ధనమూలం ఇదం జగత్
అమృత వాక్కులు
ధనమూలం ఇదం జగత్
ఈ క్రింది వాటి నిర్వచన వివరంగా వ్రాసాను.
1) కాంచన (అంటే ధనం) - ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఇది వున్న కోటీశ్వరులు బంగారు పళ్ళెంలో బోంచేస్తున్నారు. ఇది లేని వారు తినడానికి అన్నం కోసం బిక్షాటన చేస్తున్నారు. ఇదే ధనం కోటీశ్వరున్ని బిక్షగాన్ని చేయవచ్చు, బిక్షగాన్ని కోటీశ్వరున్ని చేయవచ్చు. ఇది వుంటే కుటుంబం, బంధువులు, స్నేహితులు, సమాజం గౌరవం ఇస్తుంది, లేనిచో దగ్గరకు రాకుండ చేస్తుంది. మనిషే ఈ ధనాన్ని సృష్టించి దానికి బానిసైపోయాడు. ఇది చంచల మయినది ఒక చోట చాలావరకు నిలబడి వుండదు. ఎవరి దగ్గర నిలచి వుంటుందో వారు అదృష్టవంతులు. నిలకడ లేని ఈ ధనం వున్నవారు, లేనివారుగా రెండుగా చీల్చింది. వీరి మధ్య అంతరం సృష్టిచింది. ఈ ప్రపంచంలో. ఇది మనుషులచేత ఆడిస్తుంది, పాడిస్తుంది, మంచి, చెడూ అన్నీ చేయిస్తూ ఇది ప్రపంచంలోనే పై చేయిగా నిలచింది, దీనికి ప్రజలు దాసోహం.
2) సత్యం - "సత్యా న్యాస్తి పరమోధర్మ:”.
అంటే సత్యాన్ని అనుసరించడమే సనాతన ధర్మం. సత్యము పలికిన హరిశ్చంద్రుడు కాటి కాపరి అయ్యాడు. ఈ కలియుగంలో కూడ సత్యము పలికేవారు అష్టకష్టాల పాలవుతున్నారు. అయినా సడల కుండా సత్యాన్నే పాటించేవారు తీవ్ర దరిద్రాన్ని అనుభవిస్తున్నా, వారికి ఈ లోకం జోహార్లు సమర్పిస్తూ, వారి కీర్తి ప్రతిష్టలు సువర్ణాక్షరాలతో చరిత్ర పుటలలో లికింపబడుతాయి.
3) శరీరం - "శీర్యతే ఇతి శరీరః” అంటే రోజు రోజుకు క్షీణిస్తుందని.
ఇది తెలిసినలోకం, దానికి అలంకారాలకేమి కొదవ లేకుండ ఎదుటివారిని ఆకర్శించుకోవడానికి శాయాశక్తులా ప్రయత్నం చేసి సినిమా, టీవీలకు మించి శరీర ప్రదర్శన చేస్తూ ఆఖరి క్షణం వరకు వెంపర్లాడుతున్నారు. కానీ ఈ శరీరం, ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష ప్రాప్తికి, సేవా తత్పరతకు అనువైన ఉపకరణం. మానవ శరీరమే ఉత్తమమైన పనిముట్టు.
- బిజ్జా నాగభూషణం