భారతీయ విజ్ఞానం అనంతం
భారతీయుల కాలమానం శకముల ప్రకారమే తీసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడై ముప్పది ఆరు వర్షాలు ఏలాడు. అది యుధిష్ఠిర శకం. అటు పిమ్మట కృష్ణావతార సమాప్తితో కలి ఆరంభంతో పాండవులు పరీక్షిత్తు కుమారుడు జనమేజయునికి పట్టాభిషేకం చేసి వారు దేశాటనం వెళ్లి స్వర్గారోహణం చేశారు. కలి శకం బిఫోర్ కామన్ ఎరా 3102 సంవత్సరం లో ఆరంభం అయిందని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. భారతీయ ఖగోళ శాస్త్రం ఎక్కువగా ఉజ్జయిని పరిశోధన కేంద్రంగా ఆవిష్కరించ బడినది. అత్యంత ప్రాచీనమైన సూర్య సిద్ధాంతం భారతీయ ఋషులుకు త్రేతాయుగంలో ని ఉత్తర భాగములో ఆవిష్కరించారు. ఆ సిద్ధాంతం అనేక మార్లు లుప్త మై మళ్లీ మళ్లీ అనేక మార్లు దీనిని భారతీయ శాస్త్రజ్ఞులు మళ్లీ మళ్లీ ప్రతిపాదించారు. ఆర్యభట్టీయం, మహా భాస్కరీయం, లఘు భాస్కరీయం ఇత్యాదులు ఎన్నో అరబ్బుల ద్వారా ఐరోపా దేశాలకు గణితం తో సహా వ్యాప్తి చెందాయి అన్నది మానవ విజ్ఞానం మీద కనీస అవగాహన ఉన్నవారికి తెలిసిన సత్యం.
భారతీయ ఖగోళ విజ్ఞానం అత్యంత ప్రాచీనమైనది మరియు విస్తారమైనది. గ్రీకులు, ఈజిప్టియన్స్, రోమనులు, యూదులు ఇత్యాదులు భారతీయ సంస్కృతి నుండే వీటిని సంగ్రహించారు అని అనేక పరిశోధనలు సలిపిన ప్రొఫెసర్ జీన్ సిల్వయిన్ బైలీ ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు తన పరిశోధనాత్మక వ్యాసాల్లో భారతీయ విజ్ఞానం ఆనంతమని వ్రాసారు.