ఆనందం
అమృత వాక్కులు
ఆనందం
సంతోషం తాత్కాలికం. మానవుడికే పరిమితం. మానవుల చంచల స్వభావానికి సంతోషం ఆలంబన. భగవంతుడు ఆనంద స్వరూపుడు. మానవులకు కలిగే ఆనందమే భగవంతుడి నిర్గుణ స్వరూప ఆనందం. సంతోషం నిత్యజీవితంలో కొద్ది భాగం మాత్రమే. ఆనందం వస్తే తొలగి పోదు. మరింత పెరుగుతుంది. ధనం వస్తుంది పోతుంది. నిజాయితి వస్తుంది. పెరుగుతుంది అనే సామెత సంతోషానికి, ఆనందానికి వర్తిస్తుంది.
భగవంతుడి రూపమే ఆనందం. వారి వైభవం ఆనందామృతం. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుండే వాడు దేవుడు. ఎమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్లుండే వాడు జీవుడు. తెలిసీ తెలియని జివుడు సంతోషం కోసం ఆరాటపడతారు. శాశ్వతమైన ఆనందాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. సంతోషంతో తృప్తి చెందక భగవంతుడి ఆనంద స్వరూపాన్ని పొందడమే ఆధ్యాత్మిక తత్వం. సంతోషం లౌకిక, భౌతిక విషయాల వల్ల లభిస్తుంది. ఆనందం ఆధ్యాత్మిక మార్గానికి మాత్రమే పరిమితం. మనలో ఉన్న అంతర్యామిని లోపలి చూపులతో దర్శించ గలిగితే ఆనందం మనవశమవుతుంది. మార్కండేయ మహర్షి చివరకు ఆనందమే పరబ్రహ్మ స్వరూపమని గ్రహించాడు.
“అనుకంప” అంటే మరొకరికి కష్టం , వేదన, భాద, కలిగినపుడు, అది తనకే కలిగినట్లుగా భావించి దాదాపు వారిలాగే స్పందించి, వారి ఆవేదన, దుఃఖాన్ని పంచుకొని దాన్ని వీలైనంత త్వరగా తొలిగించేందుకు ఆరాట పడే లక్షణం. ఇలాంటి అనుకంపతో సాటివారి కష్టాలకు స్పందించి తమ శ్రమ, శక్తి, ధనం పీడితుల పీడను తొలిగిచేందుకు ధారాళంగా దారపోసేవారినే సమాజం మహనీయులు గా , మహానుభావులుగా గుర్తిస్తుంది. అనుకంప వెనుక భావం “అందరూ నాలాంటి వారే” అనే సమదృష్టి. ఇది అహంకారానికి మూలం కాదని అంటాడు తులసీదాసు. “ఇతరులను ఆనందంగా ఉంచాలన్న అనుకంప అవసరం. నువ్వు ఆనందంగా వుండాలన్నా అనుకంప అవసరం” అన్నారు దలైలామా ఇంచుక మార్మికంగా ఎంత మంచి మాట.
- బిజ్జా నాగభూషణం