Online Puja Services

ధర్మం

18.117.71.239
ధర్మం 

ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.

ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?

‘అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం’ అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- “ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?” అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, ‘వాడికి ఆకలిగా ఉంది’ అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- ‘తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!’ అని.

పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులో‌చెయ్యి పెడుతూ- “మీకు ఎంత చెల్లించాలి?” అని.

“నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!”అన్నది ఆ యువతి నవ్వుతూ. “దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!” అన్నది.

పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. “అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి” అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.

ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది-
ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.

చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.

ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. ‘ఎలాగైనా ఆమెను రక్షించాలి’ అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!

ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందో‌మరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.
ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె… బిల్లు చివర్లో‌ రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:

ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.
సం/-

దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!

మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore