Online Puja Services

ఆశావాదం

3.15.226.5

*ఆశావాదం*

రాతి నేలమీద పడ్డా, తడి తగిలేదాకా లోతుగా వేళ్లను విస్తరిస్తూ కష్టమ్మీద మొక్కయి మానై చివరకు కొండ చెట్టయి సగర్వంగా చిగుళ్లు మెలేస్తుంది విత్తనం. పులి లాంటి క్రూరజంతువు వేగంగా వెంటాడుతుంటే బతుకు మీద ఆశను వదులుకోకుండా కూరజంతువులా మిగిలిపోకుండా గుండెలు అవిసిపోయేలా ఎగిరిదూకుతూ శాయశక్తులా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది జింక పిల్ల. సృష్టిలో ఏ జీవీ ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదు. కొన్నిసార్లు ఓడిపోతాయేమోగాని, లొంగిపోవవి. చచ్చిపోవాలని ఏ
జీవీ కోరుకోదు- ఒక్క మనిషి తప్ప! జీవితంలో ఘోరంగా ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకు లోనైనప్పుడు చనిపోవాలని ఆలోచించేది మనిషి ఒక్కడే!

ఆ దశలో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని. గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కణకణలాడుతూ ఉండటమే ఆశావాదానికి నిర్వచనం. సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథం మనిషిని విజయ తీరాలకు తప్పక చేరుస్తుందని మన ప్రాచీన సారస్వతం కోటి గొంతులతో చాటిచెప్పింది. జీవం తొణికిసలాడుతూ నిండు నూరేళ్లు చూద్దాం... నూరేళ్లు విందాం... నూరేళ్లూ మాట్లాడుతూ ఉందాం అని వేదం ప్రోత్సహించింది. సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలేఉందన్న ఆశతో మనిషి జీవించాలని మన వాంగ్మయం బోధించింది.

లంకలో సీత కోసం గాలిస్తూ వాయుసుతుడు ఓ దశలో విసిగి వేసారిపోయాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. చనిపోదామనుకున్నాడు. చితిని రగిల్చి దానిలో దేహత్యాగానికి సిద్ధపడ్డాడు. ఆ క్షణంలో గుండెలోతుల్లో చిన్న ఆశ మొలకెత్తింది. సీతమ్మ కంటపడుతుందన్న విశ్వాసం చిగురించింది. ‘జీవన్‌ భద్రాణి పశ్యతి... చచ్చి సాధించేదేమీ లేదు. బతికిఉంటే సుఖములు బడయవచ్చు’ అనుకున్నాడు. తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు. అద్భుత విజయాన్ని సాధించాడు. తాను బతికాడు, తోటి కపివీరులను బతికించాడు.

ఫ్రెంచి విప్లవంపై తాను అద్భుతంగా రూపొందించిన రాతప్రతి తన కంటి ఎదుటే అగ్నికి ఆహుతి కావడంతో థామస్‌ కార్లయిల్‌ అనే గొప్ప రచయిత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. పిచ్చివాడిలా తిరుగుతుంటే ఒక రోజు ఇటుక ఇటుకగా శ్రద్ధగా గోడను నిర్మిస్తున్న తాపీ మేస్త్రీ కనిపించాడు. ఏదో మెరుపు మెరిసినట్లు కార్లయిల్‌లో ఆశావాదం మొలకెత్తింది. తాపీ మేస్త్రీ పనితీరు స్ఫూర్తిగా రోజుకో పేజీ రాయాలన్న ఆలోచన తోచింది. తిరిగి రచన మొదలుపెట్టాడు. అది మొదటిదానికన్నా అద్భుతంగా రూపొందడం చూసి తానే ఆశ్చర్యపోయాడు. రెట్టించిన ఉత్సాహంతో ఆ బృహత్తర గ్రంథాన్ని పూర్తిచేశాడు. ‘వీరులు, వీరపూజ (హీరోస్‌ అండ్‌ హీరో వర్షిప్‌)’ పేరుతో విడుదలైన ఆ పుస్తకం ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. కార్లయిల్‌కు అంతులేని కీర్తిని తెచ్చిపెట్టింది.

విజేతలెవరూ జీవితం నుంచి పారిపోరు. ఓటమిని ఓ పట్టాన అంగీకరించరు. మాట్లాడటం సరిగ్గా రాదని బాల్యంలో హేళనకు గురైన విన్‌స్టన్‌ చర్చిల్‌ పట్టుదలతో ప్రసంగ కళను సాధన చేశాడు. ప్రపంచం చెవులొగ్గి వినే గొప్ప వక్తగా పేరు గడించాడు. పొట్టివాడివి, సినిమాలకు పనికిరావు పొమ్మని చార్లీ చ్లాపిన్‌ను తొలుత కొందరు నటుడిగా అంగీకరించలేదు. కానీ, అచిరకాలంలో చాప్లిన్‌ నటనకు పాఠ్యగ్రంథంగా రూపొందాడు. 

విజేతలందరూ నమ్ముకొనేది ఆశావాదాన్నే. ఆశావాదాన్ని ఆశ్రయిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఆశావాదం ఎల్లవేళలా గెలుస్తుంది. మనిషిని గెలిపిస్తుంది. బతుకు మీద రుచిని పెంపొందిస్తుంది. ఆశ- చీకట్లో చిరుదివ్వె.

రమేష్ నాయుడు సువ్వాడ

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya