బాంధవ్యాలు
అమృత వాక్కులు
బాంధవ్యాలు
భాందవ్యాలు రెండు రకాలు
1) జన్మ భాందవ్యం 2) వివాహ భాందవ్యం :
1) జన్మభాందవ్యం అంటే తల్లీ తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లలు అలానే తన జన్మతో ఏర్పడ్డ లేక కలిగిన బంధువులు.
2) వివాహ బంధవ్యం అంటే భార్య లేక భర్త, అత్తమామలు, వదినమరదళ్ళు, బావబామ్మర్దులు ఆలా వివాహం వల్ల కలిగిన బంధువులు. బంధుత్వంలో ఆత్మీయతల కన్నా మర్యాదలకు ప్రాధాన్యం ఎక్కువ. మనతో ఎలాంటి సంబంధం లేని వారైనా మన ఎదుగుదల చూసి అసూయతో రగిలిపోతారు. అదను చూసుకొని అపకారానికి తలపడతారు. “ఏ కొరివి నిప్పు ఆ కొరివినే కాలుస్తుంది” అన్నట్లు ఎవరి అసూయ, ద్వేషాలు వారినే కాలుస్తాయి. మృత్యుపాశబద్దుడికి వైద్యం నిష్ఫలమైనట్లు, పతనావస్థలో ఉన్నవారికి మంచిమాటలు రుచించవు. ఆపత్కాలంలో కొందరు ఆత్మీయులైపోతారు, అండగ వుంటారు. వీటినే భావ బంధాలంటారు. మనం గ్రహించాల్సిన విషయం - బంధువులకు దూరం కావడం అంటే భగవంతుడికి దగ్గర అవుతున్నామని. బంధు ప్రీతినుంచి దైవప్రీతికి మారిపోవాలి. ప్రాపంచిక బంధాలన్నీ తాత్కాలికమే. దైవబాంధవ్యమే శాశ్వతం. లోకాలన్నీ నశించినా ఆయన నశించడు. అందుకే అవ్యయుడు అంటారు.
శ్రీరాముడి సహనశీలత, శ్రీకృష్ణుడి శాంతి బోధ, ఏసుక్రీస్తు ప్రేమమార్గం, బుద్ధుడి అహింస, మహమ్మద్ క్షమాగుణం వారిని అంతెత్తున నిలబెట్టాయి. మానవ జీవన లక్ష్యం, మోక్షం మొహాన్ని వీడి, స్వార్థాన్ని తగ్గించుకొని, తోటి మనిషిని దేవుడిలా చూసే దశనే మోక్ష స్థాయి అని పెద్దలు పేర్కొంటారు. అది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. మోహ క్షయమే మోక్షం. అదే వేదాంత మార్గం.
- బిజ్జా నాగభూషణం