కోరాలని చెప్పారు.
శ్రీ కుప్పుస్వామి తిరుచ్చి వెళ్లి శ్రీ నారాయణస్వామిని కలిసి పరమాచార్య స్వామివారు పంపిన సందేశం తెలిపారు. శ్రీ నారాయణస్వామి ఆ సాయంత్రమే ఈ విషయమై రైల్వే అధికారిని కలుస్తానని మరుసటిరోజు రమ్మని పంపించాడు.
కుప్పుస్వామి ఆరోజు రాత్రి ఉరైయ్యూర్ లో ఉండి, మరుసటిరోజు ఉదయం నారాయణస్వామిని కలిశాడు. ఇందుకోసం శ్రీమఠం నుండి వ్రాతప్రతిలో అభ్యర్ధన పంపాలని తెలిపాడు. రైల్వే అధికారులని నారాయణస్వామి అడిగింది ట్రైన్ల రాకపోకలు లేనప్పుడు పరమాచార్య స్వామివారు వంతెన దాటడానికి అనుమతి. కాని ఆ అధికారులు ట్రాక్ ల మధ్యలో చక్కబల్లలు వేసి స్వామివారు నడవడానికి అనుకూలంగా చెయ్యడానికి సిద్ధం అని తెలిపారు. ఇందుకోసం శ్రీమఠం నుండి వచ్చే అభ్యర్ధన పత్రంలో ఈ విషయం కూడా చేర్చాలని సూచించారు. మొత్తం చర్చించిన తరువాత, కుప్పుస్వామిద్వారా శ్రీమఠం నుండి అభ్యర్ధన పత్రం తెప్పించాడు నారాయణస్వామి.
మరలా మూడు గంటలకు కుప్పుస్వామి వెళ్లి నారాయణస్వామిని కలిశాడు. ఇద్దరూ దక్షిణ రైల్వే కార్యాలయానికి వెళ్లి అక్కడి ప్రతినిధిని కలిశారు. ఆ అధికారులు వారిని స్వాగతించి, ఆ అభ్యర్ధన గురించి శ్రద్ధగా పనిచెయ్యడం మొదలుపెట్టారు. చీఫ్ ట్రాన్స్పోర్టేషన్ సూపరింటెండెంట్ ఒక లేఖ ఇవ్వమని చెప్పి, అతడే స్వయంగా ఆ లేఖ తయారుచేసి వాళ్ళకు ఇచ్చాడు.
వారు సూపరింటెండెంట్ కలవగానే మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. పరమాచార్య స్వామివారి అభ్యర్థనకు వారు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో అర్థం చేసుకున్నారు. “మందపం క్యాంప్ రైల్వేస్టేషన్ మాష్టర్ ను సంప్రదించి, ఆ వంతెనపై రైళ్ళు రాని సమయమేదో కనుక్కుంటాను. వారి అంగీకారాన్ని దాటడానికి తగిన సమయం వివరాలతో ఒక వ్యక్తిని మీ ఇంటి వద్దకే పంపుతాను. ఆ సమయం లోపలే వంతెన దాటడం పూర్తవ్వాలి” అని చెప్పారు సూపరింటెండెంట్.
వారు చెప్పినట్టుగానే, మరుసటిరోజు సాయంత్రం ఐదుగంటలప్పుడు ఒక రైల్వే అధికారి వచ్చి ఆ లేఖను ఇచ్చివెళ్ళారు. అందులో ఇలా ఉంది.
“పూజ సామాను ఉంచడానికి, ఒక నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక శుభ్రమైన ట్రాలీ సమకూరుస్తాము. అందులో కూర్చున్నవారిని ఎండ నుండి కాపాడటానికి ఆ ట్రాలీకు ఒక గొడుగు అమర్చాము. దాన్ని తోయడానికి ఆరుగురు మనుషులను ఏర్పాటుచేశాము. పరమాచార్య స్వామివారు, వారితో పాటు మరో పదిమంది సేవకులు నడవడానికి వీలుగా సమాంతర పట్టాల మధ్యలో చక్క బల్లలు పరుస్తాము. ఉదయం తొమ్మిది గంటలకు పెరియవా తమ శిష్యులతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించి, పదిన్నర గంటల లోపల వంతెన దాటవలసిందిగా అభ్యర్తిస్తున్నాము”
కుప్పుస్వామి ఈ లేఖను తీసుకునివెళ్లి ఇదే విషయాన్ని మహాస్వామి వారికి తెలిపాడు.
ఆరోజున ఉదయం తొమ్మిది గంటలకు పూజసామాను ట్రాలీలోకి ఎక్కించి ఇద్దరు కైంకర్యం భక్తులు వాటిని జాగ్రత్తగా పట్టుకున్నారు. మరో ఇద్దరు కూడా ట్రాలీ కోసమే వినియోగింపబడ్డారు. ఒకరు ట్రాలీ ముందువైపు ఒకరు వెనుకవైపు కూర్చున్నారు. ట్రాలీ బయలుదేరగానే మరో నలుగురితో కలిసి మహాస్వామివారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇద్దరు స్వామివారికి ఇరువైపులా, మరో ఇద్దరు స్వామివారిని అనుసరిస్తూ సాగిపోతున్నారు. అందరూ పంబన్ వంతెనపై స్వామివారికోసం ఏర్పాటుచేసిన చెక్క బల్లలపై నడుస్తున్నారు.
చాలా బలమైన గాలులు వీస్తున్నప్పటికి పరమాచార్య స్వామి వారు వేగంగా నడిచి తక్కువ సమయంలో వంతెనను దాటారు. అత్యుత్తమైనది ఇంకా ముందు ఉంది. స్వామివారు వంతెనను దాటగానే, చీఫ్ ట్రాన్స్పోర్టేషన్ అధికారి పళ్ళాల నిండా పళ్ళతో స్వామివారిని సకల మర్యాదలతో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆయన ఎంతో ఆప్యాయంగా స్వామివారిని “అంతా సవ్యంగా ఉండి, మీకు సౌకర్యంగా ఉన్నింది కదా?” అని అడిగారు. పరమాచార్య స్వామివారు ఆ అధికారికి కృతజ్ఞత తెలపమని కుప్పుస్వామికి చెప్పారు. మరుసటి రోజు గంగాభిషేకం పూర్తవ్వగానే, మహాస్వామి వారు ఆ అధికారిని పిలిచి పళ్ళు, రెండు పట్టు బట్టలు ఇచ్చి ఆ సాయంత్రమే మందపం వెళ్లి స్టేషను మాష్టర్ కు, తిరుచ్చి వెళ్లి అధికారులకు కృతజ్ఞతను తెల్పమని ఆదేశించారు.
పరమాచార్య స్వామివారి విజ్ఞాపనని దైవాజ్ఞగా భావించి, చక్క బల్లలు సమకూర్చిన అధికారులు, స్వామివారి కంటే ముందే ఆహ్వానించడానికి అవతలివైపుకు వెళ్లిన అధికారులు అందరూ ఆంగ్లేయులు. విదేశీయులకు కూడా స్వామివారు అంటే ఎంత గౌరవమో అర్థం అవుతుంది. శ్రీమఠం పీఠాధిపతిగా శ్రీ పరమాచార్య స్వామివారికి వారు చూపించే గౌరవం ఇది.
రామేశ్వరం వద్ద మూడు కిలోమీటర్ల పంబన్ వంతెనను ఎంతో కఠినమైన కాలినడక ద్వారా దాటుతున్న మహాస్వామివారి అపురూప చిత్తరువు ఇది.
--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।