మధ్యే మార్గం
అమృత వాక్కులు
మధ్యే మార్గం
మధ్యే మార్గంలో జీవితం గడపాలి. దేనిలోనూ అతి అన్నది పనికి రాదు. సమత్వమే యోగంగా తెలుసుకోవాలి అన్నారు బుద్దుడు. సుఖం కలగడానికి ఏది కారణమవుతుందో దుఃఖం కలగడానికి అదే హేతువవుతుంది. అన్ని సుఖాలకంటే ఆత్మ సుఖమే గొప్పదంటారు అరుణాచల రమణులు.
సుఖదుఃఖాలు తాత్కాలికం అని తెలుస్తుంది, సత్యం అనుభూతిలోకి వస్తే, అంటారు. స్వామి వివేకానంద. ఎవరు సుఖదుఃఖాలకు అతీతం కాదని తెలుసుకొని, జీవితాన్ని జీవిస్తాడో అతడే గొప్ప మనిషి. రెండింటిలోను మానసిక సమతుల్యతను కలిగించే రసాయనాలు స్రవిస్తాయి. అవి శరీరానికి అవసరమని పరిశోధకులు అంటున్నారు. ఆదరణ - అనాదరణ, ప్రేమ - ద్వేషం, ఇష్టం - అయిష్టం, దయ - కాఠిన్యం, వంటి ద్వందాలు మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టవు. ఆయా సందర్భాలను బట్టి మనకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తాము.
సర్వజన ప్రియత్వం - ధనత్యాగం కాదు, మనో కాలుష్యాల త్యాగం. అత్యల్పమైన జీవిత కాలంలో కోపతాపాలకు, అసూయద్వేషాలకు అతీతంగా ఉండటానికి శతవిధాల ప్రయత్నించాలి. హుందాగా, మృదువుగా, ఆత్మీయంగా, నిజాయితీగా, స్వచ్చమైన మనసుతో స్పందించడం సాధన చేయాలి. సర్వజన ప్రియత్వానికి ఇంతకన్నా గొప్ప విధానం మరొకటి లేదు.
- బిజ్జా నాగభూషణం