చిత్తశుద్ధి

అమృత వాక్కులు
చిత్తశుద్ధి
ప్రసాదం అంటే దయ, కృప అని అర్థం. సత్ కర్మలు చేస్తే సత్కారం, దుష్కర్మలు చేస్తే ఛీత్కారం - రెండూ తప్పవు. సత్య చేతనంతోనే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు అంటారు అరవిందులు. మనిషి ఏ రంగాన్ని, శాఖను లేదా ప్రవృత్తిని ఎంచుకున్నా చిత్తశుద్ధి కలిగి ఉండాలి అంటాడు విదురుడు. జలప్రవాహామైనా కొన్నేళ్ళకు కఠిన శిలను కరిగించేస్తుంది. మధుర వచనమైనా పాషాణ హృదయాన్ని కరిగేలా చేస్తుంది. మధుర భాషణం పరహితాన్ని కోరేదై ఉండాలంటుంది మహాభారతం. మాట, మౌనం నాణానికుండే బొమ్మ బొరుసు లాంటివి.
దేహమే దేవాలయం. వాస్తవాన్ని విచారిస్తే స్త్రీ పురుష బేధం లేదు. శ్రమను మించిన సౌందర్యం లేదు. కాయకం అంటే శ్రమ. పనిని మించిన దైవం లేదు. కష్టాన్ని మించిన దైవభక్తి లేదు. చేస్తున్న పనిని శ్రద్ధతో చేయడం పూజతో సమానం. కాయమే కైలాసం అంటూ నవ్యభక్తి సిద్ధాంతాన్ని చాటాడు బసవన్న. శివ భక్తి ఏమిస్తుంది? శక్తినిస్తుంది, ముక్తి నిస్తుంది. ఇక్కడ సంసారాన్నిచ్చింది, సంస్కరణాభిలాషాన్నిచ్చింది. ఓ మహోద్యమంగా మారి కొత్త దారులు చూపింది. అది వీరశైవం. దాని స్థాపకుడు బసవేశ్వరుడు. సమాజంలోని అసమానలతపై ఆయన చేసిన పెను గర్జనలు ఇప్పటికీ ఘంటానాదమై మోగుతున్నాయి.
- బిజ్జా నాగభూషణం