దీపావళి
అమృత వాక్కులు
దీపావళి
అన్ని పండుగలలో ముఖ్యమైన పండగ దీపావళి. దీపావళి అంటే దీపాల యొక్క సమూహం. ముఖ్యంగా దీపావళి 1) దుష్టశిక్షణ జరిగిన రోజు, 2) అలక్ష్మీని పారదోలి లక్ష్మిని ఆహ్వానించిన రోజు.
1) నరకుడు అనే రాక్షసుణ్ణి సత్యభామ వధించి ప్రజలను కాపాడిన రోజు 2) విష్ణువు వామనరూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిన పుణ్యదినం 3) రావణున్ని వధించిన తర్వాత రాములవారు పట్టాభిషక్తుడైన రోజు 4) విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్టించిన రోజు.
దీపావళి రోజు దీపాలు వెలిగించడానికి కారణం
1) దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని పరబ్రహ్మ స్వరూపమైన దీపం ఇస్తుంది కనుక
2) దీపం రాక్షసుల వదానంతరం చీకటి పోయి వెలుతురు వచ్చినందుకు
3) సూర్యుడు తులారాశి ప్రవేశం వల్ల పితృలోకంలో పితృదేవతలకు చీకటిలో దారి చూపేందుకు
4) దీపాల సమూహంతో వెలుగులో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఇంటిలోకి ఆహ్వానించి అన్ని రకాల సంపదలు, సిరులు పొందడానికి, లక్ష్మీదేవి సంపదకు ఆలవాలం. లక్ష్మిదేవి ఈ రోజు పూజవల్ల సిరిసంపదలే కాకుండా ఆయురారోగ్యాలు కూడా ప్రసాదిస్తుంది.
అందుకే ఈ రోజు లక్ష్మిపూజ వర్తకులు వాణిజ్యంతో మొదలుపెడుతారు. ఇంతటి ప్రాముఖ్యమున్న ఈ దీపావళి పర్వదినం మీకు మరియు మీ కుటుంబ బంధు మిత్రులందరికి లక్ష్మిదేవి కటాక్షంతో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలు కలుగుగాక, ఆనంద డోలికలు ప్రసరిల్లు గాక, సుఖ సంతోషాలకు నిలయమౌగాక.
- బిజ్జా నాగభూషణం