విషయ వాంఛలు
అమృత వాక్కులు
విషయ వాంఛలు
శరీరమంతా నిండివున్న విషయవాంఛలనే విషాన్ని హరించేవాడు ఆ శ్రీహరే అని తెలియగలరు. ఈ శరీరమనేది విషపు మడుగు. విషయభోగాలనేవి పడగలు. ఆ పడగలు వెదజల్లే కోరికలే విషపూరితమైన అరిషడ్వర్గాలు. నమ్మినవారికి అంతరంగంలోనూ, నమ్మని వారికి అందనంత దూరంలోనూ ఉంటాడు ఆ పరమాత్మా. మనసు తాననుకున్నది కర్మేంద్రియాల ద్వారా నెరవేరుస్తుంది. పరిపక్వబుద్ధి సుశిక్షిత రౌతులా మనసు గుర్రాన్ని సరైన దిశలో, అనువైన వేగంతో ప్రయాణింపజేసి లక్ష్యాన్ని చేరుస్తుంది. బుద్ది, జ్ఞానాల అనుసంధానాన్ని పుష్పం సువాసనల సమన్వయంతో పోలుస్తారు. దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాలకంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పదని శ్రీ కృష్ణుడు అర్జనుడికి ఉపదేశిస్తాడు. మనసు ఆలోచనా శక్తి, చిత్తం చాంచల్య శక్తి, బుద్ధి నిర్ణయాత్మక శక్తి అంటారు విజ్ఞులు. స్వచ్ఛమైన బుద్ధి మనసును ఆధీనంలో వుంచుకొని ఉత్తమోత్తమ కార్యాలవైపు మళ్ళిస్తుంది. బుద్ధి, మనసు శరీరావయవాల సమన్వయం దేహాన్ని మోక్షమార్గం వైపు నడిపిస్తుంది. శాంతం, సహనం, ప్రేమ, అనురాగం , ఆనందం, సహకారం, ఉపకారం అనే తత్వాలు కలిగిన వారిని ఉత్తములుగా పరిగణిస్తారు. అరిషడ్వర్గాలను మనకు అనుకూలమైన హితషడ్వర్గాలుగా మలుచుకోవచ్చు.
- బిజ్జా నాగభూషణం