ప్రమాదం - ప్రమోదం
ప్రమాదం - ప్రమోదం
1972, జనవరి 8న మా అత్తమామలతో కలిసి వారి శతాభిషేకానికి ఆశీస్సులను కోరుతూ పరమాచార్య స్వామి దర్శనం కోసమని కాంచీపురం వెళ్ళాము. వలజాబాద్ దగ్గరలో మా మామగారు కాస్త కారు ఆపమంటే ఆపి, వారితోపాటు రోడ్డుకు అటువైపు వెళ్లాను. నాలుగేళ్ల మా రెండో అమ్మాయి నా దగ్గరకు రావాలని కారునుండి దిగి, విల్లుని వదిలిన బాణంలా దూసుకొచ్చింది.
అది జాతీయ రహదారి కావడంతో, వేంగంగా వస్తున్న వాహనం మా అమ్మాయిని ఢీ కొట్టడంతో, అమ్మాయి చక్రాల కింద పడిపోయింది. అ ప్రమాదాన్ని చూసిన అందరమూ, భయానికి లోనయ్యి మ్రాన్పడిపోయాము. ఆ ప్రమాదంలో అమ్మాయి తలకు పెద్ద దెబ్బ తగిలి తలంతా రక్తపు మడుగులో తడిసిపోయింది. తలలో పెద్ద దెబ్బ తగలడం వలన ముక్కులో, చెవుల్లో రక్తం కారుతూ ఉంది. వెన్నెముక చివరి భాగం, ఎడమకాలు ఎముకల్లో చీలిక వచ్చింది. ఎడమ దవడ ఎముక విరిగిపోయి బయటకు కనిపిస్తోంది. ఎడమ కనుగుడ్డు ఇరుక్కుపోవడంతో రక్తపు చారిక కనపడుతోంది. బయట కనపడేవి కాకుండా లోపలి అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. నిండు గర్భిణి అయిన నా భార్య ఈ దృశ్యాన్ని చూసి పెద్దగా కేకపెట్టి మూర్చపోయింది.
వెంటనే పాపను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. అక్కడి వైద్యులు పాప స్థితి చూసి ఇక తను ప్రాణాలతో ఉండడం అసంభవమని నిర్ధారించారు. మహాస్వామివారి దర్శనం చేసుకోకుండా పాపని మద్రాసుకు తీసుకుని వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాము.
ఇక్కడ ఉన్న ప్రత్యేక నిపుణులు, న్యురోసర్జన్లు కూడా పాప బ్రతకదు అని తేల్చేశారు. నా పాప స్థితిపై వైద్యులు ఇచ్చిన తీర్పు నాకు ఆశనిపాతంలా తాకింది. వెంటనే నా భార్య తన సోదరుడిని కంచికి పంపి, ఈ దుర్ఘటన గురించి, పాప పరిస్థితి గురించి పరమాచార్య స్వామివారికి తెలపమని చెప్పింది. ఇలాంటి స్థితిలో కూడా అతనకు మహాస్వామివారిపై ఉన్న నమ్మకం, భక్తి అనన్యమైనది.
మొత్తం విషయం అంతా విన్న స్వామివారు కొన్ని క్షణాలపాటు కళ్ళు మూసుకుని, దగగ్రలో ఉన్న వెదురు బుట్ట నుండి ఒక ఆపిల్ పండును తీసుకుని, కమండలంలో ఉన్న నీటితో అభిషేకించి, డానికి పూజ చేసి నా బామ్మర్దికి ఇచ్చి, ఆసుపత్రిలో పాప వద్ద ఉంచమని ఆజ్ఞాపించారు. జగన్మాత కామాక్షి దేవి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాల వల్ల పాప ఈ గండాన్ని దాటగలదని భరోసా ఇచ్చిపంపారు.
కాని పాప ఏ వైద్యానికి ప్రతిస్పందించుట లేదు. డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. పరమాచార్య స్వామివారు ఇచ్చిన ఆపిల్ పండును పాప మంచం దగ్గర పెట్టాము. వారం రోజులో అద్భుతం జరిగింది. వైద్యులని, వైద్య చరిత్రని అబ్బురపరుస్తూ పాప పూర్తిగా కోలుకుంది. అత్యంత సౌందర్యంతో, ఖరీదైన పట్టుపుట్టంతో, తలపై బంగారు కిరీటంతో, దైవత్వం కురిసే చిరునవ్వుతో ఉన్న ఒక చిన్నపాప రాత్రిపగలూ తనకు రక్షణగా ఉన్నదని నాకు, అక్కడున్న అందరికి చెప్పనారంభించింది. లార్డ్ టెన్నిసన్ చెప్పినట్టుగా, “ఈ ప్రపంచం కలలు కంటూ పొందినవాటికంటే, ప్రార్థన ద్వారా పొందినవే ఎక్కువ”. కాని ఇక్కడ ఎటువంటి ప్రార్థన చెయ్యకపోయినా, అవ్యాజ కరుణామూర్తి అయిన పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల నా కుమార్తె చావు నుండి రక్షింపబడింది.
తను పూర్తిగా కోలుకున్న తరువాత తనని మహాస్వామి వారి వద్దకు తీసుకునివెళ్ళాను. స్వామివారు విపరీతమైన జ్వరంతో ఉన్నా మాకు దర్శనం ప్రసాదించి, పాప ఆరోగ్యం గురించి విచారించారు. వారి కరుణా కటాక్షములు, దయ, ప్రేమ, ఆశీస్సులను తలచుకుని చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాను. నాకు స్వామివారు ప్రతి ఆదివారము సహస్ర గాయత్రీ జపం చెయ్యాల్సిందిగా అజ్ఞాపించారు. ఆధ్యాత్మికం నుండి మనస్సును దూరం చేసే రాజకీయ చర్చలకు దూరంగా ఉండమని చెప్పారు. స్వామివారికి నేను పడ్డ రుణాన్ని కేవలం గాయత్రీ జపం ద్వారా మాత్రమే తీర్చుకోగలనని చెప్పారు. కొన్ని నెలల పాటు స్వామివారి ఆజ్ఞను పాటించి పూర్తి విశ్వాసంతో కేవలం ఆదివారం కాకుండా రోజూ సహస్ర గాయత్రీ చెయ్యడం ప్రారంభించాను.
ఒకసారి పరమాచార్య స్వామివారు సతారాలో మకాం చేస్తున్నప్పుడు వారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు సమయం మధ్యరాత్రి మూడు గంటలు. ఆ సమయంలో కూడా పరమాచార్య స్వామివారు నాకోసం కబురు చేసి, గాయత్రీ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం చెప్పమన్నారు. కొద్దిగా శరీరంలో ప్రకంపనలు కలుగుతుండగా, శ్లోకం అప్పజెప్పాను. దాదాపు అరగంట సేపు మహాస్వామివారి దాని విశిష్టతను అర్థాన్ని తెలుపుతూ సంభాషించి, జపం చేసేటప్పుడు స్ఫురణలో ఉంచుకోమన్నారు. కాని అంతటి మహిమాన్వితమైన మంత్రరాజమైన గాయత్రీ మంత్ర ధ్యాన శ్లోకంలో చెప్పబడినట్టుగా అమ్మవారిని ధ్యానించలేనని నా అశక్తతను తెలియజేశాను. కాని జప సమయంలో మహాస్వామివారి దివ్యచరణ కమలాలను మాత్రం జపం సాగుతున్నతసేపూ మనస్సులో నిలుపుకుని ఉంటానని తెలపడంతో స్వామివారు చిన్నగా నవ్వారు. ఇది న జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. గాయత్రి మంత్రం యొక్క విశిష్టతని, గొప్పదనాన్ని నాకు అగుపరచి నాలోని భక్తిభావాన్ని పెంపొందించారు.
పరమాచార్య స్వామివారు పరబ్రహ్మ యొక్క సాకార చార రూపం. “నేను బ్రతికినందుకు మా న్నాన్నకు ఋణపడిఉన్నాను. బాగా బ్రతికినందుకు నా గురువుకు ఋణపడిఉన్నాను” అని తనని ఉన్నత వ్యక్తిగా మార్చిన గురువైన అరిస్టాటిల్ గురించి అలెగ్జాండర్ చెప్పినట్టు, విరోధము, కోపము, ద్వేషము, అహంకారము, క్రూరత్వము వదిలి ఇంత అద్భుతంగా జీవిస్తున్నాము అంటే అది కేవలం పరమాచార్య స్వామివారి కరుణ వల్ల మాత్రమే.
అశాంతి, బాధ, ఆందోళనలతో ఉన్న ఎవరైనా మహాస్వామి దర్శనం కోసం కంచి వెళ్తే, ఆ కరుణ నుండిన కన్నులు, దివ్యత్వం ఒలకబోసే చిరునవ్వు, ప్రశాంతత నిండిన ముఖము, తేజస్సుతో కూడిన దేహాన్ని చూడగానే, ఒక్కసారిగా మనస్సును శాంతపరచి, అమృతం త్రాగిన అనుభూతితో, కొత్త ఉత్సాహము, ఉత్తేజంతో ఇంటికి తిరిగివెళ్తారు.
మన శాస్త్రాల్లో చెపిన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలు, నియమాలను పాలించడంలో, ఇతరుల చేత పాలింపజేయటంలో మహాస్వామివారు ఎప్పుడూ ముందే. వేలకొలది ప్రసంగాలలో, ఉపన్యాసాలలో వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని జనసమూహానికి అందించి వారిని కార్యోన్ముఖులను చేశారు. ఈ నియమనిష్టలు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, వ్యక్తుల అవసారాలను బట్టి మార్పులు చేయకుండా అవలంబించాల్సిన పవిత్ర విషయాలు. కాని ఈకాలంలో ద్విజులు కూడా వీటిని విడిచి ఐహిక విషయాలకోసం పాకులాడడం స్వామివారికి ఎక్కువ బాధకలిగించే విషయం. ఇది వారికి కాస్త కోపాన్ని, ఆవేదనని కూడా కలిగించింది ఎందుకంటే, మనమందరం చుక్కానిలేని, తెడ్డులేని, గమ్యంలేని ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఇది కేవలం లంపటాలలో ముంచుతుంది కాని ఉద్ధరణలో కాదు. సంప్రదాయాలకు ఎక్కువ విలవనివ్వడంతో శ్రీవారిని కొందరు ఛాందసులుగా భావించారు. కాని ఇప్పటి మన ఈతిబాధలు, కష్టాలు, కడగండ్లు, సమస్యలు కడతేరాలి అంటే అది పరమాచార్య స్వామివారి కరుణ వల్లే సాధ్యం.
ఆదిశంకరుల అవతారమే కాదు, సాక్షాత్ పరమశివ అవతారమైన మన మహాస్వామివారి బోధనల మేరకు మన బ్రతుకులను అనుసరించుకుని అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాము. నీలకంఠుడు, బృహదీశ్వరుడు, పరమేశ్వరుడు ఆ సదాశివుడు సాకార రూపంతో మానవ శరీరంతో కొద్దికాలం క్రితం వరకూ మన మధ్యనే తిరిగాడు.
పరమాచార్య స్వామివారు ఆచరించిన ధర్మనిష్టతో, నియమాలతో బ్రతకడానికి మనలాంటి అల్పులకు కుదరకపోయినా మనం చెయ్యగలిగినంత, పాటించగాలిగినంత మాత్రం తప్పకుండా ఆచరించాలి.
--- సి.యన్. కుప్పుస్వామి. “kamakoti.org” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।