జన గణ మనం ఆధ్యాత్మిక ఘనం
జన గణ మనం
ఆధ్యాత్మిక ఘనం
జర్మన్ భాషావేత్త మాక్స్‌ముల్లర్‌ను అక్కడి విలేకరులు అడిగారు...
‘పునర్జన్మ ఎలా ఉండాలని ప్రభువును కోరుకుంటారు’ అని...
‘భారత దేశంలో పుట్టించమని అడుగుతాను’... ఠక్కున సమాధానం చెప్పారాయన...
*ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసులు, రససిద్ధులు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ను అమెరికాలో స్థిరపడమని, కోరినవన్నీ ఇస్తామని ఒత్తిడి చేశారు అక్కడి ప్రముఖులు ‘అమెరికాకు నాతోపాటు గంగామాయీ ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించారాయన.
* ఈ ప్రపంచాన్ని రైలుబండితో పోలుస్తూ సత్యసాయిబాబా ‘భారతదేశం దానికి ఇంజిను’ అన్నారు. అప్పుడు విదేశీ పాత్రికేయులు ఆయనను అడిగారు ‘దేవతలందరూ మీ దేశంలోనే ఎందుకు పుడతారు?’ అని దానికి బాబా బదులిస్తూ ‘డ్రైవర్ ఇంజిన్‌లో కాకపోతే బోగీల్లో ఎక్కుతారా?’ అని ప్రశ్నించారు.
* స్వామి వివేకానంద చికాగో ప్రసంగాలను సమీక్షిస్తూ ‘‘భారతీయమైన ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి ఆయనలో ఉప్పొంగాయి. ఆ దేశపు ప్రత్యేకత విశ్వానికి వెల్లడయింది’ అని ఒక పత్రిక రాసింది.
మహాత్ములు, కారణజన్ములు సైతం ఈ దేశాన్ని అదే విధంగా దర్శించారు. తరించారు!
నిజానికి భారతదేశమే ఒక తత్త్వశాస్త్ర గ్రంథం. సనాతన ధర్మమనే పటిష్ట పునాదులపై వెలసిన నిలువెత్తు హర్మ్యం. ఆధ్యాత్మికత దాని జీవ రసాయనం. ఆధ్యాత్మికత అంటే మతం కాదు. అదో గొప్ప నాగరికత. సంఘ జీవన హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం. మనిషిని అభివృద్ధి వైపు ప్రోత్సహించే మహా చైతన్యం. ఒక జాతి నాగరికతను అంచనా వేయాలంటే ఆ దేశ జనాభా లెక్కలు పనికిరావు. సంస్కృతీ స్వరూపమే దాన్ని నిర్ణయిస్తుంది. ‘నాగరికత అనే పదార్థానికి రూపాన్నిచ్చేది సంస్కృతి’ అని అరిస్టాటిల్ నిర్వచనం. చాలా దేశాలు పురుడు పోసుకోకముందే మన దేశ సంస్కృతి, నాగరికత సర్వసంపన్నంగా అలరారాయి. ఆ వైభవానికి మూలం మన ఆధ్యాత్మిక నేపథ్యమేనన్నది నిస్సందేహం. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.. భారతదేశాన్ని ‘భగవంతుడి అనుగ్రహం పొందిన దేశాల్లో ముందు వరసలోని’దన్న నేపథ్యం ఇదే.
మనకు ఇష్టదైవం ఒకరు ఉంటారు. రాముడో, కృష్ణుడో, అల్లాహ్, క్రీస్తు ... ఇలా. వారిపై మన భక్తి వ్యక్తిగతం. కానీ దేశభక్తి నిర్వచనం వేరు. ఇక్కడ భక్తి అంటే ప్రేమ, గౌరవం. ఇక్కడున్న ప్రజలు, మట్టీ, నీరూ, చెట్టూ, పుట్టా, వనరులు అన్నిటిపై అవ్యాజమైన అనురాగం. ఇది నాది అనే భావన. ఈ దేశాన్ని ప్రేమించడమంటే దాని జీవ లక్షణాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన పెంచుకోవడమే. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్నపానీయాలు, వస్త్రాభరణాలు, కళ, సంగీత, సాహిత్య, విజ్ఞాన విశేషాలు, భాషలు... ప్రజల మనుగడలో నుంచి తొంగిచూసే అన్ని అంశాలను కలిపి పోగేస్తే అది ఆ దేశపు సాంస్కృతిక స్వరూపమవుతుంది. ఓ జాతి నాగరికతను, ఔన్నత్యాన్ని అంచనా వేయాలంటే ఆ దేశంలో విలసిల్లిన సాంస్కృతిక వైభవాన్ని అర్థం చేసుకోవాలి.
పండగల్లో, పుష్కరాల్లో, కుంభమేళాల్లో ఈ దేశ సంస్కృతికి చెందిన విశ్వచైతన్యంతో పరిచయం కలుగుతుంది. అయితే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో రెండు పండగలు మాత్రం అందరివీ. ఒకటి స్వాతంత్య్ర దినోత్సవం, రెండోది గణతంత్ర దినోత్సవం. ఈ పండగల సందర్భంగా దేశంపై కలిగిన భక్తిని కడదాకా కాపాడుకుంటున్నామా? ఈ సంస్కృతికి నిజమైన వారసులవుతున్నామా? అనేది నిరంతరం సమీక్షించుకోవాలి. ‘నేనంతా ఓ పిడికెడు మట్టే కావచ్చు. కానీ కలం ఎత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంటుంది’ అన్నారు కవి శేషేంద్రశర్మ. ఆ పోలిక ఆత్మగౌరవానికి పరాకాష్ఠ. జైహింద్ అనేది మామూలు పదం కానే కాదు. దేశమాతకు ఇష్టమైన సుస్వరవేదం. ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అన్న తిలక్ మహాశయుని పిలుపు స్వాతంత్రోద్యమానికి ఇచ్చిన ఊతం అంతా ఇంతా కాదు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలు అలాంటి ఉజ్వల ఘట్టాలను సంస్మరించుకోవాల్సిన రోజులు. జాతి ఉత్తేజానికి ఉత్ప్రేరకాలు. ‘అనో భద్రాణి క్రతవోయన్తు విశ్వతః’ అన్నది భారతీయ ఆధ్యాత్మిక సందేశం. దశ దిశల నుంచి సర్వోన్నతమైన ఆలోచనలు మానవాళిని ఆవరించుగాక అని రుగ్వేదం దీవించింది. ఆ భావ వైశాల్యం భారతదేశ సంపద.
‘సాటిలేని జాతి, ఓటమెరుగని కోట నివురుగప్పి నిదురపోతుండాది’ అన్న కవి వాక్కు ఇప్పటికీ వర్తిస్తుండడం దురదృష్టకరం. ‘దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి నరుల చెమటను తడిసి మూలధనం పంటలు పండవలెనోయి’ అన్న గురజాడ ప్రబోధం ఇప్పటికీ, ఎప్పటికీ జాతికి దిశానిర్దేశమే. ‘ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడనీ స్వర్గ ఖండమ్మున’ అన్న దివ్యభావన గుండె పొరలను తాకితే మన ఖ్యాతి నిత్యస్మరణీయం అవుతుంది.
భారతదేశం ఒక అద్భుత కూడలి. ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు, పండగలు, పబ్బాలు, విభిన్న సంస్కృతుల మేలు కలయిక. అవన్నీ అమూల్య మణిమాణిక్యాలనుకుంటే వాటిని దండలో దారంలా కలిపి ఉంచేది ఈ దేశ ఆధ్యాత్మిక చైతన్యం. దాని సమ్మోహనశక్తి అనన్య సామాన్యం. ఈ దేశం ఇప్పటికీ ఒక్కటిగా ఉందంటే ఆ చైతన్యమే మూల సూత్రం. దేశ విదేశాలు మనకేసి చూపు సారించడానికి ఆ శక్తే కారణం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తున్న ఆధ్యాత్మిక కాంతి పరివేషమే ఈ దేశ ప్రధాన ఆకర్షణ. ఈ ఆకర్షణే వివేకానందుణ్ణి అంతర్జాతీయ వేదికలపై విజేతను చేసింది. వివిధ దేశాల తత్త్వవేత్తలను విశేషంగా ఆకర్షించింది. భారతీయ ఆత్మను జాగృతం చేస్తోంది. ఈ దేశ సమైక్యతకు, సంఘీభావానికి మంత్ర దండమై నిలుస్తోంది. గెలుస్తోంది.
ఎర్రాప్రగడ రామకృష్ణ