Online Puja Services

జ్యోతిష్యం కర్మసిద్ధాంతం

3.16.47.89

జ్యోతిష్యం కర్మసిద్ధాంతం :


ఈ రోజు మనమున్న స్థితికి గతజన్మలో మనం చేసిన కర్మఫలం కారణం. అలాగే ఇవాళ మనం చేసిన కర్మల ఫలితాన్ని రాబోయే జన్మలో మనం అనుభవించక తప్పదు. ఈవిషయాలను మన ఋషులు మనకు ఉపదేసించారు. పాపకృత్యాలే అన్నింటికీ కారణమన్నారు. భగవంతుడు కరుణామయుడు. అదే సమయంలో న్యాయమూర్తి కూడ! మనం చేసిన పుణ్యాలకు మోక్ష ఫలాన్ని అందిస్తూనే, పాపకృత్యాలకు తగిన శిక్షను అమలు చేస్తాడు. ఇది తప్పదు.

ఈ నేపథ్యంలో జ్యోతిశ్శాస్త్రం భవిష్యత్తులో మనకు జరుగబోయే విషయాలను తెలియజేసి, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మార్గదర్శకంగా ఉంటుంది. ఒక విపత్తు వస్తుందని ముందుగా తెలిస్తే, దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి, దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మనకు తెలియకుండా ప్రమాదం జరిగితే, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం కూడా భవిష్యత్తులో జరుగబోయే సంఘటనల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంది విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తుంది. కర్మ సిద్థాంతం మూడు రకాలైన కర్మలను గురించి చెబుతోంది.
1. ప్రారబ్దకర్మ: గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితాన్ని ప్రస్తుతం అనుభవించడాన్ని ప్రారబ్ద కర్మ అంటారు.
2. సంచితకర్మ: గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవించడం సంచితకర్మ.
3. ఆగామికర్మ: ప్రస్తుతజన్మలో మనం చేస్తున్న కర్మల ఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించేదిగా రూపుదిద్దుకోవడాన్ని ఆగామికర్మ అనంటారు.
మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. శ్రీకృష్ణ భగవానుడు మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుంది. గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జ్యోతిష శాస్త్రం, జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ప్రభావాన్ని తగ్గించి మనిషికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.
ఎవరైనా... పరిహార ప్రక్రియలు పాటిస్తే... జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తి పొందగలరు. అందుచేత జయం, దానం, హోమం, శాంతి, దేవాలయ దర్శన, రత్నధారణ, మొదలగు విషయాలు జ్యోతిష్యంలో చెప్పబడ్డాయి. ఇవి చేయటానికి ముందు మరికొన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు పాటిస్తే మరింత ఫలితం ఉంటుంది.
కర్మ సిద్ధాంతం అంటే (ఈ జన్మలో కాని, పూర్వజన్మలో కాని తాను చేసిన పనికి ఫలితం తానే అనుభవించాలి అని కొందరి భావన. కాని చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించుట సార్వత్రికంగా నియమం కాదు. అప్పుచేసిన వాడు తీర్చకపోతే జైలుకు పోవుట కర్మ ఫలితంగా భావిస్తే... ‘తీర్చుట’ అనే ప్రక్రియ జైలుకు పోకుండా కాపాడుతుంది. అనగా పూర్వం చేసిన కర్మకు అనుభవించుటం ఒక మార్గమైతే...
దానిని నిరోధించుట కొరకు మరో కర్మ చేయుట మరో మార్గం. కాగా జాతకంలో ఉన్నది తప్పక అనుభవించాలి. అనే విధానం మాత్రం సరియైనది కాదు.
బృహజ్జాతక వ్యాఖ్యాత భట్టత్పలుడు ‘జాతక ఫలితాన్ని అనుభవించుటే తప్పనిసరి అయితే దానిని తెలుసుకొనుట వ్యర్థం. భావి ఫలితాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల రాబోయే దుఃఖం కోసం ఇప్పటినుండి దుః ఖించడం అనే నష్టాలుండటం వల్ల జాతక ఫలితం తెలుసుకోవడమే నష్టప్రదం అవుతుంది. శాస్త్ర ప్రయోజనం అదికాదు. ఒక జాతకంలో శుభ ఫలితాన్ని తెలుసుకొని అనువైన కృషి చేయటం ద్వారా ఫలితాన్ని సంపూర్ణంగా సాధించవచ్చు.
జాతకంలోని దుష్ట ఫలితాన్ని విశ్లేషించి దానాదికములైన పుణ్యకర్మల ద్వారా శుభఫలితాన్ని పెంచుకోవచ్చు. దుష్టఫలితాన్ని ముందుగా తెలుసికొనుట ద్వారా దానికి వ్యతిరేదిశలో ప్రయత్నించి దుష్ట ఫలితాన్ని జయించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఆ దోష ప్రాబల్య శాతాన్ని గమనించి దాన్ని జయించడం సాధ్యం కాని పక్షంలో దానికి సిద్ధపడి తన జీవనగమనంలో అనుగుణమైన మార్పులను చేసుకోవచ్చు’ అని వివరించాడు.కర్మ ఫలితం వుంటుంది. అది దుష్టమైనదైనపుడు దాని నివారణకు చేసే కర్మకూ ఫలితం ఉంటుంది. కర్మను కర్మచేతనే జయించాలి. పూర్వం చేసిన కర్మను దానివల్ల వచ్చే ఫలితాన్ని అదృష్టమని, దైవికమని పిలుస్తుంటారు.
‘విహన్యాద్ధుర్బలం దైవం పురుషేణ విపశ్చితా’ అనే వ్యాసుని వచనం పూర్వకర్మను ప్రస్తుత కర్మచే జయించవ్చనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. మనమిదివరలో చేసిన కర్మననుసరించి మన జననం సంభవిస్తుంది. మన జననం మనచేతిలో లేదు, కాని అప్పటి గ్రహస్థితి పూర్వకర్మకు అనుగుణంగా ఉంటుంది. ఆ గ్రహస్థితి ప్రభావం కాలక్రమంలో దశాక్రమాన్ననుసరించి ఆయా భావనలు ప్రేరేపిస్తుంది.
ప్రేరేపించబడిన భావనకు స్పందించిన వ్యక్తి తన భావాలను అనుసరించి ప్రవర్తించ కుండా శాస్త్రం, సామాజిక న్యాయం, అనుభవం ఆధారంగా చేసుకొని వివేకంతో ప్రవర్తించి మంచిని పెంచుకోవడం, చెడ్డను తొలగించుకోవడం, చేయవలసి వుంటుంది. దోషఫలితం సిద్ధించే సమయాన్ని జాతకం తెలుపుతుంది. దానిని ముందుగా గుర్తించడం ద్వారా దానిని జయించే అవకాశాన్ని జాతకం కల్పిస్తుంది.
లఘుజాతకంలో ‘యదుపచిత మన్య జన్మని శుభ శుభం తస్య కర్మణః పంక్తిం వ్యం జయతి శాస్తక్రులత్‌ తమసి దైవ్య ణి దీపమేవ’ అన్నారు వరాహమిహిరుడు. పూర్వజన్మలో చేసిన శుభాశుభ కర్మల యొక్క ఫలానుభవ కాలాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయంతో గుర్తించినట్లుగా కలుగబోయే శుభాశుభాలను జాతకం ద్వారా గుర్తించి అనుకూల,వ్యతిరేక ప్రక్రియల ద్వారా జీవితాన్ని సుఖవం తం చేసుకొనుటకు ఈ శాస్త్రం సహకరిస్తుంది.

 

రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore