Online Puja Services

ఒక్క క్షణం

3.135.208.189
ఒక్క క్షణం.....
 
ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు.
చాలా చక్కని వాక్పటిమ గలవాడు.
 
ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.
 
ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది.
 
ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.
 
కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా.. ఎంత మంది తినటంలేదు.. నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......' అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.
 
అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.
 
దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను.
మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.
 
పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.
 
జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు...
 
|| ఓం నమః శివాయ ||
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore