Online Puja Services

అన్య మత ప్రచారకునికి బోధ చేసిన గురువులు

3.137.210.249

గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు, వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు

జగద్గురువులు : " మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ? "

క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] : " స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. "

గురువులు : " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?
" క్రై. మ. ప్ర.: " నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "

గురువులు : " మీరు ఉపదేశించునది యేమి ?
" క్రై. మ. ప్ర.:" "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి , వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. "

గురువులు :" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా? 
“క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను "

గురువులు : " మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?
" క్రై. మ. ప్ర.:" మా మతము పుట్టి 1973 సంవత్సరాలయినాయి "

గురువులు :" సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?
" క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. "

గురువులు :” మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?
" క్రై. మ. ప్ర.:" మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది "

గురువులు :" సరే, మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా? 
“క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. "

గురువులు :" ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా, మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?"

క్రై. మ. ప్ర.:" [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి "

గురువులు :" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా ? అందువల్ల , మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?
" క్రై. మ. ప్ర.:" [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.

గురువులు :" సరే, అట్లాగే కానివ్వండి, ఆ సంగతి వద్దు. చూడండి, ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ, సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా, దానికేమిటి కారణము ?
" క్రై. మ. ప్ర.:" దీన్నంతటినీ భగవంతుడే చేసినాడు "

గురువులు :" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?
" క్రై. మ. ప్ర.:" అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము. "

గురువులు :" భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా ? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ? 
" క్రై. మ. ప్ర.:" [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? "

గురువులు :" మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే, అదీ ఉండనివ్వండి, మరొక విషయము; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు, చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ? 
“క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు."

గురువులు : "అందుకే అడిగినాను, వారు వెళ్ళేది స్వర్గానికా, లేక నరకానికా?
" క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు "

గురువులు :" అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?"
క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను "

గురువులు :" సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?
" క్రై. మ. ప్ర.:" భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు "

గురువులు :" ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?
" క్రై. మ. ప్ర.:" అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది "

గురువులు :" సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో, దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి
" క్రై. మ. ప్ర.:" కానివ్వండి స్వామీ, చెప్పండి "

గురువులు :" ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత, దేవుడు ఏదో ఒకరోజు న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ, కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ?
“క్రై. మ. ప్ర.:" ఔనౌను, తమరు చెప్పింది సరిగ్గా ఉంది"

గురువులు :" ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే, విచారణకు మొదట, ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే, దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ కారణమూ, అనుమతీ లేకుండా, విచారణ చేయకుండా ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు, “ఒకడు మృతుడయిన తరువాత వాడికి, ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ అనగా, కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి, అదంతా అయ్యే వరకూ, ’నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే, అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?"

జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ ,

" మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో, ’మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు, నరకమూ, దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు, ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది." అని ఉపదేశించినారు.

ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు.

ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,

|| సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ ||

"మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు, జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము, భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము.

|| స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి .

జయ జయ శంకర |
హర హర శంకర||

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya