తృప్తి
అమృత వాక్కులు
తృప్తి
జీవితంలో ఏం కావాలను కుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా భాదను కలిగిస్తుంది. దక్కిన దాంట్లోనే ఆనందం వెతుక్కునే వారు మరో రకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. ప్రక్రియ, ప్రయాణం, ప్రయత్నం మూడింటిలోనూ ఆనందముంటుందని గ్రహించాలి. మనిషికి ఎప్పుడు, ఏది ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికీ జీవితాలు ఆశ్చర్యాలు, సాహసాలు, చర్య, ప్రతిచర్యల సమాహారమే జీవితం. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించే వారు కొందరైతే, మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించే వారు మరి కొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామనేదే ముఖ్యం. అదే జీవిత సత్యం.
మనిషి అభ్యాసం కోసమే ఈ ప్రపంచం. చేయాల్సిన దాన్ని విసుగు లేకుండా సాధన చేయడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. ఆ కర్తవ్య నిర్వహణే వ్యక్తిత్వాలను నిర్మిస్తుంది. అదే మనిషికి పరిపూర్ణతను, ముక్తిని ప్రసాదిస్తుంది. కర్తవ్యం అవసరమైన క్రమశిక్షణను, ఒక సమస్థితిని నేర్పుతుంది. మనిషికి. "అన్ని జీవుల పట్ల ప్రేమ కలవాడు, నిజాన్ని మాట్లాడేవాడు, సున్నిత మనస్కుడు, ఉన్నత భావాలు కలవాడు, అందరినీ ఆదరించేవాడు, అతిచనువు చూపనివాడు, మంచి మనసు ఉన్నవాడు ప్రపంచంలో అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతాడని, కీర్తి మంతుడవుతాడని విదురుడు స్పష్టం చేశాడు. పెద్దలు చెప్పినట్లు - సత్సంగం కల్పవృక్షం లాంటిది. ఇది ఐహిక ఆముష్మికాభీష్టాలను సాధించి పెడుతుంది. అయితే వారు చెప్పింది చిత్తశుద్ధితో ఆచరించాలి. మహాత్ములు ఉపదేశించిన మంచి మాటలే అమృత వృష్టి - మనలోని పాపాలన్నింటినీ మటుమాయం చేస్తుంది.
- బిజ్జా నాగభూషణం